సాక్షి, పులివెందుల: ఏపీ జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలు జరుగుతున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. ఎన్నికలు దారుణంగా నిర్వహించడానికా నోటిఫికేషన్ ఇచ్చింది. టీడీపీ గూండాలను పోలీసులే దగ్గరుండి తీసుకొచ్చి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలింగ్ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లి, పెండ్లిమర్రి, వీరబల్లె మండలాల్లో ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని, స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయింది. వేంపల్లిలో తెల్లవారుజామున 4 గంటల నుంచే వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లు బూతులకు చేరుకున్నారు. అయితే ఉదయం 5.30 గంటల ప్రాంతంలో టీడీపీ నాయకులు, పోలీసులు కలిసి తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. ఇతర మండలాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలకు పోలీసులే ఎస్కార్ట్ కల్పించారని విమర్శించారు.
బయట నుంచి వచ్చిన వ్యక్తులకు పోలీసులే సెక్యూరిటీ ఇస్తున్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికలు అత్యంత అన్యాయంగా ప్రారంభమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. ఎన్నికలు దారుణంగా నిర్వహించడానికా నోటిఫికేషన్ ఇచ్చింది. టీడీపీ గూండాలను పోలీసులే దగ్గరుండి తీసుకొచ్చి దాడులు చేయిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల నుంచి ఓటర్ స్లిప్పులు లాక్కుంటున్నారని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వచ్చినా వారిని వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 29,500 మంది ఓటర్లు ఉన్న వేంపల్లిలోనే స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమన్నారు.
ఈసీ విధులు పోలీసుల చేతుల్లోకి వెళ్లాయా?
ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎన్నికల కమిషన్‌దా? లేక పోలీసు వ్యవస్థదా? అంటూ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తన విధులను సక్రమంగా నిర్వహిస్తోందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులు వెంటనే స్పందించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. పులివెందుల మున్సిపాలిటీలో గతంలో జరిగినట్లుగా దొంగ ఓట్ల ప్రక్రియకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
పెండ్లిమర్రి, వీరబల్లె మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని తెలిపారు. బుజ్జిరెడ్డిపల్లె, అల్లిరెడ్డిపల్లె, చౌటుపల్లె గ్రామాల్లో నెలకొన్న శాంతిభద్రతల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇప్పటికే ఎన్నికల అక్రమాల అంశాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ఇప్పటికైనా పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి ఎలాంటి ఒత్తిళ్లు, అక్రమాలకు తావులేకుండా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు.. టీడీపీ గూండాల అరాచకం


