ఎంత ఎదిగిపోయావమ్మా! | Vivek Oberoi Gets Emotional As Adopted Daughter Sahara | Sakshi
Sakshi News home page

ఎంత ఎదిగిపోయావమ్మా!

Sep 27 2026 4:52 AM | Updated on Sep 27 2026 4:52 AM

Vivek Oberoi Gets Emotional As Adopted Daughter Sahara

ఫాదర్‌ అండ్‌ డాటర్‌

బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్‌కు ఇద్దరు పిల్లలు. కుమారుడు వివాన్‌ వీర్‌. కుమార్తె అమేయ. అయితే ఆయన దత్తపుత్రిక పేరు ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఆమె పేరు సహారా షా. క్యాన్సర్‌ కోరల నుంచి బయటపడిన ఇరవైరెండేళ్ల షా తన మొదటి సినిమాకు సంతకం చేసింది.

గత కొన్నేళ్లుగా, వివేక్‌ ఒబెరాయ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలను దత్తత తీసుకొని చదువుతో పాటు చికిత్స ఖర్చులను భరిస్తున్నారు. రెండేళ్ల వయసు ఉన్నప్పుడు సహారాను దత్తత తీసుకున్నారు వివేక్‌.

ఒక నేపాలి చిత్రంలో నటించే అవకాశం తన దత్తపుత్రికకు రావడం వివేక్‌ను సంతోషంలో ముంచెత్తింది. మరో విశేషం ఏమిటంటే... ఏవియేషన్‌లో సహారా ట్రైనింగ్‌ కూడా తీసుకుంది. కమర్షియల్‌ పైలట్‌ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది.

‘నాకు మీ ఆశీర్వాదం కావాలి. నా జీవితంలో మీరు ముఖ్యమైన భాగం. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగాను. మీ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రయాణంలో నేను సగం దూరం కూడా వెళ్లలేదు’ అని తండ్రిని ఉద్దేశించి అంటుంది సహారా షా.

వివేక్‌ను ‘దాదా’ అని పిలుస్తుంది సహారా. తనకు ఎప్పుడూ అండగా నిలిచే దాదాకు ఇలా కృతజ్ఞతలు తెలియజేసింది... ‘యాక్టింగ్, డ్యాన్స్‌ ఏది చేసినా నన్ను మీరు బాగా ప్రోత్సహించారు. మీ ప్రోత్సాహం నాకు గొప్ప కలలు కనే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒకప్పుడు అసాధ్యమనిపించినవి మీ వల్లే సాధ్యమయ్యాయి. మీపై నాకు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో మాటల్లో చెప్పలేను’ సహారాను ఆ΄్యాయంగా హగ్‌ చేసుకున్నప్పుడు వివేక్‌ భావోద్వేగానికి గురయ్యారు.

 ‘నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. గర్వంతో నా కళ్లు చెమర్చుతున్నాయి. రెండున్నరేళ్ల చిన్నారిగా, క్యాన్సర్‌తో పోరాడుతూ కీమోథెరపీ చేయించుకుంటున్నప్పుడు... ఎర్రబడిన కళ్లు, పాలిపోయిన ముఖంతో సహారా కనిపించిన దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. సహారాలోని పోరాట పటిమను నేను చూశాను. తను నా వేలిని పట్టుకున్న తీరును చూసి కచ్చితంగా విజేత అవుతుంది అనిపించింది. తన కోసం నేను ప్రతిరోజూ ప్రార్థించేవాడిని. ఆమె క్యాన్సర్‌ను జయించింది. ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కింది. సహారను చూసి గర్విస్తున్నాను’ అన్నారు వివేక్‌ ఒబేరాయ్‌.              

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement