breaking news
annual examinations
-
ఎంబీబీఎస్ మార్కుల స్కామ్‌పై మల్లగుల్లాలు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో మార్కుల స్కామ్‌పై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అసలది స్కామే కాదు.. మాల్‌ప్రాక్టీస్ జరిగి ఉంటుందని డైవర్షన్ చేయడంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తలమునకలవుతున్నారు. విజయవాడలోని సిద్ధార్థ వైద్యకళాశాలలో మాస్ కాపీయింగ్ ఘటనలో అక్రమాలను తొక్కిపెట్టినట్లే ఇప్పుడు కూడా తూతూ మంత్రంగా హడావుడి చేస్తున్నారని వైద్యవర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో కొందరు విద్యార్థులకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చెన్ (ఎంసీక్యూ) పేపర్లో అన్ని సబ్జెక్టుల్లో 20కి 19 మార్కులు వచ్చాయి. ఇలా వచ్చినవారు థియరీలో రాణించలేకపోవడంతో పాటు ఒకటిరెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది బయటి వ్యక్తులతో చేతులు కలిపి విద్యార్థుల నుంచి సబ్జెక్టుకు రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు వసూలు చేసి స్కామ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో లోతైన విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయింది. సుడి ఒక దగ్గర ఉంటే చురక మరోదగ్గర పెట్టినట్టు అసలు స్కామ్‌ను వెలికితీసే ప్రయత్నం చేయకుండా కాలేజీల్లోనే మాల్‌ప్రాక్టీస్ జరిగినట్టు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. పరీక్షల్లో జరుగుతున్న వ్యవస్థీకృత అక్రమాల్లో ఎంసీక్యూ విభాగంలో గోల్మాల్ కూడా ఒకటని చెబుతున్నారు. విచారణ జరిపిస్తే పెద్ద తలకాయలు బయటకు వస్తాయని అసలు విచారణే లేకుండా జాగ్రత్త పడుతున్నారని పేర్కొంటున్నారు. సిద్ధార్థ ఘటనలోను తమకు కావాల్సిన విద్యార్థుల కాపీయింగ్‌కు అడ్డంకులు ఏర్పడకుండా తనిఖీల పేరిట విశ్వవిద్యాలయం హడావుడి చేసింది. అప్పట్లో పరీక్షల విభాగంలోని కీలక అధికారి పాత్ర ఉందని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. మళ్లీ అలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండటం కోసం అప్పట్లో తూతూమంత్రంగా తనిఖీలు చేసి ఎవరిపైనా కఠిన చర్యలు లేకుండా కథను ముగించేశారు. -
ఎంబీబీఎస్‌లో కి'రాత'కాలు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో అక్రమాల వ్యవహారంపై దుమారం రేగుతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంబీబీఎస్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఘటన మరువకముందే అదే నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో జరిగిన మరో అక్రమాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వార్షిక పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలను ‘ఎంబీబీఎస్ పరీక్షల్లో అక్రమాల వైరస్’ కథనం ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారం ప్రస్తుతం వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్(ఎంసీక్యూ) విభాగంలో పలువురికి అన్ని సబ్జెక్టుల్లో 20కి 19 మార్కులు రావడం, ఇలా స్కోర్ చేసిన వారు థియరీలో బొటా»ొటి మార్కులు సాధించడం, కొందరైతే ఒకటిరెండు సబ్జెక్టులు తప్పడం వంటివి ఆధారాలతో సహా బయట పెట్టింది. ఈ అక్రమం ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం సహాయ సహకారాలతో చోటు చేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. విశ్వవిద్యాలయంలోని కొందరు అధికారులు, కళాశాలల్లో పనిచేసే ఫ్యాకల్టీ, సిబ్బంది, బయటి వ్యక్తులు రింగ్‌లా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారని వెల్లడవుతోంది. వీరు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివే ధనవంతుల కుటుంబాల్లోని చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని అక్రమానికి పాల్పడుతున్నట్టు సమాచారం. ఎంసీక్యూల్లో 95 శాతం మార్కులు సాధించేలా విద్యార్థులకు అడ్డదారుల్లో సాయం చేసిపెట్టేలా ఒక్కో సబ్జెక్టుకు రూ.మూడు, నాలుగు లక్షలపైనే వసూళ్లు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వీరితో డీల్ కుదుర్చుకున్న విద్యార్థుల నుంచి సబ్జెక్టుల వారీగా డబ్బు వసూలు చేసి అడ్డదారుల్లో 20కు 19 స్కోర్ చేసేలా చక్రం తిప్పారు. ఎంసీక్యూల్లో 19 మార్కులు వచి్చనా ఒకవేళ థియరీలో కనీసం 21 మార్కులు సాధించలేక ఫెయిల్ అయితే డబ్బు వెనక్కు ఇవ్వబోమని ముందే విద్యార్థులతో ఎంవోయూ చేసుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. దీంతో వీరికి రూ.లక్షల్లో చెల్లించి, థియరీలో రాణించలేక ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. వాస్తవానికి పరీక్షల సమయంలో విశ్వవిద్యాలయం నుంచి ఓ పరిశీలకుడిని నియమిస్తారు. స్క్వాడ్ బృందాలతోపాటు, పరీక్ష హాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ వ్యవస్థల కళ్లుగప్పి ఉన్నత స్థాయిలో సహాయ సహకారాలతోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో సిద్ధార్థ సెంటర్లో మాస్ కాపీయింగ్ ఘటన సమయంలోనే వ్యవస్థీకృత అక్రమాల బాగోతం బయపడింది. మాస్ కాపీయింగ్ ఘటనలతో రద్దయిన సిద్ధార్థ సెంటర్‌కు తిరిగి అనుమతులు ఇవ్వడం, తిరిగి అదే సెంటర్లో పలుమార్లు కాపీయింగ్ ఘటనలు చోటుచేసుకోవడంలో పరీక్షల విభాగంలోని ఓ కీలక అధికారి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఇతనికి ఉన్నత స్థాయిలో అండదండలు ఉండటంతో ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకుని సమస్యను తొక్కిపెట్టింది. కాగా, ఆరోగ్య విశ్వవిద్యాలయం కనుసన్నల్లో వ్యవస్థీకృత నేరంలా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేయాలని వైద్య వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. ఎంసీక్యూ, థియరీని ఒకదానితో ఒకటి పోల్చలేం దడి కట్టినట్టు వార్షిక పరీక్షల్లో కొందరు విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో ఎంసీక్యూల్లో 20కు 19 మార్కులు రావడాన్ని ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు సమరి్థంచారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ‘సాక్షి’ కథనానికి వివరణ ఇచ్చారు. పరీక్షల్లో ఎంసీక్యూ, థియరీ విభాగానికి ఒకదానితో మరొకటి పోల్చలేమని చెప్పారు. -
ఎంబీబీఎస్ పరీక్షల్లో అక్రమాల వైరస్
సాక్షి, అమరావతి: వైద్యవిద్య (ఎంబీబీఎస్) పరీక్షలకు అక్రమాల వైరస్ సోకింది. ఏదో ఒకరకంగా పాస్ కావడమే ధ్యేయంగా ఉన్న పలువురు విద్యార్థులకు కొందరు అధికారులు అండదండలందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో ఈ అక్రమాలు ఏ రీతిన జరిగాయో ఫలితాలతో వెల్లడైంది. వందమార్కుల పేపర్‌ను 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల (ఎంసీక్యూ) రూపంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఎంసీక్యూ విభాగంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు థియరీ పేపర్లో తక్కువ మార్కులతో తప్పారు. ఒక్కో సబ్జెక్టులో పాస్ మార్కులు 40 కాగా.. ఎంసీక్యూలో 19 తెచ్చుకున్నవారు థియరీలో 21 మార్కులు కూడా తెచ్చుకోలేక ఫెయిలయ్యారంటే పరీక్షల తీరు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వైద్యవిద్యపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. » వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థికి జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ సబ్జెక్టుల్లో పేపర్–1, 2లలో ఎంసీక్యూ విభాగంలో 20కి 19 చొప్పున (95 శాతం) మార్కులు వచ్చాయి. ఎంసీక్యూల్లో దుమ్ముదులిపిన అతడికి థియరీలో పేపర్–1 జనరల్ మెడిసిన్ 31, సర్జరీ 27, పీడియాట్రిక్స్ 28, గైనకాలజీ 15 మార్కులు వచ్చాయి. గైనిక్‌లో కనీసం పాస్ మార్కులు సాధించలేకపోయి ఫెయిలయ్యాడు. » మరో ప్రైవేట్ కళాశాల విద్యార్థికి ఫోరెన్సిక్ మెడిసిన్, ఆప్తమాలజీ, ఓటోరినోలారింగాలజీ (ఈఎన్టీ), కమ్యూనిటీ మెడిసిన్ సబ్జెక్టుల పేపర్–1లో ఎంసీక్యూలో 19 మార్కులు వచ్చాయి. కమ్యూనిటీ మెడిసిన్ పేపర్–2లో 18 సాధించాడు. అతడికి ఆప్తమాలజీలో 80కి కేవలం 5 మార్కులు రావడంతో ఆ సబ్జెక్టులో ఫెయిలయ్యాడు. » మరో విద్యారికి సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ సెకండ్ క్లాస్‌లో పాసయ్యాడు. అతడికి ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ పేపర్–1, 2ల్లో ఎంసీక్యూల్లో 19 చొప్పున మార్కులు వచ్చాయి. కానీ.. థియరీలో ఒక్క సబ్జెక్టులోనూ 50 శాతం స్కోర్ చేయలేకపోయాడు. వీరి తరహాలోనే మరికొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో ఎంసీక్యూల్లో 95 శాతం స్కోర్ చేసి థియరీలో బొటా»ొటి మార్కులతో పాసవగా, పలువురు ఫెయిలయ్యారు. సాధారణంగా ఎంసీక్యూ విభాగంలో 15 నుంచి 17 మార్కులు గరిష్టంగా సాధించే ప్రతిభావంతులైన విద్యార్థులు థియరీలో 40 నుంచి 50 శాతం మార్కులు సాధిస్తుంటారని వైద్యవిద్య బోధకులు తెలిపారు. కానీ ఇప్పుడు ఎంసీక్యూ విభాగంలో 95 శాతం మార్కులు వచ్చిన వారు కూడా ఆ మార్కులు కలిపినా సబ్జెక్టులో తప్పుతుండటంతో పరీక్షల్లో అక్రమాల ఆరోపణలకు బలం చేకూరుతోంది. వ్యవస్థీకృత అక్రమం ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల సెంటర్లో మాస్ కాపీయింగ్ దుమారం రేగిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం కనుసన్నల్లోనే వ్యవస్థీకృతంగా కాపీయింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రైవేట్ కళాశాలలు, విద్యార్థుల నుంచి గ్యారంటీ పాస్ హామీతో కొందరు అధికారులు రూ.లక్షలు వసూలుచేసి పరీక్షల అనంతరం జవాబు పత్రాలను తారుమారు చేస్తున్నారనే నేరారోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాపీయింగ్ రాకెట్‌పై లోతైన దర్యాప్తు చేయకుండానే ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. ఈ ఘటన మరుకముందే అదే నెలలో నిర్వహించిన అకడమిక్ పరీక్షల్లోనూ ఎంసీక్యూ మార్కుల గోల్మాల్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటా కింద రూ.లక్షల్లో ఫీజులు కట్టిన విద్యార్థులు కొందరు అకడమిక్ పరీక్షల్లో రాణించలేకపోతున్నారు. అలాంటివారి నుంచి డబ్బు వసూలుచేసి ఎంసీక్యూల్లో ఏకంగా 20కి 19 మార్కులు వచ్చేలా కొందరు అక్రమార్కులు సహాయసహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. విశ్వవిద్యాలయం అధికారులు, పరీక్ష విధుల్లోని సిబ్బంది, విద్యార్థులు కుమ్మక్కై ఈ వ్యవస్థీకృత అక్రమానికి తెరలేపారని అర్థమవుతోంది. -
పరీక్షా కాలమ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరీక్షల సీజన్ వచ్చేసింది. వార్షిక పరీక్షలతో పాటు ప్రవేశ, పోటీ పరీక్షలు వరుసగా జరగనున్నాయి. దాదాపు 24.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. విద్యా సంవత్సరంలో 10 నెలలపాటు నేర్చుకున్న అంశాలను పేపర్‌పై పెట్టి, ప్రతిభను పరీక్షించుకోనున్నారు. మార్చి ఒకటో తేదీన ఇంటర్మీడియట్ పరీక్షలతో మొదలై.. పదో తరగతి, జేఈఈ మెయిన్స్–2, అడ్వాన్స్డ్, ఈసెట్.. తదితర పదుల సంఖ్యలో సెట్లు జూన్ మూడో వారం వరకు దాదాపు మూడున్నర నెలల పాటు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ గురువారంతో ముగిశాయి. మార్చి 1 నుంచి 20 వరకూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ పరీక్షలు చివరలో ఉండగానే పదో తరగతి పరీక్షలు మార్చి 17న మొదలై 31 వరకు సాగుతాయి. ఇంటర్ పూర్తి చేసిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల్లో సగం మందికి పైగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీఈఏపీ సెట్‌కు హాజరవుతారు. ఎంపీసీ విద్యార్థులు ఐఐటీలు, జాతీయ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించేందుకు జేఈఈకి హాజరవుతారు. ఇప్పటికే జేఈఈ తొలి విడత సెషన్ పూర్తవగా, రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 8 వరకూ జరుగుతుంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ మే 18న జరుగుతుంది. ఇక డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికీ వరుస పరీక్షలున్నాయి. ఐసెట్, పీజీఈసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్... వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే యూజీ, పీజీ నీట్... ఇలా జూన్ మూడో వారం వరకూ పరీక్షలే పరీక్షలు. ఇంటర్లో పబ్లిక్ పరీక్షలకు 10.59 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా, పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 6.49 లక్షల మంది సిద్ధమవుతున్నారు. ఇతర సెట్స్‌తో పాటు అన్ని పరీక్షలకు రాష్ట్రంలో సుమారు 24.50 లక్షల మందికి పైగా హాజరు కానున్నారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడంలో తల్లిదండ్రులు, 3లక్షల మంది ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారు. ఈ లెక్కన దాదాపు 70 లక్షల మందికి ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. వీరితోపాటు పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలు పంపడం నుంచి వాటిని మూల్యాంకన కేంద్రాలకు చేరవేసే వరకూ ప్రభుత్వ యంత్రాంగానికి సవాలే. విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పోలీస్... ఇలా అన్ని శాఖలకు కూడా ఇది పరీక్షా కాలమే. తెలంగాణలో 25 లక్షల మంది సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే అధ్యాపకులు, ఇతరులు కలిపి మరో కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములవుతారని అంచనా. పరీక్షల సమయంలో పిల్లలకు అందుబాటులో ఉండేందుకు తల్లిదండ్రులు సెలవులు పెట్టడం లాంటి ఏర్పాట్లు చేసుకుంటుంటే, విద్యాసంస్థలు ప్రత్యేక తరగతులు, మోడల్ టెస్టులతో విద్యార్థులను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు, టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఈఏపీ సెట్ ఏప్రిల్ 29, 30 (అగ్రికల్చర్, ఫార్మా), మే 2 నుంచి 5 (ఇంజనీరింగ్) వరకు జరగనున్నాయి. ఐసెట్ జూన్ 8, 9 తేదీల్లో, పీజీఈసెట్ జూన్ 16 నుంచి 19 వరకు, ఈసెట్ మే 12, ఎడ్‌సెట్ జూన్ 1, లాసెట్ జూన్ 6న జరుగుతాయి. పీఈసెట్ జూన్ 11, 14 తేదీల్లో నిర్వహిస్తారు. -
పరీక్షల సమరం
సాక్షి, హైదరాబాద్: ఇది పరీక్షల సమయం. భవిష్యత్తును నిర్ణయించే తరుణం. ఇటు వార్షిక పరీక్షలు.. మరోవైపు ప్రవేశ పరీక్షలతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యే కాలం. తీవ్రమైన ఒత్తిడితో గడిపే సీజన్. విద్యార్థుల్లో టెన్షన్..విద్యాసంస్థల్లో హైటెన్షన్. ఇంకోవైపు తల్లిదండ్రుల అటెన్షన్. మొత్తం మీద వేసవికి ముందే వేడి ఊపందుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే అధ్యాపకులు, ఇతరులు కలిపి మరో కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములవుతారని అంచనా. ఫైనల్ పరీక్షలు, ఉన్నత చదువులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల సమయంలో పిల్లలకు అందుబాటులో ఉండేందుకు తల్లిదండ్రులు సెలవులు పెట్టడం లాంటి ఏర్పాట్లు చేసుకుంటుంటే, మరోవైపు విద్యాసంస్థలు..ప్రత్యేక తరగతులు, మోడల్ టెస్టులతో ఫలితాల తరాజులో మొగ్గు తమవైపే ఉండేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి.మార్చి టు జూన్..మార్చి నుంచి జూన్ వరకూ వరుసగా ఎన్నో పరీక్షలు. ముందుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు మొదలవుతాయి. మార్చి 5వ తేదీ నుంచి 25 వరకూ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. థియరీ పరీక్షల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇంటర్ పరీక్షలు చివరలో ఉండగానే టెన్త్ పరీక్షలు షురూ అవుతాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ ఇవి కొనసాగుతాయి. ఓరియంటల్ సబ్జెక్టులు రెండురోజుల పాటు జరుగుతాయి. ఇక ఇంటర్ పూర్తి చేసిన ప్రతి విద్యార్ధికీ కీలకమైన ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షే గేట్ పాస్. ఇది ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకూ జరుగుతుంది. ప్రఖ్యాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించాలనేది లక్షల మంది కల. ఈ మెట్టు ఎక్కాలంటే జేఈఈ పరీక్ష రాయాల్సిందే. తొలి విడత సెషన్ ఇప్పటికే పూర్తయింది. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరుగుతుంది. ఇక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ మే 18న జరుగుతుంది. ఇక డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి వరుసబెట్టి పరీక్షలున్నాయి. ఐసెట్, పీజీఈసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే యూజీ, పీజీ నీట్... ఇలా జూన్ వరకూ పరీక్షలే పరీక్షలు. విద్యార్థుల వెనుక కీలకంగా.. రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. ఇది మనకు ప్రత్యక్షంగా కని్పంచే సంఖ్య మాత్రమే. ఒక్కో విద్యార్థిని పరీక్షకు సన్నద్ధం చేసేందుకు ఇద్దరు తల్లిదండ్రులు, సగటున మరో ఇద్దరు ఉపాధ్యాయులు తెర వెనుక కృషి చేస్తారు. వీరే కాదు పరీక్షల ఏర్పాట్లలో ఉండే ఉద్యోగులు, విద్యాసంస్థల సిబ్బంది పాత్రా కీలకమే. ఈ లెక్కన సుమారు కోటి మందికి ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. విద్యార్థులను సన్నద్ధం చేయడం మొదలుకుని, పరీక్షా కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ప్రశ్నాపత్రాలు పంపడం, వాటిని మూల్యాంకన కేంద్రాలకు చేర్చడం..మొత్తం మీద ఎవరికీ ఈ సీజన్లో కంటి మీద కునుకు ఉండదంటే అతిశయోక్తి కాదు. విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పోలీస్... తదితర శాఖలకూ ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. ఒక రకంగా ప్రభుత్వానికీ ఇవి ఓ సవాలే. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుతుంది. దీంతో పరీక్షల దగ్గర్నుంచి ఫలితాల వెల్లడి వరకు టెన్షన్ తప్పని పరిస్థితి. పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం టెన్త్, ఇంటర్ పరీక్షలు కీలకమైనవి. ఇప్పటికే విద్యార్థులను సిద్ధం చేశాం. మరోసారి పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం. విద్యార్థులు పరీక్షలు అంటే కాస్తా టెన్షన్‌గా ఫీలవ్వడం సహజం. ఇలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అందరికీ మంచి మార్కులు వచ్చేలా టీచర్లు ప్రత్యేక తరగతులు తీసుకుంటూ అలుపెరుగకుండా కష్టపడుతున్నారు. – ఆర్.పార్వతీరెడ్డి (హార్వెస్ట్ విద్యాసంస్థలు, ఖమ్మం) ఒకింత టెన్షన్‌గానే ఉంది గతంలో చాలా పరీక్షలు రాశా. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉంది. అయితే ఒక్కోసారి చదివిందే వస్తుందా? ఇంపార్టెంట్ ఏమిటనే గందరగోళానికి గురవుతున్నా. ముఖ్యమైన చాప్టర్స్ పదేపదే చదవమని టీచర్లు చెబుతున్నారు. నాలో ధైర్యం పెంచేలా తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. – ముక్తివరపు శేఖర్ (ఇంటర్ సెకండియర్ విద్యార్థి, హైదరాబాద్) ––––––––––––––––––పరీక్షలయ్యే వరకు ధైర్యం చెబుతున్నాం.. అమ్మాయి చదువుపైనే దృష్టి పెడుతున్నాం. రాత్రి పడుకునే వరకూ ఏం కావాలో అందిస్తున్నాం. పరీక్షలంటే భయం ఉండకుండా ధైర్యం చెబుతున్నాం. ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తున్నాం. కాలేజీకి వెళ్లి లెక్చరర్లతో మాట్లాడి వారి సలహాలు కూడా పాటిస్తున్నాం. – సానియా బేగం (ఇంటర్ విద్యార్ధిని తల్లి, జడ్చర్ల) -
మూడేళ్ల తర్వాత‘పది’ పరీక్షలు
సాక్షి హైదరాబాద్: కరోనా ప్రభావంతో మూడేళ్ల తర్వాత పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల షెడ్యూలు విడుదల కావడంతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు సిలబస్ పూర్తి చేసి రివిజన్ ప్రక్రియ ప్రారంభించారు. సర్కారు బడుల్లో మాత్రం సిలబస్ పూర్తి కాలేదు. మరోవైపు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి కనీసం ఉత్తీర్ణత మార్కులతో గట్టెక్కేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు.. కరోనా నేపథ్యంలో 2021– 22 విద్యా సంవత్సరానికి 70 శాతం సిలబస్‌తోనే పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 లోపే సిలబస్ పూర్తిచేయాల్సి ఉండగా సంక్రాంతి సెలవులు, ఆ తర్వాత కరోనా థర్డ్‌వేతో సర్కారు బడుల్లో సిలబస్ పెండింగ్‌లో పడిపోయింది. సైన్స్, మ్యాథ్స్ మినహా మిగిలిన సబ్జెక్టుల సిలబస్ దాదాపు పూర్తి కావచ్చిందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడో తరగతి తర్వాత.. కరోనా కంటే ముందు ఏడో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులంతా తాజాగా టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. 2018– 19లో 7వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఆ తర్వాత కరోనా ఎఫెక్టుతో 8, 9 పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అయ్యారు. కరోనా నేపథ్యంలో 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో టెన్త్ విద్యార్థులు సైతం వార్షిక పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. తాజాగా పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. సర్కారు బడుల్లో అంతంతే... సర్కారు బడుల్లో పదో తరగతి వార్షిక పరీక్షపై ప్రత్యేక శ్రద్ధ అంతంత మాత్రంగా తయారైంది. గతంలో ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసి పరీక్షలకు సమాయత్తం చేసేలా చర్యలు చేపట్టేవారు. ఈసారి మాత్రం మౌఖిక ఆదేశాలు ఆచరణలో అమలు లేకుండా పోయింది. ప్రతి రోజు అదనంగా ఉదయం గంట, సాయంత్రం గంట ప్రత్యేక తరగతుల నిర్వహిస్తే తప్ప సిలబస్ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వాస్తవంగా సబ్జెక్టు టీచర్ల కొరత కూడా వెంటాడుతోంది. -
