ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఎలా దూసుకుపోతోందో చూస్తూనే ఉన్నాం. ఇపుడు మరో అడుగు ముందుకువేసి ఓ ప్రైవేటు డిటెక్టివ్‌లా మారి ఓ వ్యక్తి రహస్యాలని బయటపెట్టి భయపెట్టేసింది. న్యూయార్క్ సిటీలో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన నెట్టింట హల్‌చల్ చేస్తోంది. న్యూయార్క్‌కు చెందిన ఒక 27 ఏళ్ల మహిళ, తనకంటే పెద్దవాడైన ఒక ప్రోఫెషనల్‌తో డేటింగ్‌కు వెళ్ళింది. ఆ వ్యక్తి ప్రతి విషయానికీ తన ఫోన్‌లో చాట్ జీపీటీని వాడుతూనే ఉన్నాడు. కాక్‌టెయిల్స్ చరిత్ర నుండి మాటలు కలపడం వరకు ప్రతిదానికీ అతను చాట్ జీపీటీపై ఆధారపడుతున్నాడు.
ఇది గమనించిన ఆమె అతన్ని ఆటపట్టించింది. దానికతను, ‘చాట్ జీపీటీ నా బెస్ట్ ఫ్రెండ్. నా గురించి ఏదైనా దీన్ని అడుగు, అది చెబుతుంది’ అని తన ఫోన్ ను ఆమెకు గర్వంగా ఇచ్చాడు. అపుడు ఆ మహిళ సరదాగా.. నా గురించి నీకు నచ్చిన, ఎవరికీ చెప్పని ఒక విషయాన్ని చెప్పు.. అని టైప్‌చేసింది. ఆ ప్రశ్నకు వెంటనే చాట్‌జీపీటీ .. నువ్వు నీ భార్య పట్ల ఎంతో ప్రేమగల భర్తవు, నీ పిల్లల పట్ల ఎంతో బాధ్యత గల తండ్రివి.. ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది.. అని చెప్పింది. ఈ సమాధానం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లయి, పిల్లలున్నారనే విషయం తెలియడంతో ఆ డేటింగ్ అక్కడితో ముగిసింది. ఆ వ్యక్తి గతంలో తన భార్యకు బహుమతులు కొనడానికో లేదంటే పిల్లల పెంపకం కోసమో చాట్‌జీపీటీని సలహాలు అడిగి ఉండవచ్చు. ఆ సమయంలో అతను ఇచ్చిన సమాచారాన్ని ఏఐ తన మెమరీలో సేవ్ చేసుకుని.. ఇలా అతని గుట్టు రట్టు చేసింది. ఎక్స్ వేదికగా ప్రముఖ డేటింగ్ కోచ్ బ్లెయిన్ ఆండర్సన్ షేర్ చేసిన ఈ విషయంపై .. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మోసం చేయాలనుకున్న అతనికి ఏఐ తగిన శాస్తి చేసిందని కొందరు స్పందించగా.. ఏఐ మన సమాచారాన్ని ఎంతలా గుర్తుంచుకుంటుందో చూస్తుంటే భయమేస్తోందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.


