పంతం నెగ్గించుకున్న ట్రంప్‌ | US oil companies will rebuild Venezuela industry | Sakshi
Sakshi News home page

పంతం నెగ్గించుకున్న ట్రంప్‌

Jan 4 2026 1:23 AM | Updated on Jan 4 2026 7:03 AM

US oil companies will rebuild Venezuela industry

దశాబ్దాల వైరానికి అలా ముగింపు! 

వెనెజువెలా అపార చమురు నిల్వలు యూఎస్‌ గుప్పెట్లోకి! 

విపక్ష నేత మచాడో చేతికి అధ్యక్ష పగ్గాలు?

ఒక అగ్రరాజ్యపు దురాశ. సొంత పాలకుల నియంతృత్వ, పెడపోకడలు. ఫలితంగా దశాబ్దాలుగా నలిగిపోతూ సాగుతున్న వెనెజువెలా ప్రస్థానం కాస్తా, ఏకంగా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంతో తాజాగా మరో మలుపు తిరిగింది. అత్యాశ, అధికార లాలస నడుమ జరిగిన ఆరాట పోరాటాల్లో అక్కడి ప్రజల స్వేచ్ఛాకాంక్షలు మరోసారి సమాధయ్యాయి. ట్రంప్‌ విపరీత మనస్తత్వం దృష్ట్యా ఇకపై వెనెజువెలా భవితవ్యం ఎలా ఉండనుందన్నది ఎవరి అంచనాలకూ అందని 

పరిస్థితి... ఆది నుంచీ అంతంతే... 
అమెరికాతో వెనెజువెలా సంబంధాలు ముందునుంచీ ఉప్పూ నిప్పుగానే సాగుతూ వస్తున్నాయి. వెనెజువెలాలోని అపార చమురు నిల్వలపై అమెరికాకు తొలి నుంచీ కన్నుంది. అగ్రరాజ్యపు చమురు దోపిడీని 1999లో వెనెజువెలా అధ్యక్షుడైన హ్యూగో చావెజ్‌ అడ్డుకోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బీటలువారాయి. నాటినుంచీ పరిస్థితి క్రమంగా దిగజారుతూనే వస్తోంది. వెనెజువెలాపై అమెరికా ఎడాపెడా ఆంక్షలు విధిస్తూ, వాటిని నానాటికీ పెంచేస్తూ వస్తోంది. తొలుత చావెజ్, ఆ తర్వాత తాజాగా పదవీచ్యుతుడైన నికొలస్‌ మదురో ఇద్దరూ నియంతృత్వ పోకడలతోనే పాలించారు.

 దాంతో పాతికేళ్లకు పైగా దేశం తిరోగమన బాటలోనే సాగుతూ వస్తోంది. అమెరికాలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న డ్రగ్‌ కార్టెల్స్‌ మూలాలన్నీ వెనెజువెలాలోనే ఉన్నాయన్నది ట్రంప్‌ ఆరోపణ. ఇది చాలదన్నట్టు వెనెజువెలా నుంచి తమ దేశంలోకి జనం విపరీతంగా వలస వచ్చిపడుతున్నారంటూ కొంతకాలంగా ఆయన మండిపడుతున్నారు. డ్రగ్స్‌ మోసుకెళ్తున్నాయనే సాకుతో కొన్నాళ్లుగా వెనెజువెలా చమురు నౌకలను అడ్డుకుంటూ, పేల్చేస్తూ వస్తున్న అమెరికా చివరికి తాజాగా అధ్యక్షుడే లక్ష్యంగా సైనిక చర్యకే దిగి భార్యాసమేతంగా నిర్బంధంలోకి తీసుకుంది. 

వ్యతిరేకులతో దోస్తీ! 
వెనెజువెలా విషయంలో అమెరికా దూకుడును అడ్డుకోవడానికి ఆ దేశాధ్యక్షులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు. చావెజ్‌ తన హయాంలో యూఎస్‌ వ్యతిరేక శక్తులైన రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో చెలిమి చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం దిగజారకుండా చూసుకోగలిగారు. అలా తనపై జనాగ్రహం ప్రబలకుండా జాగ్రత్త పడ్డారు. చమురు విక్రయాలతో వచ్చే మొత్తాలతో దేశంలో పేదరికాన్ని చాలావరకు తగ్గించారు. కానీ మదురోలో ఆ ముందుచూపు లోపించిందంటారు పరిశీలకులు. 

ఆయన   హయాంలో దేశంలో అన్ని రంగాల్లోనూ పరిస్థితి క్రమంగా దిగజారుతూ వచ్చింది. ఇటు ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. అటు ట్రంప్‌ రాకతో అమెరికా దూకుడు పెరిగింది. దాంతో రాజకీయంగానే గాక ఆర్థికంగానూ వెనెజువెలా పరిస్థితి దయనీయంగా మారింది. ఒక దశలో దేశంలో ఆహార నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. దాంతో బతుకుదెరువు కోసం జనం భారీగా దేశం వీడటం పరిపాటిగా మారింది. గత పదేళ్లలో కోటిమందికి పైగా విదేశాల బాట పట్టినట్టు అంచనా. విచ్చలవిడిగా పెరిగిపోయిన అధికారుల అవినీతిని అదుపు చేయడం మదురో తరం కాలేదు.

 దీనికితోడు వెనెజువెలా చమురు అమ్మకాలన్నింటినీ అమెరికా దాదాపుగా అడ్డుకుంది. దాంతో ప్రధాన ఆదాయ వనరు మూసుకుపోయి మదురో సమస్యలు రెట్టింపయ్యాయి. కొంతకాలంగా చైనా వంటి దేశాలకు కారుచౌకగా చమురు విక్రయించుకుంటూ నెట్టుకొస్తున్న పరిస్థితి. అంతర్గత సమస్యలు ఇలా చేయి దాటుతుండగానే ట్రంప్‌ ఒక్కసారిగా రూటు మార్చి వెనెజువెలాపై గత సెప్టెంబర్‌ నుంచే సైనిక చర్యలకు శ్రీకారం చుట్టారు. వెనెజువెలా గగనతలాన్ని మూసేస్తున్నట్టు గత నవంబర్‌లో ప్రకటించారు. వెనెజువెలా చుట్టూ సైన్యం మోహరింపులను పెంచేశారు. చివరికి మదురోను క్రిమినల్‌గా పేర్కొనడమే గాక, ఆయన్ను పట్టిస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల నజరానా ప్రకటించారు. 

మచాడో ఫ్యాక్టర్‌! 
మదురో దంపతులను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుందన్న వార్తలపై వెనెజువెలాలో ఆగ్రహావేశాలు దేవుడెరుగు, పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కావడం లేదు. ఇది మదురో స్వయంకృతమే అయినా, ఆయన పట్ల జనంలో నెలకొన్న వ్యతిరేకతను ఆగ్రహావేశాలుగా మార్చడంలో వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో పాత్ర కీలకమే. మదురో హయాంలో దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన కనీవినీ ఎరగని రీతిలో జరిగింది. దీనిపై అంతర్జాతీయ సంస్థలన్నీ గగ్గోలు పెట్టే పరిస్థితి. మదురోకు వ్యతిరేకంగా గళమెత్తిన వారంతా రాత్రికి రాత్రే మాయం కావడం, తీవ్ర నిర్బంధానికి గురవడం షరామామూలుగా మారింది. 

అలాంటి సమయంలో తెరపైకి వచ్చిన మచాడో ప్రజా గళంగా మారారు. మదురో నియంతృత్వ పోకడలపై ఏళ్లుగా మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. ప్రజల సొత్తయిన అపార వనరులన్నింటినీ మదురో, ఆయన అనుయాయులు అయినకాడికి దోచుకుంటున్నారంటూ ఆమె చేసిన ఉద్రేకపూరిత ప్రసంగాలకు ప్రజల్లో గొప్ప స్పందన వచ్చింది. చూస్తుండగానే మచాడోకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం ఖాయమనే దాకా వెళ్లింది. 

ఈ ముప్పును ముందే పసిగట్టిన మదురో, మచాడోపై హాస్యాస్పదమైన అవినీతి, దాంతోపాటు దేశద్రోహం తదితర ఆరోపణలు మోపారు. చివరికి ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా అనర్హత వేటు వేయించారు. ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌ తదితరాల సాయంతో తిరిగి ఎన్నికయ్యారు. అవి అత్యంత ఏకపక్ష ఎన్నికలంటూ అంతర్జాతీయంగా విమర్శలు రేగినా పట్టించుకోలేదు. మచాడోపై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. దాంతో ప్రాణరక్షణ కోసం ఆమె అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఏడాది తనకు ప్రకటించిన నోబెల్‌ శాంతి బహుమానం అందుకునేందుకు మారువేషంలో నార్వే వెళ్లే ప్రయత్నంలో మచాడో పడవ ప్రమాదానికి గురై గాయపడ్డారు.    

అమెరికా దన్ను 
మదురో శకానికి తెర పడటం ఖాయమైన నేపథ్యంలో అమెరికా ఆశీస్సులున్న మచాడోయే అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విపక్ష నేత మచాడోకు అమెరికా మొదటినుంచీ దన్నుగా నిలుస్తూ వస్తోంది. తన నోబెల్‌ బహుమానాన్ని ట్రంప్‌కు అంకితమిస్తున్నట్టు ఆమె చేసిన ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా భావిస్తున్నట్టుగా అమెరికా ఆశీస్సులతో మచాడో గద్దెనెక్కినా అగ్రరాజ్యం పడగ నీడన దేశవాసుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడం, దేశ పరిస్థితులను గాడిన పెట్టడం ఆమెకు కత్తిమీద సామే కానుంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement