అజిముత్ ఏఐతో కలిసి రూపకల్పన
ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తొలి ఇంటెలిజెంట్ పవర్ చిప్ ప్లాట్‌ఫాం, సిస్టమ్ ఆన్ ఎ చిప్ (ఎస్‌వోసీ) అయిన ‘అర్క జీకేటీ–1’ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఆవిష్కరించారు. సైయెంట్ సెమీకండక్టర్స్, అజిముత్ ఏఐ కలిసి దీన్ని రూపొందించాయి. సెమీకండక్టర్ల డిజైన్, టెక్ ఆవిష్కరణలకు హబ్‌గా ఎదగాలనే లక్ష్య సాధన దిశగా ఇదొక కీలక మైలురాయని వైష్ణవ్ తెలిపారు.
ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ టెక్నాలజీలను డిజైన్ చేయడం, అభివృద్ధి చేయడంలో భారత్ సామర్థ్యాలను ఇది తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. మలీ్ట–కోర్ కస్టమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ అనలాగ్ సెన్సింగ్, మెమొరీ, ఇంటెలిజెంట్ పవర్ మేనేజ్‌మెంట్ మొదలైన వాటన్నింటిని సమగ్రపర్చి, విద్యుత్ ఆదా చేసే ఎస్‌వోసీగా దీన్ని రూపొందించినట్లు సైయెంట్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు తెలిపారు. ఇది అత్యధిక వృద్ధి అవకాశాలున్న స్మార్ట్ యుటిలిటీలు, అధునాతన మీటరింగ్, బ్యాటరీ మేనేజ్‌మెంట్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్ తదితర విభాగాల్లో ఉపయోగపడుతుందని అజిముత్ ఏఐ వ్యవస్థాపకుడు ప్రవీణ్ వై తెలిపారు.


