ముగిసిన మదురో ప్రస్థానం!
అత్యంత సాదాసీదా నేపథ్యం. పుట్టింది ఓ సామాన్య కార్మికుని కుటుంబంలో పనిచేసింది బస్సు డ్రైవర్‌గా. అలాంటి స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం దాకా! చివరికి నియంతగా అప్రతిష్ట మూటగట్టుకుని ఏ పెద్ద దేశం అధ్యక్షునికీ జరగని రీతిలో పరాయి దేశ బందీగా మారిన దైన్యం. వెనెజువెలా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం...
నికొలస్ మదురో 1962లో వెనెజువెలా రాజధాని కరాకాస్‌లో అతి సామాన్య కుటుంబంలో పుట్టారు. ఆయన బాల్యం సాధారణంగానే గడిచింది. చదువు హైసూ్కలు స్థాయి దాటలేదు. క్యూబాలో ఏడాది పాటు వామపక్ష సిద్ధాంతాల్లో శిక్షణ పొంది వచ్చారు. కార్మిక సంఘం నేత అయిన తండ్రి నుంచి నాయకత్వ వాసనలను మదురో బాగా వంటబట్టించుకున్నారు. 1992లో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అధికార కైవసానికి విఫలయత్నం చేసిన రోజుల్లో ఆయన బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. జైలుపాలైన చావెజ్ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు.
మదురో జీవితంలో అదే కీలక మలుపు. చూస్తుండగానే చావెజ్ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారారు. ఆ క్రమంలో తండ్రిలా తానూ కార్మిక సంఘ నేత అయ్యారు. అనంతరం చావెజ్ సారథ్యంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలాలో చేరి చకచకా కీలక స్థానానికి ఎదిగారు. 1998లో చావెజ్‌తో పాటు తానూ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత అసెంబ్లీ అధ్యక్షుడయ్యారు. చావెజ్ అధ్యక్షుడయ్యాక ఆయన కేబినెట్లో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రపంచమంతా కలియదిరిగి అంతర్జాతీయంగా వెనెజువెలాకు మద్దతు పెంచడంలో మదురో కీలకపాత్ర పోషించారు. అమెరికా కర్రపెత్తనాన్ని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు లాటిన్ అమెరికా–కరీబియన్ కూటమి ఏర్పాటు చేశారు.
ఈ దశలోనే చావెజ్‌కు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఫలితంగా 2012లో వెనెజువెలా ఉపాధ్యక్షుడయ్యారు. మదురోను తన రాజకీయ వారసునిగా చావెజ్ ప్రకటించారు. 2013లో అనారోగ్యంతో చావెజ్ మరణించడంతో మదురో తొలుత తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని పదిలపరుచుకున్నారు. నాటినుంచి పాలకునిగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఆ క్రమంలో ప్రతి ఎన్నికల్లోనూ విపరీతమైన అక్రమాలకు పాల్పడ్డారన్న అపకీర్తి మూటగట్టుకున్నారు. 2013 నాటి తొలి ఎన్నికల నుంచే ఆయనపై ఈ ఆరోపణలున్నాయి.
చివరకు ఇలా నేలకు!
చావెజ్ మరణానంతరం అధ్యక్షుడు కాగలిగినా పరిస్థితులన్నీ క్రమంగా మదురోకు ప్రతికూలించసాగాయి. అసలు ఆయన అధ్యక్ష జీవితమంతా వివాదాలు, సమస్యలమయంగానే సాగింది. ముఖ్యంగా వెనెజువెలా ఆర్థిక పతనం ఆయనకు పెద్ద సవాలుగా మారింది. అమెరికా ఆంక్షలకు తోడు అంతర్జాతీయ చమురు ధరలు పతనం కావడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఆర్థిక సంస్కరణలు, భారీగా నోట్ల ప్రింటింగ్ వంటివి మరిన్ని సమస్యలకే దారితీశాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. తిండి గింజలు కూడా లేక జనం అలమటించారు. దాంతో లక్షలాదిగా పొట్ట చేతపట్టుకుని పొరుగు లాటిన్ అమెరికా దేశాలకు వలసపోయారు.
