
సబ్జెక్టుకు రూ.మూడు, నాలుగు లక్షల్లో వసూలు
అక్రమాలకు విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం నుంచి సహకారం
ఎంబీబీఎస్ పరీక్షల్లో అక్రమాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు అవసరమని డిమాండ్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో అక్రమాల వ్యవహారంపై దుమారం రేగుతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంబీబీఎస్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఘటన మరువకముందే అదే నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో జరిగిన మరో అక్రమాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వార్షిక పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలను ‘ఎంబీబీఎస్ పరీక్షల్లో అక్రమాల వైరస్’ కథనం ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.
ఈ వ్యవహారం ప్రస్తుతం వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్(ఎంసీక్యూ) విభాగంలో పలువురికి అన్ని సబ్జెక్టుల్లో 20కి 19 మార్కులు రావడం, ఇలా స్కోర్ చేసిన వారు థియరీలో బొటా»ొటి మార్కులు సాధించడం, కొందరైతే ఒకటిరెండు సబ్జెక్టులు తప్పడం వంటివి ఆధారాలతో సహా బయట పెట్టింది. ఈ అక్రమం ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం సహాయ సహకారాలతో చోటు చేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.
విశ్వవిద్యాలయంలోని కొందరు అధికారులు, కళాశాలల్లో పనిచేసే ఫ్యాకల్టీ, సిబ్బంది, బయటి వ్యక్తులు రింగ్‌లా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారని వెల్లడవుతోంది. వీరు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివే ధనవంతుల కుటుంబాల్లోని చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని అక్రమానికి పాల్పడుతున్నట్టు సమాచారం. ఎంసీక్యూల్లో 95 శాతం మార్కులు సాధించేలా విద్యార్థులకు అడ్డదారుల్లో సాయం చేసిపెట్టేలా ఒక్కో సబ్జెక్టుకు రూ.మూడు, నాలుగు లక్షలపైనే వసూళ్లు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
వీరితో డీల్ కుదుర్చుకున్న విద్యార్థుల నుంచి సబ్జెక్టుల వారీగా డబ్బు వసూలు చేసి అడ్డదారుల్లో 20కు 19 స్కోర్ చేసేలా చక్రం తిప్పారు. ఎంసీక్యూల్లో 19 మార్కులు వచి్చనా ఒకవేళ థియరీలో కనీసం 21 మార్కులు సాధించలేక ఫెయిల్ అయితే డబ్బు వెనక్కు ఇవ్వబోమని ముందే విద్యార్థులతో ఎంవోయూ చేసుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. దీంతో వీరికి రూ.లక్షల్లో చెల్లించి, థియరీలో రాణించలేక ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. వాస్తవానికి పరీక్షల సమయంలో విశ్వవిద్యాలయం నుంచి ఓ పరిశీలకుడిని నియమిస్తారు. స్క్వాడ్ బృందాలతోపాటు, పరీక్ష హాల్‌లో సీసీ కెమెరాలు ఉంటాయి.
ఈ వ్యవస్థల కళ్లుగప్పి ఉన్నత స్థాయిలో సహాయ సహకారాలతోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో సిద్ధార్థ సెంటర్‌లో మాస్ కాపీయింగ్ ఘటన సమయంలోనే వ్యవస్థీకృత అక్రమాల బాగోతం బయపడింది. మాస్ కాపీయింగ్ ఘటనలతో రద్దయిన సిద్ధార్థ సెంటర్‌కు తిరిగి అనుమతులు ఇవ్వడం, తిరిగి అదే సెంటర్‌లో పలుమార్లు కాపీయింగ్ ఘటనలు చోటుచేసుకోవడంలో పరీక్షల విభాగంలోని ఓ కీలక అధికారి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి.
ఇతనికి ఉన్నత స్థాయిలో అండదండలు ఉండటంతో ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకుని సమస్యను తొక్కిపెట్టింది. కాగా, ఆరోగ్య విశ్వవిద్యాలయం కనుసన్నల్లో వ్యవస్థీకృత నేరంలా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేయాలని వైద్య వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది.
ఎంసీక్యూ, థియరీని ఒకదానితో ఒకటి పోల్చలేం
దడి కట్టినట్టు వార్షిక పరీక్షల్లో కొందరు విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో ఎంసీక్యూల్లో 20కు 19 మార్కులు రావడాన్ని ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు సమరి్థంచారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ‘సాక్షి’ కథనానికి వివరణ ఇచ్చారు. పరీక్షల్లో ఎంసీక్యూ, థియరీ విభాగానికి ఒకదానితో మరొకటి పోల్చలేమని చెప్పారు.