breaking news
land encroachment case
-
ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్లతో భూకబ్జాకు ఎత్తుగడ
రాప్తాడురూరల్: అది ప్రైవేట్ పట్టా భూమి. అలాంటి భూమికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఉండదు. అయినా తహసీల్దార్ పేరుతో ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఏకంగా ఫెన్సింగ్ వేశారు. బాధితులు వెళ్తే దౌర్జన్యానికి దిగుతున్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. రాప్తాడు మండలం మరూరులో జరుగుతున్న ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌లా మారింది. బాధితురాలు తెలిపిన మేరకు...మరూరుకు చెందిన ఎం.గోపాల్‌రెడ్డి (లేట్) సతీమణి ఎం.వెంకటలక్ష్మమ్మ సర్వే నంబరు 978 (పాత సర్వే నంబరు 646)లో 1.47 ఎకరాల ప్రైవేట్ పట్టా భూమిని 1987లో కొనుగోలు చేసింది. ఇటీవల అదే గ్రామానికి చెందిన పి.ఆదినారాయణ, పి.ప్రభాకర్, చీర్ల భాస్కర్ జేసీబీలతో తన భూమిలోకి వచ్చి చదును చేశారని వెంకటలక్ష్మమ్మ వాపోతోంది. పి.వెంకటమ్మ, జె.నల్లమ్మ, చీర్ల లక్ష్మీదేవి, సావిత్రి, చీర్ల రాముడు పేర్ల మీద తన భూమిలో తహసీల్దార్ పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు నకిలీవి సృష్టించుకున్నారని ఆరోపించింది. ప్రైవేట్ భూమికి అధికారులు ఎలా పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తారని ప్రశ్నించింది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులను అడిగితే.. ఆ సర్వే నంబరులో అధికారికంగా తాము ఎవరికీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని ధ్రువీకరించారని తెలిపింది. ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించుకుని తన భూమిని ఆక్రమించాలని చూస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పింది. కోర్టులు అనుకూలంగా తీర్పు ఇచ్చినా... తన అనుభవంలో ఉన్న ఈ భూమిపై గతంలోనే తకరారు చేయడంతో జిల్లా కోర్టు, హైకోర్టును ఆశ్రయించానని బాధితురాలు వెంకటలక్ష్మమ్మ తెలిపింది. తనకే హక్కు ఉన్నట్లు రెండు కోర్టులూ ఉత్తర్వులు జారీ చేశాయని చెప్పింది. శాశ్వత ఇంజక్షన్ ఆర్డరు కూడా వచ్చిందని వెల్లడించింది. ఆర్డీఓ కోర్టు ద్వారా పాసు పుస్తకాలు కూడా మంజూరు చేశారని పేర్కొంది. అలాంటి భూమిలోకి కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వస్తున్నారని వాపోయింది. కలెక్టర్, ఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని వెంకటలక్ష్మమ్మ వేడుకుంటోంది. -
ఎమ్మెల్యే బోండా నుంచి మా భూమి ఇప్పించండి
-
ఎమ్మెల్యే బోండా తక్షణమే రాజీనామా చేయాలి
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భూకబ్జాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడి భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే బోండా తక్షణం పదవికి రాజీనామా చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. విజయవాడలో భూదందాలకు ఎమ్మెల్యే బోండా కేరాఫ్‌గా మారారని ధ్వజమెత్తింది. సీఎం చంద్రబాబునాయుడు ఎందుకు బోండాపై చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ సోమవారం ఒక బహిరంగ లేఖ రాశారు. విజయవాడలో ఈ భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ స్వాతంత్ర్య సమరయోధుడికు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే బోండా కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు సృష్టించారు. సదరు కోటేశ్వర్‌రావును రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిమరీ సంతకాలు చేయించారు. కబ్జా విషయం తెలిసిన వెంటనే సమరయోధుడి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. సీఐడీ దర్యాప్తులోనూ ఎమ్మెల్యే భూదందా బట్టబయలైంది. దీంతో కొనుగోలుదారైన బోండా సుజాతపై కేసు నమోదయింది. స్వాతంత్య్రసమరయోధుడి కుటుంబం నేపథ్యం ఇదీ.. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన కసిరెడ్డి సూర్యనారాయణ స్వాతంత్య్రసమరయోధుడు. అప్పట్లో కర్నూలు జైల్లో మూడేళ్లు శిక్ష అనుభవించారు కూడా. ఆయనకు ప్రభుత్వం 1952లో విజయవాడలోని సింగ్‌నగర్‌లో 10.16 ఎకరాల భూమి కేటాయించింది. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో వెంకటేశ్వరరావుకు వివాహం కాలేదు. రామకృష్ణకు వివాహమై పిల్లలు ఉన్నారు. సూర్యనారాయణ కుటుంబం ఆ 10.16 ఎకరాల్లో తమ ఆర్థిక అవసరాల కోసం 5 ఎకరాలను దఫదఫాలుగా విక్రయించగా 5.16 ఎకరాలు మిగిలింది. సూర్యనారాయణ చిన్న కుమారుడు 1981లో, పెద్ద కుమారుడు వెంటకేశ్వరరావు 2013లో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆ భూమిపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కన్నుపడింది. ప్రస్తుతం అక్కడ ఎకరా మార్కెట్ విలువ రూ.10కోట్లు పైనే ఉంది. ఆ లెక్కన దాని విలువ రూ.50కోట్లుపైమాటే. అధికార పార్టీ ఎమ్మెల్యేగా బోండా రంగంలోకి దిగి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించారు. సూర్యనారాయణ ఇద్దరు కుమారులు వెంకటేశ్వరరావు, రామకృష్ణ తండ్రి ఆస్తిని 1983లో పంపకాలు చేసుకున్నట్లు ఒప్పంద పత్రాలు సృష్టించారు. (వాస్తవానికి రామకృష్ణ 1981లోనే చనిపోయారు.) అనంతరం వెంకటేశ్వరరావు తన వాటా భూమిని 2013లో విజయవాడకు చెందిన అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులకు విక్రయించినట్లు మార్చారు. తర్వాత వారిద్దరూ ఆ భూమిని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భార్య సుజాతతోపాటు మరో అయిదుగురికి డెవలప్మెంట్ కోసం రాసిచ్చినట్లు పత్రాలు సృష్టించారు. ఆ మేరకు విజయవాడ గాంధీనగర్, నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. వెంటనే ఆ భూమి చుట్టూ ప్రహారీ నిర్మించి ఒక షెడ్డు వేసి తన మనుషులను కాపాలాగా ఉంచారు. కోటేశ్వరరావును బురిడీ కొట్టించింది ఇలా.. ఈ భూమాయ కోసం అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులను కూడా ఎమ్మెల్యే బోండా పకడ్బందీగా బురిడీ కొట్టించారు. కోటేశ్వరరావు తన ఇంటిని తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వాలని ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుడైన కార్పొరేటర్ మహేష్‌ను సంప్రదించారు. అందులో భాగంగా విజయవాడ గాంధీ నగర్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లిన కోటేశ్వరరావుతో పలు పత్రాలపై సంతకాలు చేయించారు. ఆ తరువాత సాంకేతిక కారణాలతో అప్పు ఇవ్వలేమని చెప్పి పంపించేశారు. ఆ రోజు కోటేశ్వరరావు చేసిన సంతకాలతోనే కథ నడిచింది. వెంకటేశ్వరరావు నుంచి భూమిని కోటేశ్వరరావు కొనుగోలు చేసినట్లు... దాన్నే ఎమ్మెల్యే భార్య సుజాతతోపాటు మరో అయిదుగురికి పవర్ ఆఫ్ అటార్నీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు మార్చారు. కాగా అతనితో పాటు భూమి రాయించినట్లు ఉన్న మరో వ్యక్తి అబ్దుల్ మస్తాన్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. వెలుగులోకి వచ్చిందిలా.. తమ భూమికి కంచె వేసిన విషయం తెలుసుకున్న స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణ మనవడు సురేష్‌బాబు (రామకృష్ణ కుమారుడు) అక్కడకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మార్చిలో అక్కడికి వెళ్లిన సురేష్‌పై ఎమ్మెల్యే మనుషులు ఆ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగారు. సురేష్ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆరు నెలల క్రితం సీఐడీ విభాగాన్ని ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించించారు. భూమి రాసిచ్చిన కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు తనకు ఆ భూమి విషయమే తెలీదని... రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రశ్నించారు. సంతకాలు చూపించగా గతంలో అప్పు కోసం తాను చేసిన సంతకాలను ఇలా వాడుకున్నారని కోటేశ్వరరావుకు అర్థమై అదే విషయాన్ని వారికి చెప్పారు. దీంతో సీఐడీ వారు బోండా ఉమా భార్య సుజాత, ఆయన ప్రధాన అనుచరుడు మాగంటి బాబు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. -
దళిత హక్కుల నేతపై భూఆక్రమణ కేసు
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిజ్జవరపు జయరాజుపై భూఆక్రమణ కేసు నమోదైంది. చాణక్యపురిలోని తన స్థలాన్ని జయరాజు ఆక్రమించారని బాలకృష్ణ అనే వ్యక్తి ఏలూరు టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జయరాజుపై శిక్షాస్మృతిలోని 447, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేస్తారన్న సమాచారం తెలియడంతో జయరాజు సరెండర్ పిటిషన్ తో జడ్జి ముందు లొంగిపోయారు. జయరాజుపై పలు భూకబ్జా ఆరోపణలున్నాయి.