పరీక్షలు రాయకుండా పాస్ చేయలేం: ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్ చేసే ఆలోచన బోర్డుకు లేదని అధికారులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వెల్లడించింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షలను అసైన్మెంట్ రూపంలో నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ 1, 3 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఏప్రిల్ 7 నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. చదవండి: ఇంటర్లో 30% సిలబస్ కోత -
కరోనా ఎఫెక్ట్: ఇకపై వాట్సాప్‌లో పరీక్షా ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ సోకి ముగ్గురు మరణించారు. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంటూ భారత్‌లో కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది. అయితే ఈ వైరస్ విస్తరించకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకొంటున్నాయి. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయించారు. పలు రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతుండడంతో వాటిని మాత్రమే కొనసాగిస్తున్నారు. దేశ రాజధానిలో కూడా స్కూల్స్ మూతపడ్డాయి. అయితే ఇప్పటికే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఫలితాలు గతంలో ఎప్పుడూ కూడా విద్యార్థుల చేతికి ఇచ్చేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో విద్యార్థులను టచ్ చేయవద్దని అధికారులు నిర్ణయించారు. వినూత్నంగా ఫలితాలను తెలియచేయాలని అధికారులు భావించారు. దీంతో వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా పరీక్షా ఫలితాలను పంపేందుకు సిద్ధమౌతున్నాయి. చదవండి: వృద్ధి రేటుకు కరోనా కాటు.. అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ఫలితాలను నేరుగా కాకుండా.. ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా చేరవేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఏమైనా సందేహాలు ఉంటే.. పాఠశాలల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా కాలేజీలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని చెప్తున్నారు. కేంద్రీయ విద్యాలయాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుసరించాలని ఇతర విద్యాసంస్థలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫోర్డ్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ -
పదిలో 10 సాధిస్తే 25 వేలు
సిద్దిపేట జోన్: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో పదో తరగతి వార్షిక పరీక్షకు హాజరయ్యే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల్లో 10/10 మార్కులు సాధించే విద్యార్థులకు ఆయన రూ.25 వేల నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. మంగళవారం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ. 10 లక్షలతో వంటగది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడారు. గతేడాది పదో తరగతిలో 92 శాతం ఫలితాలతో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించి మొదటి స్థానంలో నిలవాలని టీచర్లకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో, అభివృద్ధిలో చివరికి ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేట అగ్రగామిగా ఉందని.. అదే స్ఫూర్తితో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని టీచర్లకు సూచించారు. నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులు ఎంత మంది 10/10 ఫలితాలు తెచ్చుకుంటే అందరికీ రూ.25 వేల నజరానా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల వద్దకు వెళ్లి టెన్త్ ఫలితాల్లో 10/10 సాధిస్తే రూ.25 వేలు బహుమానంగా ఇవ్వనున్నట్లు హరీశ్ తెలిపారు. తన ఛాలెం జ్ను స్వీకరించి 10/10 సాధించి నజరానా పొందాలని సవాల్ విసిరారు. దీనికి విద్యార్థులు సవాల్‌ను స్వీకరిస్తున్నామని విక్టరీ సంకేతంతో బదులిచ్చారు. -
మినహాయింపు పొందేదెలా!
సాక్షి, మహబూబాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహా యింపు ఈ ఏడాది పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం, రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా అందకుండా పోతోంది. దీంతో మూడు లక్షల మంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదం నెలకొంది. రాష్ట్రంలో సుమారు 4.50 లక్షల మంది విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 8 పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఆధారంగా ఫీజు చెల్లిం పులో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మినహా యింపు ఇచ్చింది. గ్రామాల్లో ఏడాదికి తల్లి దండ్రుల ఆదాయం రూ.20 వేలు, పట్టణాల్లో రూ.24 వేలకు మించకుండా ఉండాలి. సంబంధిత మండల రెవెన్యూ అధికారి నుంచి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకుని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యా యులకు ఇవ్వాలి. ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి ఆదాయ పరిమితిని గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాం తాల్లో రూ.2 లక్షలకు పెంచింది. అధికారులు ఎవరికీ రూ.20 వేల వార్షిక ఆదాయం వరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు ఫలితం దక్కకుండా పోనుంది. -
14 నుంచి టెన్త్ పరీక్షలు
-
14 నుంచి టెన్త్ పరీక్షలు
♦ హాజరు కానున్న 5.38 లక్షల మంది విద్యార్థులు ♦ 5 నిమిషాల వరకు ఆలస్యంగా వస్తే అనుమతి సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 14 నుంచి 30 వరకు జరిగే పరీక్షల ఏర్పాట్లపై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓరియం టల్ ఎస్సెస్సీ పరీక్షలు 14న, రెగ్యులర్ ఎస్సెస్సీ పరీక్షలు 17న ప్రారంభమవుతాయ న్నారు. ప్రతి పరీక్ష ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుందని, ద్వితీయ భాష, ఓరియంటల్ ఎస్సెస్సీ, కాంపొజిట్ కోర్సు పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు ఆల స్యం కాకుండా ముందుగానే పరీక్షా కేంద్రా నికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విద్యార్థులను 8:45 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని.. 5 నిమిషాల ఆలస్యం (9:35) వరకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తా మని, అయితే రోజూ ఆలస్యమైతే మాత్రం విచారణ జరుపుతామని హెచ్చరించారు. హాల్‌టికెట్లను ఇప్పటికే స్కూళ్లకు పంపామని, అందనివారు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసు కోవచ్చని తెలిపారు. వాటిపై ప్రిన్సిపాల్ సంతకం అక్కర్లేదన్నారు. సెల్‌ఫోన్ తెస్తే క్రిమినల్ కేసు.. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, చివరకు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు సెల్ఫోన్లు తీసుకురావద్దని, తెస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అత్యవసర మైతే సెక్యూరిటీ కానిస్టేబుల్ ఫోన్‌ను వినియోగించాలని, ఎవరికి, ఎందుకు కాల్ చేశారో రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరన్నారు. ప్రథమ భాష పార్ట్–బి పేపర్‌ను చివరి అరగంటలో ఇస్తారన్నారు. అంధ, మూగ, చెవిటి విద్యార్థులకు స్రైబ్ అవకాశం కల్పిస్తున్నామని, ఇప్పటికే అనుమ తులు ఇచ్చామని, ఇంకా ఎవరైనా ఉంటే సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్‌ను సంప్ర దించాలని సూచించారు. సందేహాలుంటే డీఈవో కార్యాలయాల్లోని వాటితో పాటు రాష్ట్రస్థాయిలోని కంట్రోల్ రూమ్ నంబరు (040–23230492)లో కూడా సంప్రదించవ చ్చన్నారు. హాల్‌టికెట్ పోగొట్టుకున్న విద్యా ర్థులు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ముం దుగా తెలియజేస్తే తగిన చర్యలు చేపడతారని చెప్పారు. పరీక్షలు పూర్తయిన 35 నుంచి 40 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. విద్యార్థులకు సూచనలు.. ⇒ స్కూల్ యూనిఫారంతో పరీక్షలకు రావద్దు. ⇒ ఇన్విజిలేటర్ ఓఎంఆర్ పత్రం ఇచ్చాక, ధ్రువీకరించుకున్నాకే సంతకం చేసి, పరీక్ష రాయడం మొదలు పెట్టాలి. ⇒ మెయిన్ ఆన్సర్ షీట్‌పై ఉన్న సీరియల్ నంబరును మాత్రమే అడిషనల్ షీట్స్, గ్రాఫ్స్, మ్యాప్ లు, బిట్ పేపర్లపై వేయాలి. ⇒ పరీక్ష సమయం పూర్తయ్యే వరకు విద్యార్థులను బయటకు పంపించరు. ⇒ 14–3–2017: ఓరియంటల్ ఎస్సెస్సీ పేపరు–1తో పరీక్షలు ప్రారంభ మవుతాయి. ⇒ 17–3–2017: రెగ్యులర్ ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమవుతాయి. (17న ప్రథమ భాష పేపర్–1). -
ఆట..‘పాట’శాలలు!
ముగిసిన వార్షిక పరీక్షలు ♦ సర్కారు బడుల్లో ఆటలు, పాటలతో కాలక్షేపం ♦ పుస్తకాలు లేకుండా ‘కొత్త’ పాఠాలు చెప్పాలట ♦ అయోమయంలో ఉపాధ్యాయులు ♦ ‘ఒంటిపూట బడి’కి సగం మంది విద్యార్థుల డుమ్మా ♦ ‘సాక్షి’ క్షే త్ర స్థాయి పరిశీలనలో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: విద్యా శాఖ వింత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలు ఆటపాటలకు వేదికలుగా మారాయి. వార్షిక పరీక్షలు ముగియడంతో.. ప్రస్తుతం ఏం చేయాలో ఉపాధ్యాయులకు పాలుపోవడం లేదు. దీంతో విద్యార్థులంతా ఆటలు, పాటలతో కాలం గడుపుతున్నారు. పేరుకు పాఠశాలకు హాజరవుతున్నా.. నేర్చుకుంటున్నది మాత్రం శూన్యమనే చెప్పవచ్చు. నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నెలకొన్న ఈ దుస్థితి ‘సాక్షి’ శనివారం నిర్వహించిన క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఇదీ పరిస్థితి.. కేంద్ర ప్రభుత్వ స్కూళ్ల మాదిరిగా.. నూతన విద్యా సంవత్సరాన్ని రాష్ట్రంలో మార్చిలోనే మొదలు పెట్టాలని ప్రభుత్వం భావించింది. గతం కంటే ముందుగానే 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలను నిర్వహించారు. చివరకు ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటూ.. పాత పద్ధతిలోనే నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలని ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. అరకొరగా తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ఏం చెప్పాలో తెలియక ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు. కనీసం ప్రాథమికాంశాలు చెబుదామన్నా పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం బోధించాలని టీచర్లు సంశయంలో పడ్డారు. విద్యార్థులు పాఠశాలలో ఆటపాటలకే కేటాయిస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. గత ఏడాది చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల ప్రధానోపాధ్యాయులకు జంట