
ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఎంసీక్యులో 20కు 19 సాధించి గైనకాలజీ లో ఫెయిల్ అయిన విద్యార్థి స్కోర్ కార్డు
వైద్యవిద్య వార్షిక పరీక్షల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
ఏప్రిల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎంబీబీఎస్ పరీక్షల్లో అక్రమాలు
ఎంసీక్యూ విభాగంలో పలువురికి అన్ని సబ్జెక్టుల్లో 20కి 19 మార్కులు
వారికి థియరీలో 15 నుంచి 30 మార్కులే..
ఎంసీక్యూలో దుమ్ముదులిపినా.. పలు సబ్జెక్టుల్లో ఫెయిల్!
సాక్షి, అమరావతి: వైద్యవిద్య (ఎంబీబీఎస్) పరీక్షలకు అక్రమాల వైరస్ సోకింది. ఏదో ఒకరకంగా పాస్ కావడమే ధ్యేయంగా ఉన్న పలువురు విద్యార్థులకు కొందరు అధికారులు అండదండలందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో ఈ అక్రమాలు ఏ రీతిన జరిగాయో ఫలితాలతో వెల్లడైంది. వందమార్కుల పేపర్‌ను 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల (ఎంసీక్యూ) రూపంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.
ఎంసీక్యూ విభాగంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు థియరీ పేపర్‌లో తక్కువ మార్కులతో తప్పారు. ఒక్కో సబ్జెక్టులో పాస్ మార్కులు 40 కాగా.. ఎంసీక్యూలో 19 తెచ్చుకున్నవారు థియరీలో 21 మార్కులు కూడా తెచ్చుకోలేక ఫెయిలయ్యారంటే పరీక్షల తీరు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వైద్యవిద్యపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.
» వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థికి జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ సబ్జెక్టుల్లో పేపర్–1, 2లలో ఎంసీక్యూ విభాగంలో 20కి 19 చొప్పున (95 శాతం) మార్కులు వచ్చాయి. ఎంసీక్యూల్లో దుమ్ముదులిపిన
అతడికి థియరీలో పేపర్–1 జనరల్ మెడిసిన్ 31, సర్జరీ 27, పీడియాట్రిక్స్ 28, గైనకాలజీ 15 మార్కులు వచ్చాయి. గైనిక్‌లో కనీసం పాస్ మార్కులు సాధించలేకపోయి ఫెయిలయ్యాడు.
» మరో ప్రైవేట్ కళాశాల విద్యార్థికి ఫోరెన్సిక్ మెడిసిన్, ఆప్తమాలజీ, ఓటోరినోలారింగాలజీ (ఈఎన్‌టీ), కమ్యూనిటీ మెడిసిన్ సబ్జెక్టుల పేపర్–1లో ఎంసీక్యూలో 19 మార్కులు వచ్చాయి. కమ్యూనిటీ మెడిసిన్ పేపర్–2లో 18 సాధించాడు. అతడికి ఆప్తమాలజీలో 80కి కేవలం 5 మార్కులు రావడంతో ఆ సబ్జెక్టులో ఫెయిలయ్యాడు.
» మరో విద్యారికి సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ సెకండ్ క్లాస్‌లో పాసయ్యాడు. అతడికి ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ పేపర్–1, 2ల్లో ఎంసీక్యూల్లో 19 చొప్పున మార్కులు వచ్చాయి. కానీ.. థియరీలో ఒక్క సబ్జెక్టులోనూ 50 శాతం స్కోర్ చేయలేకపోయాడు.
వీరి తరహాలోనే మరికొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో ఎంసీక్యూల్లో 95 శాతం స్కోర్ చేసి థియరీలో బొటా»ొటి మార్కులతో పాసవగా, పలువురు ఫెయిలయ్యారు. సాధారణంగా ఎంసీక్యూ విభాగంలో 15 నుంచి 17 మార్కులు గరిష్టంగా సాధించే ప్రతిభావంతులైన విద్యార్థులు థియరీలో 40 నుంచి 50 శాతం మార్కులు సాధిస్తుంటారని వైద్యవిద్య బోధకులు తెలిపారు. కానీ ఇప్పుడు ఎంసీక్యూ విభాగంలో 95 శాతం మార్కులు వచ్చిన వారు కూడా ఆ మార్కులు కలిపినా సబ్జెక్టులో తప్పుతుండటంతో పరీక్షల్లో అక్రమాల ఆరోపణలకు బలం చేకూరుతోంది.
వ్యవస్థీకృత అక్రమం
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల సెంటర్‌లో మాస్ కాపీయింగ్ దుమారం రేగిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం కనుసన్నల్లోనే వ్యవస్థీకృతంగా కాపీయింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రైవేట్ కళాశాలలు, విద్యార్థుల నుంచి గ్యారంటీ పాస్ హామీతో కొందరు అధికారులు రూ.లక్షలు వసూలుచేసి పరీక్షల అనంతరం జవాబు పత్రాలను తారుమారు చేస్తున్నారనే నేరారోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాపీయింగ్ రాకెట్‌పై లోతైన దర్యాప్తు చేయకుండానే ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. ఈ ఘటన మరుకముందే అదే నెలలో నిర్వహించిన అకడమిక్ పరీక్షల్లోనూ ఎంసీక్యూ మార్కుల గోల్‌మాల్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటా కింద రూ.లక్షల్లో ఫీజులు కట్టిన విద్యార్థులు కొందరు అకడమిక్ పరీక్షల్లో రాణించలేకపోతున్నారు.
అలాంటివారి నుంచి డబ్బు వసూలుచేసి ఎంసీక్యూల్లో ఏకంగా 20కి 19 మార్కులు వచ్చేలా కొందరు అక్రమార్కులు సహాయసహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. విశ్వవిద్యాలయం అధికారులు, పరీక్ష విధుల్లోని సిబ్బంది, విద్యార్థులు కుమ్మక్కై ఈ వ్యవస్థీకృత అక్రమానికి తెరలేపారని అర్థమవుతోంది.