వీటిని ఎన్నికలంటారా?.. ఖాకీ దన్నుతో స్వైరవిహారం! | TDP Rowdies Attack On YSRCP Leaders: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వీటిని ఎన్నికలంటారా?.. ఖాకీ దన్నుతో స్వైరవిహారం!

Nov 30 2026 3:47 AM | Updated on Nov 30 2026 3:47 AM

TDP Rowdies Attack On YSRCP Leaders: Andhra pradesh

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం జర్రావారిపల్లెలో మహిళలపై లాఠీఛార్జ్‌ చేస్తున్న పోలీసులు

రెండో విడత ‘పల్లెపోరు’లో చెలరేగిన పచ్చమూకలు 

మొదటి విడతలో వైఎస్సార్‌సీపీ విజయాలతో వణికిన టీడీపీ..

అందుకే రెండో విడతలో మరింత బరితెగింపు

వేంపల్లె, చంద్రగిరి, దర్శి, అద్దంకి, గిద్దలూరు సహా పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు 

కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో ఓటర్లపై దాడులు 

పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ.. బలవంతంగా వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల గెంటివేత 

బయటి ప్రాంతాల నుంచి కిరాయి రౌడీల తరలింపు.. దొంగ ఓట్లు, యథేచ్ఛగా రిగ్గింగ్‌

ప్రతిపక్ష నేతలకు ముందస్తు నిర్బంధాలు.. అధికార పార్టీ మూకలకు పోలీసుల రక్షణ 

ఓటర్లను అడ్డుకున్న పోలీసులు.. ప్రశ్నించిన మహిళలపై లాఠీఛార్జ్‌లు 

బ్యాలెట్‌ పత్రాల తరలింపు.. బాక్సుల్లో నీళ్లు, సిరా పోసి ఎన్నికల ప్రక్రియకు విఘాతం 

రిగ్గింగ్‌ను చిత్రీకరించిన సాక్షి, ఇతర మీడియా ప్రతినిధులపై దాడులు..  

సెల్‌ఫోన్లు లాక్కొని వార్తా సేకరణకు అడ్డంకులు

సాక్షి, అమరావతి: ఇవి ఎన్నికలా? ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణమా? ఓటు వేయడానికి వచ్చిన ప్రజలపై దాడులు.. పోలింగ్‌ ఏజెంట్లపై దౌర్జన్యాలు.. ప్రత్యర్థి నాయకుల ముందస్తు నిర్బంధాలు.. బూత్‌ల ఆక్రమణలు.. దొంగ ఓట్లు, రిగ్గింగ్‌.. చివరకు అక్రమాలను చిత్రీకరించిన జర్నలిస్టులపైనా దాడులు! రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సాగిన అరాచక పర్వమిది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చమూకలకు అండగా నిలవడం.. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగమే ప్రతిపక్షాన్ని అణచివేయడం ఎన్నికల వ్యవస్థకే గొడ్డలిపెట్టుగా మారింది.

మొదటి విడతలో వందల కుట్రలు, కుతంత్రాలను ఛేదించి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయాలు సాధించడంతో ఓటమి భయంతో వణికిపోయిన టీడీపీ రెండో విడతలో మరింతగా బరితెగించింది. వేంపల్లె నుంచి చంద్రగిరి వరకు.. దర్శి నుంచి గిద్దలూరు వరకు.. పచ్చమూకల దాడులు, పోలీసుల లాఠీఛార్జిలు, ఏజెంట్ల నిర్బంధాలతో పల్లెపోరును హింసాత్మకంగా మార్చింది. బ్యాలెట్‌ పత్రాల అక్రమాలు, బాక్సుల తరలింపు, బ్యాలెట్‌ బాక్సుల్లో నీళ్లు, సిరా పోయడం వంటి ఘటనలతో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసింది. 

అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రతిపక్ష నేతలు, ఏజెంట్లను నిర్బంధిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. రిగ్గింగ్‌ను చిత్రీకరించిన మీడియా ప్రతినిధులపై దాడులు చేసి, సెల్‌ఫోన్లు లాక్కుని వార్తా సేకరణను సైతం అడ్డుకున్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన వ్యవస్థలే అధికార పార్టీకి కవచాలుగా మారితే ప్రజాస్వామ్యానికి దిక్కెవరు? రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, ప్రజాతీర్పును పక్కదారి పట్టించేలా సాగిన ఈ ఎన్నికల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇవేం ఎన్నికలు..? అధికార పార్టీకి ఊడిగం చేస్తున్న వీళ్లేం పోలీసులు..? అరాచకాలను అడ్డుకోని వీళ్లేం కలెక్టర్లు..? విధులు సరిగా నిర్వర్తించని వీళ్లా అధికారులు.. అని జనం చర్చించుకుంటున్నారు..

వేంపల్లెలో టీడీపీ గూండాల బరితెగింపు 
వైఎస్సార్‌ జిల్లా వేంపల్లెలో రెండో విడత పంచాయతీ ఎన్నికలను టీడీపీ గూండాలు ప్రజాస్వామ్యానికి సమాధి కట్టే అరాచకంగా మార్చేశారు. ఓటమి భయంతో బీటెక్‌ రవి కనుసన్నల్లో, ఆయన బంధువు శివారెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జి రఘునాథరెడ్డి నేతృత్వంలో పచ్చ మూకలు పోలింగ్‌ బూత్‌లపై పడి రిగ్గింగ్‌కు తెగబడ్డాయి. 32 పోలింగ్‌ కేంద్రాలను ఏకపక్షంగా స్వాధీనం చేసుకుని, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు గెంటేసి, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను సైతం అడ్డుకుని ప్రజల ఓటు హక్కును కాలరాశాయి. కర్రలు, రాళ్లు, రాడ్లతో స్వైరవిహారం చేస్తూ బుసిరెడ్డిపల్లె, పాయసంపల్లె, అలిదెన, మాచునూరు, నాగులగట్టుపల్లె, గడ్డంవారిపల్లె సహా పలు పంచాయతీల్లో భౌతిక దాడులకు తెగబడి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను రక్తం వచ్చేలా కొట్టి భయభ్రాంతులకు గురిచేశాయి. 

బయటి ప్రాంతాల నుంచి కిరాయి రౌడీలను తరలించి పోలింగ్‌ కేంద్రాల వద్ద అరాచకం సృష్టించాయి. మరోవైపు పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయడంతో పాటు, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని ఇంటి గేటుకు పోలీసు జీపు అడ్డుపెట్టి మరీ అడ్డుకున్నారు. టీడీపీ గూండాలకు పోలీసులే ఎస్కార్ట్‌గా నిలిచి, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకుంటూ రిగ్గింగ్‌కు రాచబాట వేశారు.\

 సాక్షి టీవీ విలేకరిపై దౌర్జన్యం చేసి మొబైల్‌ లాక్కుని వీడియోలు తొలగించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 19,203 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన వేంపల్లెలో మళ్లీ అదే ప్రజాతీర్పు వస్తుందనే భయంతోనే సీఎంఓ ఆదేశాల మేరకు బీటెక్‌ రవి టీడీపీ మూకలను రంగంలోకి దించారు. ఇన్ని దౌర్జన్యాలు చేసినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయాలు సాధించడం టీడీపీ అరాచక రాజకీయాలకు ప్రజలు ఇచ్చిన చెంపపెట్టులాంటిది..

చంద్రగిరిలో టీడీపీ విధ్వంసకాండ.. రిగ్గింగ్‌  
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలను టీడీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌తో రక్తసిక్తం చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుమారుడు వినీల్, తిరుపతి మేయర్‌ జేబీ శ్రీనివాసులు, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు నేతృత్వంలో కిరాయి రౌడీలు గాంధీపురం, రణధీరపురం, ముండ్లపూడి, ఓటేరు, కమలయ్య­గారి­పల్లి, సి.రామాపురం గ్రామాల్లో కర్రలు, ఇనుప రాడ్లతో బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, సర్పంచ్‌ అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడులు చేసి మహిళలు, యువకులు, వృద్ధులు సహా పలు­వురిని తీవ్రంగా గాయపరిచారు. గాంధీపురంలో మాజీ సర్పంచ్‌ శెల్వం, సర్పంచ్‌ అభ్యర్థి శాంతమ్మ భర్త ఆటో­బాబుపై పులివర్తి నాని, ఆయన కుమారుడు వినీల్‌ పోలింగ్‌ కేంద్రం వద్దే దాడి చేసి తలలు పగలగొట్టారు.

 రణధీరపురంలో మేయర్‌ జేబీ శ్రీనివాసులు తన అనుచరులతో పోలింగ్‌ కేంద్రాన్ని ఆక్రమించి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్ష్మీనారాయ­ణను బయటకు తరిమేసి, గేట్లు మూసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ముండ్లపూడిలో ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిలుచున్న గ్రామస్తులపై కిరాయి మూకలు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో పలువురు ఆసుపత్రులపాలయ్యారు. ప్రాణభ­యంతో పొలాల్లోకి పరుగులు తీసిన వారిని సైతం వెంబడించి మరీ కొట్టారు. కమలయ్యగారిపల్లిలో దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబ­డ్డారు. 

దాడులు చేస్తున్న టీడీపీ నేతలు, గూండాలను అడ్డుకో­వాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూ, వైఎస్సార్‌సీపీ నేతలు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిని పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. రణధీరపురంలో రీపోలింగ్‌ జరపాలని మోహిత్‌రెడ్డి, అభ్యర్థులు నిరసనకు దిగితే వారినే అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. చంద్రగి­రిలో ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన అనుచరుల దౌర్జన్యా­లను చిత్రీకరించిన సాక్షి విలేకరి నరేష్‌కుమార్‌రెడ్డిపై దాడి చేసి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. పెళ్లకూరులో కౌంటింగ్‌ జరగాల్సిన కేంద్రం నుంచి బ్యాలెట్‌ బాక్సులను పెళ్లకూరు మిట్టకు తర­లించగా, గ్రామస్తుల నిరసనపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.  

ప్రకాశం జిల్లాలో టీడీపీ గూండాల స్వైరవిహారం
ఉమ్మడి ప్రకాశం జిల్లా  దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పక్క జిల్లాల నుంచి కిరాయి రౌడీలను వాహనాల్లో తరలించి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, ఓటర్లపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. దర్శి మండలం తుమ్మెదలపాడు, లంకోజనపల్లి, ఎర్రోబనపల్లి, శామంతపూడి, చింతల, కురిచేడు మండలం దేకనకొండ, కల్లూరు, దొనకొండ తదితర గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగి పోలీస్‌స్టేషన్లకు తరలించి, టీడీపీ మూకలకు పోలింగ్‌ కేంద్రాలను పోలీసులే అప్పగించారు. దేకనకొండ, కల్లూరుల్లో ఏజెంట్లను ముందురోజు రాత్రి నుంచే స్టేషన్‌లో నిర్బంధించారు. ఎర్రోబనపల్లిలో ఎస్సై ఏడుకొండలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను తరిమేసి టీడీపీ గూండాలను బూత్‌లలోకి పంపించారు. 

తమ్మిదలపాడులో ఎస్సై అజయ్‌కుమార్‌ ఓటర్లను అడ్డుకోవడంతో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. కమ్మవారిపాలెంలో గొట్టిపాటి లక్ష్మి మరిది కడియాల శివ పది వాహనాల్లో నరసరావుపేట, అద్దంకి ప్రాంతాల నుంచి రౌడీలను తరలించి రిగ్గింగ్‌కు య­త్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పెద్ద రావిపా­డులో టీడీపీ మూకలు బ్యాలెట్‌ బాక్సుల్లో నీళ్లు పోయగా, ఉల్లగల్లులో బ్యాలెట్‌ పత్రాలతో అక్రమాలకు పాల్పడుతున్న వారిని మహిళలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నాగంబొట్లపాలెంలో బ్యాలెట్‌ బాక్సుల్లో సిరా పోయడంతోపాటు ఘర్షణలు, పోలీసుల లాఠీఛార్జి చోటుచేసుకున్నాయి. అద్దంకి నియోజకవర్గంముక్తేశ్వరంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను ఎస్సై నాగరాజు బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో, తమ ఏజెంట్లను విడిచిపెట్టాలని మహిళలు పోలీసుల కాళ్లు పట్టు కున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో డూప్లికేట్‌ బ్యాలెట్ల వినియోగం కలకలం రేపింది.  

గుంటూరు, బాపట్ల, పల్నాడులోనూ ఉద్రిక్తతలు 
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె, కసుకర్రులో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపగా, మామిళ్లపల్లిలో ఓటర్లపై రూరల్‌ ఎస్సై శ్రీహరి లాఠీ ఝుళిపించడంతో వైఎస్సార్‌సీపీ నాయకురాలు రమాదేవి గాయపడ్డారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బొచ్చులవారిపాలెంలో టీడీపీ, కాంగ్రెస్‌ వర్గాల ఘర్షణలో ఏడుగురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇళ్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.  మరోవైపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌­రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

చిన్నపాలపర్రులో టీడీపీ దొంగ ఓట్ల యత్నం 
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చిన్నపాలపర్రులో ఓటమి భయంతో టీడీపీ నేతలు దొంగ ఓట్లకు తెగబడ్డారు. అప్రమత్తమైన గ్రామస్తులు వారిని వెంబడించడంతో ఇద్దరు పరారవగా, మరో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గుడివాడ రూరల్‌ మండలం మోటూరు, చౌటుపల్లి లకు చెందిన యువతులుగా వారిని గుర్తించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్లలోనూ వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు నిర్బంధించారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం పోడదుర్తిలో ఏజెంట్లను కూర్చో­నివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు నిరసనకు దిగారు.  

