సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలం పొగమంచుతో ప్రమాదాల ముప్పు పెరుగుతుండడంతో ఈ కింది సూచనలను, మార్గదర్శకాలను పాటించాలని బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పాదాచారుల కోసం.. పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గిపోతుంది. ఇది ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే పాదాచారులు అత్యవసరమైతే మాత్రమే రోడ్లపైకి రావాలి.
ద్విచక్ర వాహనదారుల కోసం
వేగం తగ్గించాలి.. పొగమంచు వల్ల ముందున్న వాహనాలు కనిపించకపోవచ్చు, అందుకే మిత వేగంతో ప్రయాణించాలి.
లైట్లు ఆన్‌లో ఉంచాలి.. వాహనం ముందు -వెనుక లైట్లు ఆన్‌లో ఉంచడం ద్వారా ఇతర వాహనదారులకు మీరు కనిపించగలుగుతారు.
రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలి: ఇవి వెలుతురు పడినప్పుడు మెరుస్తాయి, తద్వారా మీరు స్పష్టంగా కనిపిస్తారు.
హెల్మెట్ వైజర్‌ను శుభ్రంగా ఉంచాలి: పొగమంచు, తేమ వల్ల వైజర్ మసకబారవచ్చు. స్పష్టంగా కనిపించేందుకు తరచూ శుభ్రం చేయాలి.
ORR (Outer Ring Road) & హైవేల్లో ప్రయాణించే వారికి
లేన్ మార్చవద్దు: పొగమంచు వల్ల ఇతర వాహనాలు కనిపించకపోవచ్చు. లేన్ మారడం ప్రమాదకరం.
బ్రేక్ సాఫీగా వాడాలి: అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల వెనుక వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉంది.
ఏమర్జెన్సీ పరిస్థితుల్లో ఎడమ లేన్‌లో వాహనం ఆపాలి: ఇది ఇతర వాహనాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అవసరం.
ఈ మార్గదర్శకాలు, సూచనలు ప్రజల భద్రత, ప్రమాద నివారణ, రవాణా సౌకర్యం కోసం రూపొందించబడ్డాయడని సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం చెబుతోంది. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్న ఉదయం, రాత్రి సమయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని అంటోంది.


