సోషల్‌ మీడియా న్యాయవ్యవస్థకే సవాళ్లు విసురుతోంది | Social Media Challenges to Judiciary Says Supreme Court Justice Prashant Kumar Mishra: AP | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా న్యాయవ్యవస్థకే సవాళ్లు విసురుతోంది

Nov 30 2026 4:19 AM | Updated on Nov 30 2026 4:19 AM

Social Media Challenges to Judiciary Says Supreme Court Justice Prashant Kumar Mishra: AP

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తులు జస్టిస్‌ దేవానంద్, నారాయణ భట్టి

తీర్పుల్లో ఏముందో కూడా చదవడం లేదు

విశ్లేషణలు.. చర్చలు.. ట్రోలింగ్‌లు చేసేస్తున్నారు 

న్యాయమూర్తులు ట్రోలింగ్‌కు భయపడకూడదు 

రాజ్యాంగం, అంతరాత్మ ప్రబోధం ప్రకారం తీర్పులు ఇవ్వాలి 

అధికారాన్ని తలకెక్కించుకోకూడదు 

న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం పుస్తకాల్లో ఉండదు 

న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల్లోనే ఉంటుంది  

రాజ్యాంగం మనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి 

బడుగు, బలహీనవర్గాల హక్కులకు మనం కాపలాదారులం 

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు,  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉద్ఘాటన 

మూడవ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సులో ప్రసంగం 

న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు సహా 250 మందికి పైగా న్యాయాధికారులు హాజరు

సాక్షి, అమరావతి: తీర్పులను పూర్తిగా చదవకుండానే సోషల్‌ మీడియా వేదికగా న్యాయవ్యవస్థపై విశ్లేషణలు, చర్చలు, ట్రోలింగ్‌లు చేయడం ఆందోళనకరమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సోషల్‌ మీడియా సవాళ్లకు భయపడకుండా రాజ్యాంగం, అంతరాత్మ ప్రబోధం మేరకు తీర్పులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల హక్కులకు కాపలాదారులుగా రాజ్యాంగం ఉంచిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అధికారాన్ని తలకెక్కించుకోకుండా, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా వ్యవహరించాలని పేర్కొన్నారు. 

ఆదివారం విజయవాడలోని బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో మూడవ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు జరిగింది. సదస్సుకు  గౌరవ అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌­మిశ్రా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సరస వెంకట నారాయణ భట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా న్యాయాధికారులు  హాజరైన ఈ సదస్సుకు  రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌ అధ్యక్షత వహించారు. 

2009–2026 వరకు ఉన్న హైకోర్టు సర్క్యులర్లు, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ రూపొందించిన డిజిటల్‌ రెఫరెన్స్‌ కలెక్షన్‌ను న్యాయమూర్తులు ప్రారంభించారు. జస్టిస్‌ మిశ్రా, జస్టిస్‌ భట్టీలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ దేవానంద్, జస్టిస్‌ దొనడి రమేష్, జస్టిస్‌ నైనాల జయసూర్య సన్మానించి, బొబ్బిలి వీణలను జ్ఞాపికలుగా బహూకరించారు. చివరగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ 
వందన సమర్పణ చేశారు. అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వచి్చనందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వ్యవస్థలే వ్యక్తుల కంటే గొప్పవని గుర్తుంచుకోవాలి
న్యాయమూర్తులు కేసులను విచారిస్తుంటే.. సోషల్‌ మీడియా జడ్జీలనే ట్రయల్‌ చేస్తోంది. తీర్పులను పూర్తిగా చదవకుండానే ఏకపక్ష విశ్లేషణలు, చర్చలు, ట్రోలింగ్‌తో న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నారు. వీటికి భయపడకుండా రాజ్యాంగంపై చేసిన ప్రమాణం, అంతరాత్మకు అనుగుణంగా న్యాయమూర్తులు తీర్పులివ్వాలి.   గతంలో నేను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా ఉన్నప్పుడు సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను మా రిజిస్ట్రార్లు నా దృష్టికి తీసుకొచ్చేవారు. ఆ తరువాత కొంత కాలానికి ఆ ట్రోల్స్‌ను నా దృష్టికి తేవొద్దని వారికి చాలా స్పష్టంగా చెప్పాను.  

తీర్పుల జాప్యం ఊహాగానాలకు తావిస్తోంది. జిల్లా, తాలూకా కోర్టుల్లో 2025 నాటికి 4.76 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా, హైకోర్టుల్లో 63 లక్షల కేసులు, సుప్రీంకోర్టులో 57వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.   విధి నిర్వహణలో చిన్న తప్పిదం కూడా మొత్తం న్యాయవ్యవస్థకు చెడ్డపేరు తెస్తుంది. వ్యక్తుల కంటే వ్యవస్థలే గొప్పవని గుర్తుంచుకోవాలి. మహిళా సాధికారతకు, ప్రజాస్వామ్యం బలోపేతానికి పునరి్వభజన బిల్లు దోహదపడుతుంది     – సుప్రీంకోర్టు న్యాయమూర్తి 
జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా

న్యాయాధికారుల క్రమశిక్షణతోనే న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం 
న్యాయాధికారుల క్రమశిక్షణే ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. సమయపాలన అంటే కోర్టుకు నిరీ్ణత సమయానికి రావడమే కాదు.. సకాలంలో తీర్పులు ఇవ్వడం కూడా. న్యాయమూర్తులు, న్యాయాధికారులు అధికారాన్ని తలకెక్కించుకోకూడదు. అలా చేస్తే పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. ఈ మాటను ఎంతో బాధ్యతతో చెబుతున్నా. న్యాయవాదులు వాయిదా కోరగానే ఇచ్చేయకూడదు. కేసుల విచారణకు ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. మన ప్రస్థానం ఎక్కడ మొదలైందో మర్చిపోకూడదు. న్యాయవ్యవస్థలోకి ఎందుకొచ్చాం.. ఏం చేస్తున్నాం.. అనే ప్రశ్నలు నిరంతరం మనల్ని మనం వేసుకోవాలి. అప్పుడే మన చర్యలు న్యాయం దిశగా సాగుతాయి. న్యాయాధికారులు ఎప్పుడూ కూడా తాము అజేయులమనే భ్రమలో ఉండకూడదు.  
– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సరస వెంకట నారాయణ భట్టి  

న్యాయం చెప్పడం సులభమే.. న్యాయం చేయడమే కష్టం.. 
సోషల్‌ మీడియా ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. కోర్టు తీర్పు వెలువడక ముందే.. దానిపై సోషల్‌ మీడియాలో చర్చలు, ట్రోలింగ్‌లు మొదలైపోతున్నాయి. తీర్పులిచ్చే సమయంలో రేపు మీడియాలో ఏం వస్తుందోనన్న భయం న్యాయాధికారులకు ఉండకూడదు.  మీ అంతరాత్మ చెప్పినట్లు పనిచేయండి. న్యాయం చెప్పడం సులభమే.. న్యాయం చేయడమే కష్టం. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం పుస్తకాల్లో ఉండదు.. మనం ఇచ్చే తీర్పుల్లోనే ఉంటుంది.

గతంలో న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు కొంతమేర సదుపాయాలు మెరుగుపడినా కేసులు వాయిదా పడుతూనే ఉన్నాయి. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కోర్టుల్లో ఏం జరిగిందో తెలుగులో తెలుసుకునే వెసులుబాటు నిరక్షరాస్యులకు, మారుమూల ప్రాంతాల కక్షిదారులకు కల్పించాలి. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అన్న గురజాడ అప్పారావు మాటలను గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణ న్యాయాధికారులకు ప్రాణం లాంటిది.  – హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌  

రాజ్యాంగం మనపై ఎంతో బాధ్యతను ఉంచింది
రాజ్యాంగం న్యాయవ్యవస్థపై ఎంతో బాధ్యతను ఉంచింది. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజల హక్కులను పరిరక్షించడంలో న్యాయాధికారులదే కీలక పాత్ర. న్యాయమూర్తులు, న్యాయాధికారులు నైతికతకు, ప్రజల విశ్వాసానికి, హక్కుల పరిరక్షణకు కాపలాదారులు. బలహీన వర్గాలు, అణగారిన వర్గాల విషయంలో న్యాయవ్యవస్థపై ఎంతో బాధ్యత ఉంది.  ఐదేళ్ల తరువాత సీజే జస్టిస్‌ లీసా గిల్‌ చొరవతో ఈ సదస్సు జరుగుతోంది.  ఏపీ హైకోర్టు సీజేగా ఉన్నప్పుడు జస్టిస్‌ మిశ్రా రాష్ట్ర న్యాయవ్యవస్థను ఎంతో బలోపేతం చేశారు.  తెలుగు బిడ్డ జస్టిస్‌ నారాయణ భట్టి దేశ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిగా ఉండటం తెలుగు వారి అదృష్టం.  
– స్వాగతోపన్యాసంలో న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌  

మహాభారత ఘట్టాన్ని  ప్రస్తావించిన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా
న్యాయాధికారులు తమ విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణలో నడుచుకోవాలని, అప్పుడే మిగిలినవన్నీ కూడా సక్రమంగా సాగిపోతాయని తన ప్రసంగంలో పేర్కొన్న జస్టిస్‌ మిశ్రా ఈ సందర్భంగా మహాభారతాన్ని ప్రస్తావించారు.  ‘మహాభారతం జూదంలో ధర్మరాజు ద్రౌపదిని పందెం కాశారు. అప్పుడు ద్రౌపది, ఇలా చేయడం న్యాయమేనా? అని అక్కడి సభలో వారందరినీ అడిగింది. అయితే సభలో ఉన్న పెద్దలెవ్వరూ కూడా సమాధానం చెప్పకుండా తలలు దించుకున్నారు. దుర్యోధనుడి తమ్ముడైన వికర్ణుడు ఒక్కడే ద్రౌపదిని పందెం కాయడం తప్పని చెప్పారు. అయితే నువ్వు చిన్న వాడివంటూ అతన్ని కర్ణుడు వారించి కూర్చోబెట్టేశాడు. ప్రశ్నను దాటవేయడం సమాధానం కాదు. ద్రౌపది లేవనెత్తిన ఇలాంటి ప్రశ్నలకు మనం (న్యాయవ్యవస్థ) వికర్ణుడిలా సమాధానం ఇవ్వాలి.’ అని మిశ్రా  పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement