బంగారు పళ్లేనికైనా గోడ చేర్పు కావాలి... అనేది మన సామెత. బంగారంలాంటి మన చేనేత అద్భుత వెలుగులు ఊరు దాటి, రాష్ట్రం దాటాలంటే, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలుగులు విరజిమ్మాలంటే అలాంటి చేర్పు లేదా మద్దతు అవసరం. చేనేతరంగానికి అలాంటి మద్దతు ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ ఫ్యాబ్రిక్స్ సొసైటీ నుంచి దొరుకుతుంది. బోర్డ్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక...ఆమెకు మాత్రమే సంతోషకరమైన విషయం కాదు. ఎంతోమంది చేనేతకార్మికులకు తీపికబురు...
సుమారు 70 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ ఫ్యాబ్రిక్స్ సొసైటీ డైరెక్టర్‌గా ఎన్నిక కావడం విశేషం. ఒకప్పటిలా ఏదైనా సమస్య ఎదురైతే, ఎవరిని కలవాలి? ఎలా కలవాలి? కలిస్తే మాట్లాడతారా? గోడు వింటారా?...ఇలాంటి సందేహాలు ఇక చేనేత కార్మికులకు అక్కర్లేదు. ‘వజ్రమ్మ మన అమ్మే’ అంటూ చొరవగా వెళ్లవచ్చు. కుటుంబ పెద్దతో చెప్పినట్లుగా సమస్యలు చెప్పుకోవచ్చు.
చేనేత బడిలో...
చేనేత కళాప్రపంచంలో పుట్టి పెరిగిన వజ్రమ్మకు ఆ కళ వెలుగులు తెలుసు. కళాకారుల ఆకలిరోజులు తెలుసు. నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన వజ్రమ్మ చదివింది ఏడవతరగతి మాత్రమే కావచ్చుగానీ...‘చేనేత బడి’లో చదివింది మాత్రం చాలా ఎక్కువ. భర్త వెంకటేశం మాస్టర్ వీవర్. ఆయనకు తోడుగా పనిచేశారు వజ్రమ్మ. రంగులు అద్దడం, చిటికీలు కట్టడం, పడుగులు ΄ోయడం వంటి పనులను వజ్రమ్మ చేసేవారు. అలా చేనేత వస్త్రాల తయారీలో ఆమె గొప్ప అనుభవం సంపాదించారు.
పూర్వవైభవం
కొంతకాలం తరువాత...‘అనుభవం ఉంది ఆదాయం మాత్రం లేదు’ అనుకునే పరిస్థితి వచ్చింది. ఆరోజుల్లో గట్టుప్పల్ చేనేత సహకార సొసైటీ తమలాంటి ఎంతోమంది చేనేత కళాకారులకు భరోసాగా, ధైర్యంగా ఉండేది. దురదృష్టవశాత్తు
ఆ సొసైటీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సొసైటికి పూర్వవైభవం తేవడానికి నడుం బిగించారు వజ్రమ్మ. సొసైటీ బాధ్యతలు భుజాలకెత్తుకున్నారు. సొసైటీ బాధ్యతలు ధైర్యంగా స్వీకరించడం ఆమె ప్రపంచాన్ని విశాలం చేసింది. ‘వజ్రమ్మా... నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’ అని ఆ బాధ్యతలు చెప్పకనే చె΄్పాయి. దిశానిర్దేశం చేశాయి.
అరుదైన గౌరవం
కొన్ని నెలల క్రితం జరిగిన గట్టుప్పల్ చేనేత సహకార సంఘం ఎన్నికల్లో ΄ోటీ చేసిన వజ్రమ్మ చైర్‌పర్సన్‌గా గెలుపొందారు. ఆ తరువాత ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ మార్కెటింగ్ కో–ఆపరేటివ్ సొసైటీ (హ్యాండ్లూమ్ హౌజ్)కి ఎన్నికల ప్రకటన వచ్చింది. తెలంగాణ నుంచి డైరెక్టర్ పదవికి వజ్రమ్మ పోటీ చేశారు. ఇదేమీ ఆషామాషీ విషయం కాదు. స్థానికంగా అయితే...ఆమె గురించి తెలిసినవాళ్లు, ఆమె గెలవాలని బలంగా కోరుకునే వాళ్లు ఎక్కువగా ఉంటారు.‘గెలవగలనా? లేదా?’ అని వజ్రమ్మ సంశయించలేదు.
‘గెలవాలి. తప్పకుండా గెలవాలి’ అని గట్టిగా అనుకున్నారు. ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను గెలిపించింది. కేరళ, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు మద్దతు పలకడంతో వజ్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంస్థ బోర్డులో కర్నూలు, అనంతపురం ప్రాంతాల వారికే ఎక్కువగా అవకాశం దక్కేది. ఇప్పుడు తెలంగాణకు చెందిన వజ్రమ్మకు ఈ గౌరవం దక్కడం ప్రత్యేకతను సంతరించుకుంది.
వెలుగులు నింపేలా...
ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ సొసైటీకి డైరెక్టర్‌గా ఎన్నికకావడం సంతోషంగా ఉంది. ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది. తెలంగాణ రాష్ట్రంలో చేనేతకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పోచంపల్లి చీరలు, ఇక్కత్ వస్త్రాలు, సిద్ధిపేట గొల్లబామ చీరలు, నారాయణపేట పట్టుచీరలు, గద్వాల్ చీరలు ఇలా అనేక రకాల చేనేత ఉత్పత్తులు తెలంగాణలో తయారవుతాయి. వాటికి జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించడానికి, మార్కెటింగ్ చేయడానికి సొసైటీకి డైరెక్టర్ రూపంలో నాకు అపూర్వ అవకాశం వచ్చింది. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల చేనేత ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడం, వాటికి మార్కెటింగ్ కల్పించడం, విదేశీ మార్కెట్లకు చేరువ చేయడం ద్వారా చేనేత కార్మికులకు ఉ΄ాధి కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే నా ముందున్న నా లక్ష్యం.
– కర్నాటి వజ్రమ్మ
విజయపరంపర
గట్టుప్పల్ చేనేత సహకార సంఘం చైర్‌పర్సన్‌గా, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ కో–ఆపరేటివ్ సొసైటీకి తెలంగాణ ప్రతినిధిగా, జాతీయస్థాయి బోర్డ్ డైరెక్టర్‌గా నెలల వ్యవధిలోనే వజ్రమ్మ ఎన్నిక కావడం విశేషం. ఇప్పటివరకు జాతీయ స్థాయి మార్కెటింగ్‌లో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు పరిమితంగా ఉన్న అవకాశాలు వజ్రమ్మ ఎన్నికతో మెరుగుపడతాయని రాçష్ట్రంలోని చేనేత సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తమ ఉత్పత్తులను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడం, మార్కెటింగ్ చేయడం,
విదేశాలకు ఎగుమతులు ఊపందుకుంటాయి అంటున్నారు.
– చింతకింది గణేష్,సాక్షి ప్రతినిధి, నల్లగొండ
ఇదీ చదవండి: ఎక్స్‌పైరీ డేట్ వర్సెస్ బెస్ట్ బిఫోర్


