వాషింగ్టన్ డీసీ: అయతుల్లా ఖమేనీ.. ఇరాన్ సుప్రీం లీడర్..! ఇప్పుడు ఇతణ్ని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు అమెరికా సిద్ధమైందా?? 1979లో రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి ఇరాన్‌లో ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం.. దాన్ని అణచివేసేందుకు ఖమేనీ నేతృత్వంలోని ఐఆర్‌జీసీ బలగాల దమనకాండ.. వేల మంది మరణాల నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా ట్రంప్ తన సైన్యంతో టెహ్రాన్‌పై దాడికి సన్నద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, జియోపాలిటిక్స్ ఈక్వేషన్లు అవుననే సమాధానం చెబుతున్నాయి.
మదురోను అరెస్టు చేసిన సమయంలో అమెరికా తన నౌకదళాన్ని ఎక్కువగా వాడుకుంది. అదే సమయంలో సైబర్ ఎటాక్‌లు చేసింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ జలాల సమీపంలోకి రావడంతో.. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పుడు ఇరాన్ సమీపంలోని జలాల్లో పూర్తిస్థాయిలో మోహరించింది. అదే సమయంలో.. వెనిజెవెలా మాదిరిగా సైబర్ దాడి చేసేందుకు అమెరికా సైబర్ కమాండ్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ పౌరులు కూడా ఖమేనీ శకాన్ని ఖతం చేయాలంటూ భీష్మించుకోవడం.. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు కలిసివచ్చింది. నిజానికి 2012లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తాము యురేనియం కడ్డీని తయారు చేశామని ప్రకటించినప్పటి నుంచే అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పుడు టెహ్రాన్‌లో ప్రజాందోళనలు అమెరికాకు కలిసివచ్చాయి. ఇదే అదనుగా యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోంది.
వాస్తవానికి ఇరాన్-అమెరికా వివాదాలు, దాడులు-ప్రతిదాడులు గత ఏడాది నుంచి మొదలయ్యాయి. గత ఏడాది జూన్ 21 అర్ధరాత్రి దాటాక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఆ మర్నాడే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్‌లోని అమెరికా ఎయిర్ బేస్‌లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ దాడి గురించి ఇరాన్ తమకు ముందుగానే సమాచారం అందించిందని అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా చెప్పారు. ఫలితంగా తాము ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. 2020లో ట్రంప్ ఇదే తరహా దాడులు చేయించారు. ఆ ఏడాది జనవరి 3న ఇరాక్‌లోని బగ్దాద్ విమానాశ్రయం సమీపంలో.. కుద్స్‌ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ లక్ష్యంగా దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇరాక్‌లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అల్-అసద్ వైమానిక స్థావరంపై విరుచుకుపడింది. అప్పట్లో కూడా ఇరాన్ ముందస్తుగా సమాచారం ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఈ దాడులతో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగకున్నా.. అప్పట్లో అక్కడ పనిచేసిన సైనికులు ఇప్పుడు అదే ట్రామాలో కొనసాగుతూ మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారనే నివేదికలు వచ్చాయి.
గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పుడు దాడులు-ప్రతిదాడుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టమవుతోంది. అమెరికా సైనిక శక్తి విషయంలో బలంగా ఉంది. ఇరాన్ ఆ విషయంలో చాలా వెనుకబాటులో ఉంది. అయితే.. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో ఇరాన్ గడిచిన మూడేళ్లలో చాలా పురోగతి సాధించింది. అయితే.. సొంత ప్రజలే వ్యతిరేకంగా ఉండడంతో.. ఇరాన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ఇటీవల నివేదికలు వచ్చాయి.
ఖమేనీ ఇప్పటికీ టెహ్రాన్‌లోనే ఉన్నాడా? లేక రష్యాలో తలదాచుకుంటున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశాలయ్యాయి. అయితే.. అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఖమేనీ ఉనికిపై ఓ స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనా.. యుద్ధ విమానాలు, సేనలను ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నా.. ప్రజలకు నష్టం కలగకుండా.. కలుగులో దాక్కొన్న ఖమేనీ, నియంతృత్వ భావాలున్న ఇతర నాయకులే అమెరికా లక్ష్యమని స్పష్టమవుతోంది. అంటే.. పరిమిత ప్రాంతాలపైనే.. ఇంకా చెప్పాలంటే నిర్ణీత భవనాలు, బంకర్లపైనే అమెరికా దాడులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఇరాన్ గార్డ్స్, సైన్యాధికారులు కూడా తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా ట్రంప్ సేనలు ఇరాన్ పెద్దలను బంధించేందుకు దాడులు జరిపే అవకాశాలున్నాయి.