ఈ క్రమంలో 2014, 2017ల్లో వెనెజువెలా చరిత్రలోనే అతి పెద్ద ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. వాటన్నింటినీ ఉక్కుపాదంతో అణచేసి మదురో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. నిరసనలన్న మాటే విని్పంచకుండా లక్షలాది మందిని జైళ్లలో కుక్కేశారు. రాజకీయ ప్రత్యర్థులను తీవ్రాతి తీవ్రంగా హింసించారు. మానవ హక్కుల హననానికి దేశాన్ని మారుపేరుగా మార్చేశారు. ఇవన్నీ చాలవన్నట్టు 2020లో అమెరికా మదురోను అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి్చంది. ఇన్ని ప్రతికూలతల మధ్యే 2024 ఎన్నికల్లో కిందామీదా పడి వరుసగా మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారాయన.
కానీ ఆ క్రమంలో కనీవినీ ఎరగని అక్రమాలకు పాల్పడి అభాసుపాలయ్యారు. ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు చాలాచోట్ల ఏకంగా 85 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైనట్టు తేలినా మదురో మాత్రం తానే గెలిచానని ప్రకటించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడే ప్రయత్నం చేశారు. దాంతో గొంజాలెజ్‌తో పాటు జనాదరణ ఉన్న విపక్ష నేత మరియా కొరీనా మచాడో వంటివారు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. 2018లో సైనిక పరేడ్‌లో ప్రసంగిస్తుండగా డ్రోన్ల సాయంతో జరిగిన హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డారు. చివరికి ఓ పెద్ద దేశాధ్యక్షుడెవరూ ఇప్పటిదాకా ఎదుర్కోని దయనీయ పరిస్థితుల్లో అమెరికా సైన్యానికి భార్యాసమేతంగా పట్టుబడి నిస్సహాయునిగా దేశం వీడారు.
భర్తకు చేదోడువాదోడుగా...
రాజకీయాల్లో ఫ్లోరెస్ ఉత్థాన పతనాలు
కరాకస్: సిలియా ఫ్లోరెస్. అప్రతిష్టాకర రీతిలో అమెరికాకు పట్టుబడ్డ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో భార్య. రాజకీయాల్లో భర్త అడుగుజాడల్లోనే నడిచారామె. మదురో మాదిరిగానే ఆమెదీ అతి సాధారణ నేపథ్యమే. వాయవ్య వెనెజువెలాలో టినాక్విలో అనే చిన్న పట్టణంలో 1956లో ఒక పేద కుటుంబంలో పుట్టారు ఫ్లోరెస్. జరుగుబాటు కోసం ఆమె కుటుంబం కరాకస్‌కు మారింది. అక్కడే ఆమె న్యాయ పట్టా పుచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్లో పార్ట్‌టైం జాబ్ చేసే క్రమంలో ఓ డిటెక్టివ్‌ను పెళ్లాడి ముగ్గురు పిల్లల్ని కన్నారు. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ వ్యక్తిగత లాయర్‌గా మారడం ఆమె జీవితంలో కీలక మలుపు.
అక్కడినుంచీ రాజకీయంగా క్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కారు. 2000లో తొలిసారి నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైన ఫ్లోరెస్, 2007కల్లా దాని ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఆ క్రమంలో మదురోతో జరిగిన పరిచయం కాస్తా ప్రణయంగా మారింది. రెండు దశాబ్దాల సన్నిహిత జీవితం అనంతరం 2013లో ఇద్దరూ తమ జీవిత భాగస్వాములకు విడాకులిచ్చి ఒకటయ్యారు. మదురో అధ్యక్షుడయ్యాక ఆయన నిర్ణయాలన్నింట్లోనూ ఫ్లోరెస్ కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ చీఫ్‌గా బలమైన అధికార కేంద్రంగా వ్యవహరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


