క్యూ2లో రూ. 8,651 కోట్లు
ఆదాయం రూ. 52,145 కోట్లు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 8,651 కోట్లను తాకింది. పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు, స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల నుంచి అధిక చెల్లింపులు ఇందుకు దోహదపడ్డాయి.
ఆఫ్రికా లాభం సైతం భారీగా దూసుకెళ్లి రూ. 969 కోట్లయ్యింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 4,153 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం జంప్‌చేసి రూ. 52,145 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 41,473 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఆదాయంలో దేశీ టర్నోవర్ ఇండస్ టవర్స్ వాటాతో కలసి 23 శాతం ఎగసింది. రూ. 38,690 కోట్లను తాకింది. త్రైమాసికంగా సైతం ఆదాయం 5.4 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ఆఫ్రికా ఆదాయం 36 శాతం జంప్‌చేసి రూ. 13,680 కోట్లకు చేరినట్లు వెల్లడించారు.  
ఏఆర్‌పీయూ అప్ 
ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 10 శాతం మెరుగుపడి రూ. 256కు చేరింది. గత క్యూ2లో రూ. 233 మాత్రమే. ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్ కస్టమర్లు 51 లక్షలమంది జత కలవగా, పోస్ట్‌పెయిడ్ విభాగంలో 10 లక్షల మంది చేరినట్లు విఠల్ వెల్లడించారు. కాగా.. కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 11 శాతం బలపడి 62.35 కోట్లను తాకింది. దేశీ వినియోగదారుల సంఖ్య 11 శాతం పెరిగి 44.97 కోట్లకు చేరింది. పోస్ట్‌పెయిడ్ విభాగంలో కస్టమర్ల సంఖ్య 2.75 కోట్లను తాకినట్లు విఠల్ పేర్కొన్నారు. ఒక్కో కస్టమర్ మొబైల్ డేటా వినియోగం 27 శాతం అధికంగా నెలకు 28.3 జీబీకి చేరింది. దేశీ పెట్టుబడులు రూ. 9,643 కోట్ల తో కలసి మొత్తం పెట్టుబడి వ్యయాలు రూ. 11,362 కోట్లను తాకాయి. కంపెనీ నికర రుణ భారం 5 శాతం తగ్గి రూ. 1,94,713 కోట్లుగా నమోదైంది.  
ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు బీఎస్‌ఈలో 1 శాతం లాభపడి రూ. 2,074 వద్ద ముగిసింది.  

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
