మదురో దంపతుల.. యుద్ధనౌకలో న్యూయార్క్‌కు తరలింపు | Venezuela President Maduro couple Flown to New York on a warship | Sakshi
Sakshi News home page

మదురో దంపతుల.. యుద్ధనౌకలో న్యూయార్క్‌కు తరలింపు

Jan 4 2026 5:19 AM | Updated on Jan 4 2026 10:47 AM

Venezuela President Maduro couple Flown to New York on a warship

వెనెజువెలాపై అమెరికా భీకర దాడులు దేశాధ్యక్షుడు బందీ

ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

యుద్ధనౌకలో మదురో దంపతులు న్యూయార్క్‌కు తరలింపు

కరాకస్‌: ఎన్నో యుద్ధాలను ఆపానంటూ నోబెల్‌ శాంతి బహుమతికి అర్హుడనని జబ్బలు చరుచుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అందుకు పూర్తి భిన్నంగా సమీప దేశంపై ఏకపక్షంగా దాడి చేసి ఏకంగా దేశాధినేతను బందీగా పట్టుకొని ప్రపంచ దేశాలను విస్మయపరిచారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల సరఫరాను హోరెత్తించి పరోక్షంగా హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో నివాసంపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక అమెరికా సైన్యం మెరుపుదాడులు చేసింది. మదురోతోపాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌నూ బందీలుగా పట్టుకుంది. కరాకస్‌ సిటీలోని ఫోర్ట్‌ టియూనా సైనిక స్థావరంలోని సొంతింట్లో ఉన్న మదురో దంపతులను అమెరికా సైన్యం బందీలుగా పట్టుకున్నట్లు వెనెజువెలా అధికార పార్టీ నేత నహూమ్‌ ఫెర్నాండెజ్‌ వెల్లడించారు. 

అంతకుముందు కరాకస్‌ సిటీపై అమెరికా యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. భారీ స్థాయిలో క్షిపణులు, రాకెట్లను ప్రయోగించి వెనెజువెలా సైనిక స్థావరాలు, జనావాసాలను భూస్థాపితం చేశాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, పెద్ద సంఖ్యలో జనం గాయాలపాలయ్యారని వార్తలొచ్చాయి. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న కరాకస్‌వాసులు పేలుళ్ల కారణంగా నిద్రలోనే కన్నుమూశారు. ఒక్కసారిగా బాంబులు పేలుతున్న శబ్దాలు, నేలమట్టమవుతున్న భవనాలతో జనం ప్రాణభయంతో పరుగులుతీశారు. సైనిక స్థావరాలు, పలు భవనాలు అగ్నికి ఆహుతవుతున్న, దట్టంగా పొగలు వెలువుడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

దాడుల ధాటికి ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి గాఢాందకారం అలుముకుంది. ‘‘అర్ధరాత్రి పుట్టినరోజు పార్టీకి వెళ్లి తిరిగొస్తూ బంధువులతో కలిసి రోడ్డుపై నడుస్తుంటే హఠాత్తుగా బాంబుల వర్షం కురిసింది. అవి పేలిన ధాటికి భూమి కూడా కంపించింది. ప్రతి ఒక్క వస్తువు కదిలిపోయింది. మిస్సైళ్లు, మంటలు, విమాన శబ్దాలతో మా ప్రాంతం ఒక్కసారిగా యుద్దభూమిగా మారిపోయింది’’అని 21 ఏళ్ల కార్మీకురాలు కార్మెన్‌ హిదాల్గో ఏడుస్తూ చెప్పారు. మాదకద్రవ్యాల రవాణా కట్టడికి, ద్వైపాక్షిక చర్చలుజరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మదురో ప్రభుత్వం ప్రకటించిన కొద్ది గంటలకే అమెరికా దాడులు చేయడం గమనార్హం. 

సైనిక ఆపరేషన్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమెరికా నుంచి వీక్షిస్తున్న ట్రంప్‌ 

యుద్ధనౌకలో తరలిస్తున్నాం: వెనెజువెలాపై సైనిక దాడి విష యాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా తన సొంత సా మాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ప్రకటించారు. ‘‘వెనెజువెలాపై అమెరికా అతిపెద్ద దాడిని విజయవంతంగా పూర్తిచేసింది. వాళ్ల అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని బంధించి వెనెజులా నుంచి దూరంగా వేరే దేశానికి మా ‘అయోమా జిమా’ యుద్ధ నౌకలో తరలిస్తున్నాం. నౌక న్యూయార్క్‌కు చేరుకోబోతోంది. వాళ్లను న్యూయార్క్‌ చట్టాల ప్రకారం శిక్షిస్తాం. దాడి సందర్భంగా అమెరికా సైనికులు సైతం గాయపడ్డారు. కానీ ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఒక హెలికాప్టర్‌ బాగా దెబ్బతింది. 

అయినాసరే మా సైనికులు అందరూ క్షేమంగా తిరిగొచ్చారు. దాడులు చేయక తప్పలేదు. ఎందుకంటే ఇది యుద్ధం’’ అని ట్రంప్‌ పెట్టిన పోస్ట్‌ను అమెరికా శ్వేతసౌధం తన ‘ఎక్స్‌’ ఖాతాలో జతచేసింది. ‘‘మదురోను అదుపులోకి తీసుకున్నాక వెనెజువెలాను అలా వదిలేయలేం. మదురో మాకు ముఖ్యం కాదు. ఆ దేశం నుంచి డ్రగ్స్‌ ఆగడమే మాకు కావాలి. డ్రగ్స్‌ ముఠాలను కట్టడిచేసే దమ్మున్న ప్రభుత్వం అక్కడ నెలకొనాలి. ఇంకెవరో అనామకుడు పరిపాలిస్తామంటూ ఊరుకునేది లేదు. అక్కడ ఎవరు పరిపాలించాలనేదే మేం నిర్ణయిస్తాం. దాడులపై అమెరికా కాంగ్రెస్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదన్న డెమొక్రాట్ల వాదనలో పసలేదు. డెమొక్రాట్లు అసమర్థులు, తెలివితక్కువ వాళ్లు. నిజానికి గొప్ప పని చేశావని నన్ను పొగడాలి. కానీ చట్టవ్యతిరేకమని తిడుతున్నారు. 

ఏళ్ల తరబడి ఇవే మాటలు వినీవినీ చెవుడు వచ్చేస్తోంది’’ అని తర్వాత ఫాక్స్‌న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఎగతాళిగా మాట్లాడారు. ఒక పరాయిదేశంపై దాడి చేసి ఏకంగా అగ్రనేతను అపహరిచడం అమెరికా చరిత్రలో గత 4 దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా 36 ఏళ్ల క్రితం పనామా దేశ నాటి సైనిక పాలకుడు ఆంటోనియో నోరిగాను అమెరికా సైన్యం దాడిచేసి పట్టుకొచ్చింది. ‘‘మెక్సికో సైతం డ్రగ్స్‌ భరతం పడితే మంచిది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బమ్‌ చేతులు ముడుచుకుని కూర్చుంటే మెక్సికో మీద సైనిక చర్యకు అమెరికా రంగంలోకి దిగక తప్పదేమో’’అని ట్రంప్‌ పరోక్షంగా హెచ్చరించారు.  
 

 


మదురో దంపతుల జాడ తెలీదు..: అమెరికా వైమానిక దాడుల తర్వాత మదురో దంపతుల జాడ తెలియకుండా పోయిందని వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్‌ శనివారం ఉదయం ప్రకటించారు. ‘‘శత్రుదేశం దాడుల తర్వాత మదురో, ఫ్లోరెస్‌ల జాడ తెలియడం లేదు. వాళ్ల క్షేమ సమాచారం అందుబాటులో లేదు. వాళ్ల యోగక్షేమాల వివరాలను అమెరికా తక్షణం బయటపెట్టాలి. దేశంపై దాడుల నేపథ్యంలో సాయుధ బలగాలన్నింటినీ రంగంలోకి దింపుతున్నాం. సైనిక చర్యకు దీటుగా స్పందిస్తాం. ప్రజలు సైతం దేశాధ్యక్షుడి కిడ్నాప్‌ను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాలి’’ అని రోడ్రెజ్‌ పిలుపునిచ్చారు. అత్యయిక విదేశీ విధ్వంసక స్థితిని రోడ్రెజ్‌ ప్రకటించారు.

