రాప్తాడురూరల్: అది ప్రైవేట్ పట్టా భూమి. అలాంటి భూమికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఉండదు. అయినా తహసీల్దార్ పేరుతో ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఏకంగా ఫెన్సింగ్ వేశారు. బాధితులు వెళ్తే దౌర్జన్యానికి దిగుతున్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది.
రాప్తాడు మండలం మరూరులో జరుగుతున్న ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌లా మారింది. బాధితురాలు తెలిపిన మేరకు...మరూరుకు చెందిన ఎం.గోపాల్‌రెడ్డి (లేట్) సతీమణి ఎం.వెంకటలక్ష్మమ్మ సర్వే నంబరు 978 (పాత సర్వే నంబరు 646)లో 1.47 ఎకరాల ప్రైవేట్ పట్టా భూమిని 1987లో కొనుగోలు చేసింది. ఇటీవల అదే గ్రామానికి చెందిన పి.ఆదినారాయణ, పి.ప్రభాకర్, చీర్ల భాస్కర్ జేసీబీలతో తన భూమిలోకి వచ్చి చదును చేశారని వెంకటలక్ష్మమ్మ వాపోతోంది.
పి.వెంకటమ్మ, జె.నల్లమ్మ, చీర్ల లక్ష్మీదేవి, సావిత్రి, చీర్ల రాముడు పేర్ల మీద తన భూమిలో తహసీల్దార్ పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు నకిలీవి సృష్టించుకున్నారని ఆరోపించింది. ప్రైవేట్ భూమికి అధికారులు ఎలా పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తారని ప్రశ్నించింది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులను అడిగితే.. ఆ సర్వే నంబరులో అధికారికంగా తాము ఎవరికీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని ధ్రువీకరించారని తెలిపింది. ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించుకుని తన భూమిని ఆక్రమించాలని చూస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాప్తాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పింది.
కోర్టులు అనుకూలంగా తీర్పు ఇచ్చినా...
తన అనుభవంలో ఉన్న ఈ భూమిపై గతంలోనే తకరారు చేయడంతో జిల్లా కోర్టు, హైకోర్టును ఆశ్రయించానని బాధితురాలు వెంకటలక్ష్మమ్మ తెలిపింది. తనకే హక్కు ఉన్నట్లు రెండు కోర్టులూ ఉత్తర్వులు జారీ చేశాయని చెప్పింది. శాశ్వత ఇంజక్షన్ ఆర్డరు కూడా వచ్చిందని వెల్లడించింది. ఆర్డీఓ కోర్టు ద్వారా పాసు పుస్తకాలు కూడా మంజూరు చేశారని పేర్కొంది. అలాంటి భూమిలోకి కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వస్తున్నారని వాపోయింది. కలెక్టర్, ఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని వెంకటలక్ష్మమ్మ వేడుకుంటోంది.


