ఎస్‌ఈసీకి వినతిపత్రం ఇస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీని కలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులు
59 ఘటనలపై వీడియో ఆధారాల సహా ఫిర్యాదు
రీ–పోలింగ్ తప్పనిసరిగా చేపట్టాలని డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలీసు యంత్రాంగం కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో కూటమి నాయకుల అక్రమాలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆదివారం ఎస్‌ఈసీని కలిసిన వారిలో పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణ మూర్తి, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, నత్తా యోనారాజు, బొందిలి నరేంద్ర సింగ్ తదితరులు ఉన్నారు.
అనంతరం పార్టీ నాయకులతో కలిసి విష్ణు మీడియాతో మాట్లాడారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సాధించిన ఘన విజయాన్ని జీర్ణించుకోలేక, రెండో విడతలో ఉదయం నుంచే టీడీపీ గూండాలు యథేచ్ఛగా బూత్ క్యాప్చరింగ్‌కు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. కడప జిల్లాలోని పులివెందుల, వేంపల్లె, చక్రాయపేటతో పాటు నంద్యాల, ఒంగోలు, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానీయకుండా రాళ్లు, కర్రలతో దాడులు చేశారని మండిపడ్డారు.
వేంపల్లె మండలంలోకి బయట ప్రాంతాల నుంచి వంద జీపుల్లో రౌడీలను తీసుకొచ్చి వార్డులను ఏకగ్రీవం చేసుకోవడమే కాకుండా, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం పగలగొట్టారని విమర్శించారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూ, వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను బయటకు తరిమికొట్టి బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లేందుకు సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేను పోలీసులు కిడ్నాప్ చేయడం దుర్మార్గం
దొంగ ఓట్లను ప్రశి్నంచిన పామర్రు వైఎస్సార్‌సీపీ మాజీ దళిత ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ను పోలీసులు కిడ్నాప్ చేయడం అత్యంత దుర్మార్గమని, ఎస్వీ సతీష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, శైలజానాథ్ వంటి నేతలను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. కార్యకర్తల తలలు పగలగొట్టడమే కాకుండా రిగ్గింగ్, ఎన్నికల అక్రమాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాడులు చేయడం దారుణమని విమర్శించారు. అనంతపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినా, స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రిటరి్నంగ్ అధికారిని బూతులు తిట్టి భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు.
అధికార యంత్రాంగం మొత్తం అధికార పార్టీ చెప్పుచేతల్లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 35 సమస్యాత్మక ప్రాంతాలతోపాటు 59 చోట్ల జరిగిన రిగ్గింగ్, దౌర్జన్యాలు, బ్యాలెట్ పేపర్ల అపహరణపై పూర్తి వీడియో ఆధారాలతో ఎస్‌ఈసీకి సవివరమైన ఫిర్యాదులు అందజేశామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో తక్షణమే రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. తిరుపతి రూరల్‌లో దొంగ ఓట్లను అరికట్టాలని కోరుతూ మోహిత్ రెడ్డి ధర్నా చేసినా అధికారులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో టీడీపీ గూండాల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామస్తులందరూ ఏకమై తిరగబడటంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోయారని వివరించారు.