పడక గది నుంచి బరబరా లాక్కెళ్లి..
వాషింగ్టన్‌: కరాకస్‌లోని కట్టుదిట్టమైన భద్రత ఉన్న సైనికస్థావరంలోని ఇంట్లో అర్ధరాత్రి పడగదిలో నిద్రిస్తున్న మదురో దంపతులను అమెరికా సైనికులు మెరుపువేగంతో బంధించి హెలికాప్టర్‌లోకి ఎక్కించి అక్కడి నుంచి యుద్ధనౌకలోకి తరలించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఫాక్స్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ వీకెండ్‌ కార్యక్రమంలో ట్రంప్‌ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘ అమెరికా సైన్యంలోని డెల్టా ఫోర్స్‌ విభాగం నేతృత్వంలో ఈ ఆపరేషన్‌ మొత్తం జరిగింది. అధ్యక్ష ప్రాసాదాన్ని సైనికబలగాలతో శత్రుదుర్బేధ్య కోటలా మార్చేశారు. అలాంటి చోట కూడా మా బలగాలు అద్భుతంగా అరగంటలో పని ముగించాయి’’ అని అన్నారు. 

ఆపరేషన్‌ పూర్తి వివరాలనుఅమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ డ్యాన్‌ కెయిన్‌ వెల్లడించారు. ‘‘ ఈ ఆపరేషన్‌కు అబ్సల్యూట్‌ రిసాల్వ్‌ అని పేరుపెట్టాం. ఏదైనా తేడా జరిగి భారీ ప్రతిదాడి చేయాల్సి వస్తే స్పందించేందుకు వీలుగా పశ్చిమార్థగోళంలో ఎఫ్‌–18, ఎఫ్‌–22, ఎఫ్‌–35 యుద్ధ విమానాలు సహా బీ–1 బాంబర్లు, డ్రోన్లను మొహరించాం. ట్రంప్‌ ఆదేశించగానే శుక్రవారం రాత్రి 10.46 గంటలకు ఆపరేషన్‌ మొదలెట్టాం. అర్ధరాత్రి దాటాక సరిగ్గా 1.01 గంటలకు మదురో ఉంటున్న అధికారభవనం ప్రాంగణంలోకి అమెరికా డెల్టా ఫోర్స్‌ సైనికులు అడుగుపెట్టారు. మెరికల్లాంటి సైనికులు ఇందులో పాల్గొన్నారు. 

సరైన సమయం కోసం వేచి ఉండి తర్వాత మదురో ఇంట్లోకి చొరబడి బెడ్‌రూమ్‌లో ఉన్న దంపతులను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఈలోపే వెనెజులా సైనికులు మాపైదాడి చేశారు. మా హెలికాప్టర్‌ ఒకటి దారుణంగా దెబ్బతింది. అయినాసరే వేగంగా స్పందించి వాళ్ల సైనికులను నిలువరించాం. 3.29 గంటలకు మా హెలికాప్టర్‌లోకి మదురో దంపతులను ఎక్కించాం. వెంటనే హెలికాప్టర్‌ యుద్దనౌక వైపు మెరుపువేగంతో వెళ్లిపోయింది. అంతా అనుకున్నట్లే జరిగింది. చాలాకాలం క్రితమే ఇందుకు ప్లాన్‌ చేశాం. మళ్లీ మళ్లీ రిహార్సల్స్‌ చేశాం. చివరకు విజయం సాధించాం’’ అని ఆయన అన్నారు.  

ఆలోపే పట్టేసుకున్నాం: ‘‘మదురో అధికార భవనంలో ఒక సురక్షిత గదిని ఏర్పాటు చేసుకున్నారు. అందులోకి వెళ్తే పట్టుకోవడం అసాధ్యం. అది అత్యంత కఠినమైన ఉక్కు గోడలతో తయారుచేసి ఉంటుంది. అందులోకి ఆయన వెళ్లేలోపే పట్టేసుకున్నాం. అతను రోజూ ఏం చేస్తాడు? ఎన్ని గంటలకు నిద్రపోతాడు? ఏం తింటారు? ఆయనకు పెంపుడు జంతువులు ఏమేం ఉన్నాయి? ఆయన ఎలాంటి బట్టలేసుకుంటాడు? ఇలా ప్రతీది మాకు తెలుసు’’అని ట్రంప్‌ చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement