సాక్షి, అనంతపురం: అనంతపురం శారదానగర్‌లో దారుణం జరిగింది. కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి అమూల్య, కొడుకు సహర్ష(5) ఇద్దరూ మృతి చెందారు. రామగిరి డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్న రవి కుమార్ ఇంట్లో ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పొలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ఘటనలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వలేదంటూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. కళ్యాణదుర్గంలోని కమ్మరచెట్ల వీధికి చెందిన వివాహిత శైలు.. స్థానిక వాల్మీకి సర్కిల్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుంది. బంగారాన్ని విడిపించుకునేందుకు గురువారం ఫైనాన్స్ కంపెనీకి వెళ్లిన సమయంలో ఖాతా హోల్డ్‌లో ఉండడంతో సొత్తు ఇవ్వడం కుదరదని సిబ్బంది తెలిపారు.
దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి చేరుకుని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


