అన్నమయ్య జిల్లాలో రాజకీయ ప్రకంపనలు | assembly constituency delimitation 5 to 8 seats rayachoti madanapalle | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లాలో రాజకీయ ప్రకంపనలు

Nov 29 2026 12:32 PM | Updated on Nov 29 2026 12:35 PM

 assembly constituency delimitation 5 to 8 seats rayachoti madanapalle

    5 నుంచి 8కి అసెంబ్లీ స్థానాలు! 

    50 శాతం సీట్ల పెంపునకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదంతో వేడెక్కిన సమీకరణాలు

    14.22 లక్షల జనాభా ప్రాతిపదికన మూడు కొత్త నియోజకవర్గాలకు మార్గం సుగమం 

    మదనపల్లె అర్బన్, రూరల్‌ విభజనకు బలమైన ఛాన్స్‌.. వాయల్పాడుకు లైన్‌ క్లియర్‌

    లక్కిరెడ్డిపల్లె పునరుద్ధరణకు భౌగోళిక చిక్కులు.. మదనపల్లె కేంద్రంగా కొత్త లోక్‌సభ స్థానం? 

సాక్షి, మదనపల్లె : 2009 పునర్విభజన తర్వాత స్తబ్దుగా ఉన్న జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి. ఏపీ విభజన చట్టంలో హామీ ఉన్నప్పటికీ ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల పెంపు ప్రక్రియకు శుక్రవారం కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడంతో ఆశావాహుల ఆశలు రెక్కలు విప్పుకున్నాయి. 2011 జనాభా లెక్కలు, పట్టణ ప్రాంతాల్లో సీట్ల పెంపు నిబంధనల ప్రకారం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాలు (రాయచోటి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు) 50 శాతం పెంపుతో 8 స్థానాలకు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

14.22 లక్షల జనాభా..  పెరగనున్న 3 స్థానాలు!
ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని 25 మండలాలు, 411 గ్రామ పంచాయతీల పరిధిలో 14.22 లక్షల మంది జనాభా ఉన్నారు. రొంపిచర్ల, పులిచర్ల మండలాలు మాత్రమే పాలనాపరంగా చిత్తూరు జిల్లాలో కలవగా, మిగిలిన 5 నియోజకవర్గాల మండలాలన్నీ ఇదే జిల్లాలో ఉన్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే 2011 జనాభా గణాంకాలను ప్రామాణికంగా తీసుకుంటే, జిల్లాకు అదనంగా మూడు కొత్త అసెంబ్లీ స్థానాలు దక్కడం ఖాయమని విశ్లేషకులు అంచనా.

ఏ నియోజకవర్గాలకు మోక్షం?   ఎక్కడ చిక్కులు?
2009 పునర్విభజనలో ఈ ప్రాంతానికి చెందిన లక్కిరెడ్డిపల్లె, వాయల్పాడు నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు కొత్త స్థానాలు ఏర్పడితే వీటి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది.

మదనపల్లె రెండు భాగాలుగా విభజన: పట్టణ జనాభాకు ప్రాధాన్యం ఇచ్చే నిబంధన ప్రకారం, జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్న మదనపల్లె నియోజకవర్గాన్ని రెండుగా విభజించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం మదనపల్లె పట్టణంలో 1,16,958, గ్రామీణ మండలంలో 85,223 కలిపి మొత్తం 2,02,181 మంది ఓటర్లు ఉన్నారు. దీనివల్ల మదనపల్లె అర్బన్, మదనపల్లె రూరల్‌ నియోజకవర్గాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. 

వాయల్పాడుకు సులభతరం.. బి.కొత్తకోటపై ఆశలు: 2009లో కలికిరి, కలకడ, వాయల్పాడు, గుర్రంకొండ, కె.వి.పల్లె మండలాలతో ఉన్న వాయల్పాడు సెగ్మెంట్‌ పూర్తిగా పీలేరులో విలీనమైంది. ఈ మండలాలన్నీ ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోనే ఉన్నందున, వాయల్పాడు పునరుద్ధరణకు ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేవు. దీనికి తోడు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట కేంద్రంగా కూడా కొత్త స్థానం కోసం డిమాండ్‌ వినిపిస్తోంది.

లక్కిరెడ్డిపల్లె పునరుద్ధరణలో సాంకేతిక చిక్కులు: గతంలో లక్కిరెడ్డిపల్లె పరిధిలో ఉన్న చక్రాయపేట, సి.కె.దిన్నె, వీరబల్లి మండలాలు 2009 తర్వాత కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, రాజంపేట నియోజకవర్గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు మళ్లీ లక్కిరెడ్డిపల్లెను ఏర్పాటు చేయాలంటే పొరుగు జిల్లా నుంచి మండలాలను విడదీయాల్సి ఉంటుంది. ఇది భౌగోళికంగా, సాంకేతికంగా క్లిష్టమైన అంశం కావడంతో రాయచోటి, పీలేరు మండలాలను సర్దుబాటు చేసి కొత్త సెగ్మెంట్‌ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. 

మదనపల్లె కేంద్రంగా కొత్త లోక్‌సభ స్థానం.. మహిళలకు 33% రిజర్వేషన్‌!
అసెంబ్లీ సీట్లతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజంపేట లోక్‌సభ పరిధిని కుదించి, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు అసెంబ్లీ స్థానాలను కలుపుతూ మదనపల్లె కేంద్రంగా కొత్త లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, కొత్త డీలిమిటేషన్‌ పూర్తయ్యాక 2029 ఎన్నికల నుండే 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 

దీనివల్ల జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 2 నుంచి 3 స్థానాలు మహిళలకు రిజర్వ్‌ అవుతాయి. సోమవారం పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఏర్పడే డీలిమిటేషన్‌ కమిషన్‌ క్షేత్రస్థాయి కసరత్తు, అధికార పార్టీ రాజకీయ వ్యూహాల అనంతరం అన్నమయ్య జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement