కృష్ణా జిల్లా: మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కూటమి కక్ష సాధింపు చర‍్యలు కొనసాగుతున్నాయి. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పకుండా ఆయనను తిప్పుతున్నారు. కైలే అనిల్ కుమార్ కు మద్దతు తెలిపేందుకు మోపిదేవి పోలీస్ స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు వెళ్లారు.
వైసీపీ నేతలు రావడంతో వెంటనే కైలే అనిల్ కుమార్‌ను మళ్లీ వేరేచోటకు పోలీసులు తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై కైలే అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. దొంగ ఓట్లను ప్రశ్నించినందుకు అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. అనంతరం రెండు గంటలుగా నాగాయలంక పోలీస్ స్టేసన్‌లో కైలే అనిల్ కుమార్‌ను ఉంచారు.
కూటమి ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరుపై సింహాద్రి రమేశ్ బాబు మాట్లాడుతూ.. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీ తరఫున నిలబడ్డారు. అధికార పార్టీ వేల కోట్లు ఖర్చు పెడుతున్నా ఎక్కువ శాతం ఓట్లు వైసీపీకి పడుతున్నాయి.
పామర్రులో దొంగ ఓట్లను ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు కైలే అనిల్ కుమార్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు టీడీపీ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వం మారినప్పుడు కూడా మీరే డ్యూటీలు చేయాలని పోలీసులు గుర్తుంచుకోవాలి’’ అని మండిపడ్డారు.


