భూమి ఆక్రమించారని హఠాన్మరణం
●గుండెపోటుతో మృతిచెందిన వృద్ధురాలు
పుట్టపర్తి అర్బన్: తన భూమి ఆక్రమించుకున్నారన్న విషయం తెలిసి మండలంలోని రాచువారిపల్లికి చెందిన నరసమ్మ (85) శనివారం గుండెపోటుతో మృతిచెందింది. వివరాలు.. గ్రామా నికి చెందిన నరసమ్మ (సంజీవమ్మ) భర్త గౌరన్న సుమారు 30 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి వర్ధనమ్మ, సరోజమ్మ ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నరసమ్మకు చెందిన ఇళ్లు గతంలోనే పాఠశాల నిర్మాణానికి తీసుకున్నారు. దీంతో ఆమె పుట్టపర్తిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అవసాన దశలో నడవలేని స్థితిలో కూతుళ్ల వద్ద నివసిస్తోంది. వీరికి ప్రభుత్వం సర్వే నంబర్ 560–3బీలో 5.30 ఎకరాల భూమికి పట్టా పొందారు. ఆమె గ్రామంలో లేక పోవడంతో అదే గ్రామానికి చెందిన లెక్కల ఉమాదేవి నకిలీ పట్టాదారుపాసుపుస్తకం తీసుకొని శుక్రవారం జేసీబీతో చదును చేసే పనులు ప్రారంభించారు. నరసమ్మకు విషయం తెలియగానే గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిందని కూతుర్లు వర్దనమ్మ, సరోజమ్మ చెప్పారు.


