విమానంలో ఓసారైనా ప్రయాణించాలన్నది ఇప్పటికీ ఎంతోమంది భారతీయులకు ఉండే కోరిక. మధ్య తరగతికి అది విలాసం. దిగువ మధ్య తరగతికి ఐతే అదెప్పుడు అందని ద్రాక్షే. అయితే బిహార్‌కు చెందిన ఓ యువ కార్మికుడు తన నెల సంపాదనలో దాదాపు మొత్తం ఖర్చు చేసి విమానంలో సొంతూరికి వెళ్లాడు. తన ప్రయాణం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పెట్టడంతో అది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఛత్ పూజను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆ యువకుడు చెన్నై నుంచి బిహార్ రాజధాని పాట్నాకు విమానంలో ప్రయాణించాడు. జీవితంలో ఒకసారైనా విమానంలో ప్రయాణించాలని కోరుకున్నాడు అలా తన కలని నెరవేర్చుకున్నాడు. అతను గ్రామానికి చేరుకున్న తర్వాత స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.
నెటిజన్ల మద్దతు
ఈ యువకుడి నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు సమర్థిస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేయాలనేది అతని వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు అతని ఇంటర్వ్యూల కోసం ఆసక్తి చూపుతున్నట్లు కథనం పేర్కొంది. అయితే అతని పేరు, విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు చేశాడన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