ప్రశ్నించిన మహిళలపైనే పోలీసుల లాఠీచార్జి
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాయల్పాడు మండలం జర్రావారిపల్లిలో టీడీపీ రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే పోలీసులు లాఠీచార్జి చేశారు.  ప్రకాశం జిల్లా ఉల్లగళ్లులో బ్యా­లెట్‌ పత్రాల తరలింపును మహిళలు అడ్డుకోవడంతో వారిని పోలీసులు బెదిరించి గొడవ చేయొద్దని ఒత్తిడి తెచ్చారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం ఉల్లి­కల్లులో దొంగ ఓట్లను ప్రశ్నించిన వారిపై కర్రలతో దాడి చేశారు. పసుపుగళ్లులో దళితులను ఓటు వేయకుండా అడ్డుకున్నారు. 

మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేల నిర్బంధం
అనంతపురం జిల్లా శింగనమలలో మాజీ మంత్రి శైలజా­నాథ్‌ను తెల్లవారుజామున ఐదు గంటలకే సుమారు 20 మంది పోలీసులు ఇంటి వద్ద నిర్బంధించారు. వైఎస్సార్‌ జిల్లాలో సతీష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు. కడపలో పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఇన్‌చార్జి నరేన్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. కృష్ణా జిల్లా పామర్రులో దొంగ ఓట్లను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దాదాపు నాలుగు గంటలకుపైగా పలు  పోలీస్‌స్టేషన్లకు తిప్పారు. 

దాడులు.. హత్యాయత్నాలు..
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం కొంగనపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్‌ అభ్యర్థి శ్రీరంగనాయకులు కుటుంబ సభ్యులపై అర్ధరాత్రి దాడి జరిగింది. అభ్యర్థి సోదరుడు రాజుతోపాటు కుటుంబ సభ్యులపై హత్యాయత్నం జరిగింది. ఇదే నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు దాడికి పాల్పడటంతో నలుగురు గాయపడ్డారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం పెట్నికోటలోనూ వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడి జరిగిందని, ఘటనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టుల ఫోన్లు లాక్కున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు స్వగ్రామం బంటుమిల్లి సర్పంచ్‌ పోలింగ్‌లో వైఎస్సార్‌సీపీ బూత్‌ ఏజెంట్‌లను బయటకు తోసేసారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలం పెట్ని కోటలో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెంలో ఎన్నికల కవరేజీకి వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్‌ సతీష్, హెచ్‌ఎంటీవీ రిపోర్టర్‌ శ్రీధర్‌తోపాటు ఇతర జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులు వారి మొబైల్‌ ఫోన్లు లాక్కుని, దుస్తులు చించి కొట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో సాక్షి ప్రతినిధి నరేష్‌పైనా దాడి చేశారు.  

నెల్లూరులో ఆర్వోల అరాచకం 
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆర్వోల అరాచకం కలకలం సృష్టించింది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు స్పష్టమైన మెజారీ్టతో గెలిచినా రీకౌంటింగ్‌ల పేరుతో ఫలితాలు తారుమారు, డిక్లరేషన్ల నిలిపివేత, టీడీపీ అభ్యర్థులకు విజయ ప్రకటనలు జరిగాయి. యనమదల, కలవకొండ, సంతదాసుపల్లి గ్రామాల్లో మెజారీ్టలు మారిపోయాయి. బోయలచిరువెల్ల, కృష్ణంపల్లి, దుత్తలూరులో గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్లు ఇవ్వకుండా జాప్యం చేశారు. ముత్యాలపాడు, బొటికర్లపాడులో రీకౌంటింగ్‌ వివాదాలు రేగాయి.  తిప్పవరపాడులో 10 వార్డులకు 8 గెలిచినా కౌంటింగ్‌ నిలిపివేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement