ఎంపీ సంజయ్ రౌత్, జర్నలిస్ట్ వాగ్లేకు సుప్రీం ధిక్కార నోటీసులు
న్యూఢిల్లీ: దేశ న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై శివసేన(యూబీటీ)రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లేకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) వేసిన ధిక్కార పిటిషన్ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారించింది.
రౌత్, వాగ్లేల వ్యాఖ్యలు నిష్పాక్షిక విమర్శల హద్దులను దాటిపోయాయని, ఇవి సుప్రీంకోర్టుపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎస్సీబీఏ అధ్యక్షుడు, సీనియర్ అడ్వొకేట్ ప్రదీప్ రాయ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ప్రకటనలపై ఈ సందర్భంగా సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను కాపాడుతూ వచ్చిన న్యాయవ్యవస్థపై దాడులు అత్యంత దురదృష్టకరమన్నారు.