జిల్లాల డీఈఓలు సూచించినట్లు సమచారం. చదవడం, రాయడం, పునశ్చరణపై దృష్టి సారించాల్సిందిగా చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక తరగతిలో వెనుకబడిన విద్యార్థులను మినహాయిస్తే.. చురుకైన వారికేం బోధించాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. పది విద్యార్థులకు నష్టమే... పదో తరగతిలో అడుగు పెడుతున్నవిద్యార్థులది మరింత గందరగోళ పరిస్థితి. వీరికి కొత్త పాఠ్య పుస్తకాలు రాలేదు. పాతవీ అందే వీల్లేదు. ప్రస్తుతం టెన్త పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవి ముగిస్తేనే పాత పుస్తకాలు పంపిణీ చేయొచ్చు. దీనికోసం ఏప్రిల్ మొదటి వారం వరకు ఆగాల్సిందే. ఈలోగా ఒంటి పూట బడులు సగం పూర్తవుతాయి. బేసిక్స్ నేర్చుకునే అవకాశానికి విద్యార్థులు దూరమవుతున్నారు. హాజరు అంతంతే... ఇప్పటి వరకు వార్షిక పరీక్షలు ముగియగానే.. వేసవి సెలవులు ఉండేవి. ఈ సారి పరీక్షలు పూర్తయ్యాక.. ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో సగం మంది మాత్రమే వెళ్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు సొంతూళ్లకు చేరుకున్నారు. మరోపక్క ఎండలు తీవ్రం కావడంతో కొందరు పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఉపాధ్యాయుల హాజరు తీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఎస్సెస్సీ పరీక్షలకు చాలా మంది టీచర్లు ఇన్విజిలేటర్లుగా వెళ్తున్నారు. మరికొందరు సెలవులపై వెళ్లగా.. ఇంకొందరు డెప్యుటేషన్‌లో ఉన్నారు. మిగిలిన కొద్ది మంది మాత్రమే బడులకు వెళ్తున్నారు. బేసిక్స్ చెప్పాలని ఆదేశించాం పై తరగతులకు సంబంధించిన బేసిక్స్ చెప్పేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించాం. వెనుకబడిన వారిని గుర్తించి..ప్రత్యేక దృష్టి సారించాలని సూచించాం. విద్యార్థులంతా తరగతులకు వచ్చేలా చూడాల్సింది ఉపాధ్యాయులే. - సోమిరెడ్డి, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి తిరుమలగిరి మండలంలో... రసూల్‌పురా: కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి మండలంలోని మడ్‌ఫోర్ట్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభమెనప్పటికీ విద్యార్థుల సంఖ్యను వేళ్లమీద లెక్కించవచ్చు. ఈ పాఠశాల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ కావడంతో విద్యార్థులంతా పరీక్షలు పూర్తికాగానే వారి స్వగ్రామాలకు వెళ్లారు. కేవలం స్థానిక విద్యార్థులే హాజరవుతున్నారు. 8వ తరగతి తెలుగు మీడియంలో 10 మంది బాలికలుండగా ఒక్కరు కూడా హాజరు కాలేదు. 9వ తరగతి తెలుగు మీడియం బీ సెక్షన్లో ముగ్గురు బాలురు, ఒక బాలిక మాత్రమే హాజరయ్యారు. 6నుంచి 10 తరగతి వరకు 28 మంది ఉపాధ్యాయులు ఉండగా 8 మంది మాత్రమే హాజరవుతున్నారు. మిగిలిన 20 మంది టెన్త పరీక్షలకు ఇన్విజిలేటర్లు. 7వ తరగతి నాలుగు సెక్షన్లలోమొత్తం విద్యార్థులు 118మంది. బాలురు 42 మందికి 19 మంది, బాలికలు 38 మందికి గాను 12 మంది మాత్రమే హాజరయ్యారు. పుస్తకాలు రాలేదు... ప్రభుత్వం నుంచి పుస్తకాలు రాలేదు. 9 నుంచి10వ తరగతికి వెళ్లిన విద్యార్థుల పుస్తకాలు తీసుకుని తరగతులకు వస్తున్నాం. సెలవులు ఇవ్వకుండా తరగతులు ప్రారంభించడంతో ఒత్తిడి పెరుగుతోంది. త్వరగా కొత్త పుస్తకాలు ఇవ్వాలి. -దుర్గా ప్రసాద్, 9 వతరగతి అల్వాల్‌లో... అల్వాల్: అల్వాల్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఉదయం పదోతరగతి పరీక్షలు ఉండడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు తరగతులు ప్రారంభమయ్యాయి. పది మంది ఉపాధ్యాయులు ఉండగా.. వీరిలో ఏడుగురు పరీక్ష విధులకు హాజరవుతున్నారు. మిగతా ముగ్గురు 6 నుంచి తొమ్మిదో తరగతి వరకుభోదిస్తున్నారు. పాత పుస్తకాలనే విద్యార్థులు మార్పిడి చేసుకుని చదువుకుంటున్నారు. ఇప్పటి వరకు నూతనంగా ఏ సబ్జెక్ట్‌లో పాఠాలు మొదలు కాలేదు. విద్యార్థుల హాజరు శాతం 60కి పైగా ఉంది. మల్కాజిగిరిలో... విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరు నుంచి 8వ తరగతి విద్యార్థులకు త్రీఆర్స్ విధానం ద్వారా తెలుగు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులు బోధిస్తున్నారు. 9వ తరగతి (వచ్చే ఏడాది 10వ తరగతి) విద్యార్థులకు చతుర్విధ బోధనా ప్రక్రియలో భాగంగా కూడికలు, తీసివేతలు, గుణాంకాలు, భాగాహారాలను అదనంగా నేర్పిస్తున్నారు. సీనియర్ల పుస్తకాలను జూనియర్లకు ఇస్తున్నారు. ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. శాలిబండలో... యాకుత్‌పురా: లలితాబాగ్ రోడ్డులోని శాలిబండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 145 మంది విద్యార్థులకు గాను... 102 మంది హాజరయ్యారు. పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా... నలుగురు పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా వెళ్లారు. అందుబాటులో ఉన్న నలుగురు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. పాత పుస్తకాలతో... తరగతులు మారిన విద్యార్థులకు పాత పుస్తకాలతో బోధిస్తున్నాం. ఆరో తరగతి నుంచి ఏడో తరగతి మారిన విద్యార్థులకు పాత విద్యార్థుల పుస్తకాలను సేకరించి వాటి ద్వారా పాఠాలు చెబుతున్నాం. - మైత్రి, ఇన్చార్జి హెచ్ఎం, శాలిబండ బాలికల ఉన్నత పాఠశాల మణికొండలో... మణికొండ: ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావడంతో వారు పాఠశాలలకు వచ్చేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. మణికొండ ఉన్నత పాఠశాలలో 537 మంది విద్యార్థులకు గాను కేవలం 257 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాలు ఇవీ... గత ఏడాది వెనుకబడిన విద్యార్థులను ఒంటిపూట బడుల్లో మరింత బోధించి వారిని మొదటి శ్రేణి విద్యార్థులుగా తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే భాషా సిలబస్‌లో రీడింగ్, రైటింగ్, రివిజనింగ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. లెక్కల సబ్జెక్టుకు కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు నేర్పించాలని నిర్ణయించారు. వెనకబడిన విద్యార్థులు పాఠశాలలకు రాకపోవటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండాపోతోందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. రామాంతాపూర్‌లో... రామంతాపూర్: స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రాకపోవడంతో విద్యార్థులకు కేవలం బేసిక్స్ మాత్రమే నేర్పిస్తున్నారు. అదేవిధంగా 400 మంది విద్యార్థులకు గాను 180 మంది మాత్రమే హాజరవుతున్నారు. 22 మంది ఉపాధ్యాయులకు కేవలం ముగ్గురు మాత్రమే వస్తున్నారు. అన్ని తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి బోధిస్తున్నారు. ఎండతో అవస్థలు అన్ని తరగతుల విద్యార్థులను ఒకే తరగతిలో కూర్చోబెట్టి బేసిక్స్ నేర్పిస్తున్నారు. ఇంటి నుంచి పాఠశాలకు వస్తున్న సమయంలో ఎండకు తాళలేక ఇబ్బందులకు గురవుతున్నాం. కొంత మందికి జ్వరాలు వస్తున్నాయి. - పూజ, 9వ తరగతి విద్యార్థిని నల్లగుట్టలో... రాంగోపాల్‌పేట్: రాంగోపాల్‌పేట్ డివిజన్లోని నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో శనివారం విద్యార్థుల సంఖ్య పలుచగా కనిపించింది. 10 మంది ఉపాధ్యాయులు 10వ తరగతి పరీక్షల విధులకు వెళ్లడంతో వీరికి బోధించే వారే కరువయ్యారు. కొంత మంది విద్యార్థుల నుంచి గత ఏడాది పుస్తకాలు సేకరించినా ఉపాధ్యాయులు అందుబాటులో లేరు. 9 నుంచి 10వ తరగతికి వెళుతున్న వారికి టెన్త్ పరీక్షలు పరీక్షలు పూర్తయిన తర్వాతే పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు తక్కువగా హాజరవుతున్నారు. కవాడిగూడలో... కవాడిగూడ: కవాడిగూడ ప్రభుత్వ పాఠశాలలోని 20 మంది ఉపాధ్యాయులలో 15 మంది ఎస్సెస్సీ పరీక్షల విధుల్లో ఉన్నారు. ఇతర విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిసిన కారణంగా చాలా వరకూ పాఠశాలకు రావడం లేదు. 30 శాతమే వస్తున్నారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలోనూ ఇదే తీరు. విద్యార్థులు చాలా వరకూ రావడం లేదు. ఉపాధ్యాయులేమో పదో తరగతి పరీక్షల డ్యూటీలో ఉన్నారు. కొత్త తరగతులకు సంబంధించిన పుస్తకాలు అందనందున విద్యార్థులకు లెటర్ రైటింగ్, జనరల్ టాపిక్స్, గ్రామర్, మ్యాప్ పాయింటింగ్, సైన్స్ డయోగ్రామ్స్ వంటివి బోధిస్తున్నారు. హైదర్‌గూడలో... హిమాయత్‌నగర్: హైదర్‌గూడలోని గవర్నమెంట్ సెయింట్‌పీటర్స్ హైస్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 172 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 19 మంది 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. మిగతా 151 మందిలో కొంతమందే వస్తున్నారు. జగద్గిరి గుట్టలో... జగద్గిరిగుట్ట/చింతల్: జగద్గిరిగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కొందరు మైదానంలో.. మరికొంత మంది వరండాల్లో ఆడుకుంటున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వార్షిక పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే పనిలో పడి స్టాఫ్ రూమ్‌లకు పరిమితమయ్యారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు 828 మంది ఉండగా... శనివారం కేవలం 482 మంది మాత్రమే హాజరయ్యారు. చింతల్ భగత్‌సింగ్ నగర్లో... చింతల్ భగత్‌సింగ్‌నగర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వారిని మినహాయిస్తే మొత్తం 100 మంది విద్యార్థులు ఉండగా.. 70 మంది హాజరయ్యారు. హెచ్ఎంతో కలిపి 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో నలుగురు హాజరు కాగా... ఇద్దరు గైర్హాజరయ్యారు. మరో ముగ్గురు పరీక్షల విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత పాఠశాలకు నాలుగు రోజుల క్రితం కొత్త పుస్తకాలు వచ్చాయి. విద్యార్థులు తక్కువగా హాజరు కావడంతో వాటిని పంపిణీ చేయలేదు. పిల్లలు ఆటపాటలతో కాలక్షే పం చేస్తున్నారు. గురుమూర్తినగర్‌లో.. రంగారెడ్డినగర్ డివిజన్ గురుమూర్తినగర్ హైస్కూల్లో పదో తరగతి వారిని మినహాయిస్తే 214 మంది విద్యార్థులున్నారు. వీరిలో 117 మంది హాజరయ్యారు. 15 మంది ఉపాధ్యాయులకు 14 మంది హాజరయ్యారు. కొత్త పుస్తకాలను సోమవారం పంపిణీ చేస్తామని హెచ్ఎం సుదర్శన్ తెలిపారు. -
డీఈఓ వెబ్సైట్లో టెన్త్ మోడల్ పేపర్స్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి మాదిరి ప్రశ్నాపత్రాలు జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది వార్షిక పరీక్షలు కొత్త విధానంలో నిర్వహిస్తున్నందున విద్యార్థులకు అవగాహన కోసం వాటిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటిని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఈఓరంగారెడ్డి.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు.