జనసేన నేత కోటా రుక్మిణితో ధరణికృష్ణ (ఫైల్)
జనసేన ప్రత్యేక గుర్తింపు నంబర్‌తో ఐడీ కార్డు వెలుగులోకి
సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు
కోటా రుక్మిణితోపాటు తాళ్లూరి రామ్‌తో కలిసి ఉన్న చిత్రాలు వైరల్
అయితే ఆమెను కైరన్ ఉద్యోగిగానే పేర్కొంటూ ఫిర్యాదులు
రూ.7 కోట్ల కుంభకోణం బయటకు రాకుండా కుయుక్తులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి రూ.7 కోట్లు వసూలు చేసిన కేసు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ధరణికృష్ణకు కైరన్ సంస్థతోనే కాకుండా జనసేన పార్టీతోనూ సంబంధాలున్నట్లు స్పష్టమవుతుండడం దీనికి కారణం. జనసేన పార్టీ ప్రత్యేక గుర్తింపు కోడ్‌తో కూడిన ఐడీ కార్డును కలిగి ఉన్న ధరణికృష్ణ... 2025 ఆగస్టులో విశాఖపట్నంలో జనసేన నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించే కార్డులు సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారాయి.
వీటితోపాటు జనసేన ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న తాళ్లూరి రామ్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ వేడుకల్లోనూ ఆమె పాల్గొన్న ఫొటోలు కూడా బయటకొచ్చాయి. జనసేనలో నంబర్ టూగా చక్రం తిప్పుతున్న కోటా రుక్మిణితో కలిసి ఉన్న చిత్రాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరణికృష్ణను కేవలం కైరన్ ఉద్యోగిగానే ఫిర్యాదుల్లో పేర్కొనడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కుంభకోణం మరక జనసేనకు అంటకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారాన్ని ‘కైరన్’కు పరిమితం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ధరణికృష్ణకు జనసేనతో ఉన్న సంబంధాలేంటి?
జనసేనలో కీలకంగా వ్యవహరించే రుక్మిణి, కల్యాణం శివ శ్రీనివాసరావు(కేకే) ఇచి్చన ఫిర్యాదులతోనే ఈ కేసు మొదలైంది. అయితే, ఆ ఫిర్యాదుల్లో ధరణికృష్ణను కేవలం రుక్మిణి డైరెక్టర్‌గా ఉన్న కైరన్ సంస్థలో ఉద్యోగిగా మాత్రమే పేర్కొన్నారు. కైరన్ సంస్థలో హెచ్‌ఆర్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ధరణికృష్ణ... తనకు తెలియకుండా సంస్థ పేరును ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారని ఆ సంస్థ డైరెక్టర్ రుక్మిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ధరణికృష్ణ సెల్ఫీ వీడియోల్లో తనకు జనసేనతో సంబంధం లేదని పేర్కొనడాన్ని తిప్పికొట్టారు.
తనకు పార్టీతో సంబంధం లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల యాప్‌ను ఎందుకు రూపొందించానని ప్రశి్నంచారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన కోసం తాను చేసిన పనుల వివరాలన్నింటినీ బయటపెడతానని కూడా ఆమె తన వీడియోల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైరల్‌గా మారిన ఫొటోలు.. పార్టీ కార్యక్రమాల్లో ఆమె ఏ స్థాయిలో పనిచేశారు? ఆమెకు పార్టీతో ఉన్న అధికారిక సంబంధాలేంటి? అన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి

కోటా రుక్మిణికి పార్టీ సంపూర్ణ మద్దతు!
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కైరన్ సంస్థ డైరెక్టర్ కోటా రుక్మిణికి మద్దతుగా జనసేన నేతలు స్పందించిన తీరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సంస్థపై ఆరోపణలు వెలుగులోకి వచి్చన కొద్ది గంటల్లోనే పార్టీ నాయకులు, శ్రేణులు ఆమెకు మద్దతుగా రంగంలోకి దిగడం గమనార్హం. పార్టీ అగ్రనేతల మద్దతు లేకుండా రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు నాయకులు, శ్రేణులు ఇంత వేగంగా స్పందించడం సాధ్యమేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కీలక దశలో ఉన్నప్పటికీ ఇతర పార్టీ కార్యక్రమాలను పక్కనపెట్టి రుక్మిణికి మద్దతుగా జనసేన మహిళా నేతలు వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహించడం, పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఈ వ్యవహారానికి సంబంధించిన పోస్టులు పెద్ద సంఖ్యలో ప్రచురించడం చర్చకు దారితీసింది. ఈ పరిణామాలపై పార్టీ శ్రేణుల్లోనే కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రశ్నలకు బదులేది?
⇒ ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదులు చేసిన కోటా రుక్మిణి, కేకే ఇద్దరూ ధరణికృష్ణను కేవలం కైరన్ సంస్థ ఉద్యోగిగానే ఎందుకు పేర్కొన్నారు?
⇒ జనసేనతో ఆమెకున్న సంబంధాల గురించి ఫిర్యాదుల్లో ప్రస్తావించకపోవడానికి కారణాలేంటి?
⇒ నిరుద్యోగుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.7 కోట్లు ఎవరెవరికి చేరాయి?
⇒ బాధితుల వివరాలు, డబ్బు లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు అధికారికంగా ఎందుకు వెల్లడించడంలేదు?
⇒ పార్టీ కార్యక్రమాల్లో ధరణికృష్ణ పాత్ర ఏమిటి?
⇒ రాజకీయాలకు అతీతంగా, అన్ని కోణాల్లోనూ విచారణ జరిగితేనే ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కీలక నేతలకు పార్టీ కార్యాలయంలోకి నో ఎంట్రీ?
ఈ వ్యవహారం తర్వాత కీలక నేతలకు పార్టీ కార్యాలయంలో నో ఎంట్రీ ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడి కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతల్లో రుక్మిణి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఆమె వ్యవహారశైలిపై పార్టీలోని మరో వర్గానికి అసంతృప్తి ఉండటంతోనే ఈ రూ.7 కోట్ల మోసం వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారని అంటున్నారు. ఈ పరిణామాలను ముందుగానే పసిగట్టిన రుక్మిణి అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న విమర్శలూ ఉన్నాయి. కోటా రుక్మిణి వ్యవహారశైలి కారణంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.


