రాజీపడితే ఓడినట్లు కాదు.. గెలిచినట్లే
అనంతపురం: రాజీపడితే ఓడినట్లు కాదు.. గెలిచినట్లే అని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు అన్నారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ లోక్ అదాలత్ నిర్వహించారు. అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్‌ను ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ప్రారంభించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో 9 బెంచులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ తీర్పుల్లో ఎటువంటి అప్పీలుకూ అవకాశం ఉండదన్నారు. రెగ్యులర్ కోర్టులలో కేసులు పరిష్కారమైనప్పుడు ఆ కేసుల్లో ఎవరో ఒక్కరే గెలిచే అవకాశం ఉంటుందన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని, ఇందులో ఇద్దరూ విజేతలేనని స్పష్టం చేశారు. మోటారు వాహనాల ప్రమాద కేసులు 54 పరిష్కారం కాగా.. మొత్తం రూ.97.45 లక్షలు, ప్రి లిటిగేషన్ కేసులు మొత్తం 41 పరిష్కారం కాగా, రూ.92.88 లక్షలు, సివిల్ దావాల్లో పరిష్కారం అయిన మొత్తం రూ.2.72 కోట్లు, ఎన్‌ఐ యాక్టులో రూ.81.36 లక్షల పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. మొత్తం 15, 574 కేసులకు గాను రూ.7.43 కోట్ల పరిహారం దక్కింది. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.


