
తన మద్దతుదారులతో జువాన్ గయిడో
తన ప్రభుత్వానికే సైన్యం మద్దతు ఉందంటూ అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించుకున్నారు.
కారకాస్: వెనెజులా రాజధాని కారకాస్‌లో మంగళవారం ఘర్షణలు చెలరేగాయి. తనకు తానే అధ్యక్షునిగా ప్రకటించుకున్న జువాన్ గయిడో నేతృత్వంలో కొందరు సైనికులు, ఆందోళనకారులు రాజధాని సమీపంలోని వైమానిక స్థావరాన్ని, ప్రధాన రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించగా ప్రభుత్వ సైనికులు వారిని చెదరగొట్టారు. తన ప్రభుత్వానికే సైన్యం మద్దతు ఉందంటూ అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించుకున్నారు. తిరుగుబాటు యత్నాలను సైన్యం తిప్పికొడుతోందన్నారు. కాగా, గయిడో ప్రభుత్వాన్ని రష్యా, చైనా మినహా 50 వరకు దేశాలు గుర్తించాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెనెజులాలో ఆందోళనలు నిత్యకృత్యంగా మారాయి.
మదురోను గద్దె దించేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని గయిడో ప్రకటించారు. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు గాయపడ్డారు. ఆగ్రహించిన ఆందోళనకారులను బస్సుకు నిప్పుపెట్టి జాతీయ రహదారిని దిగ్బంధించారు. సంయమనం పాటించాలని వెనిజులా అధికార, ప్రతిపక్షాలను ఐక్యరాజ్యసమితి కోరింది.