ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన ఆకాంక్ష అనే మహిళ ఆన్ లైన్ లో కొన్న చీరను తిరిగి ఇచ్చే ప్రయత్నంలో సైబర్ మోసానికి గురైంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.674 పెట్టి చీర కొనుగోలు చేసిన ఆమెకు అది నచ్చకపోవడంతో రిటర్న్ చేసింది. ఏడు రోజులు గడిచినా రీఫండ్ రాకపోవడంతో ఆర్డర్‌కు సంబంధించిన నంబర్‌కు ఫోన్ చేసింది.
రీఫండ్ ఇప్పిస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఆమె ఫోన్ స్క్రీన్ ను షేర్ చేయించి, గిఫ్ట్ కార్డ్ కూపన్ ను ఓపెన్ చేయించారు. దీంతో ఆమె సెంట్రల్ బ్యాంక్ ఖాతా నుంచి ఐదు విడతల్లో మొత్తం రూ.99,518 మాయమయ్యాయి.
మొదటగా రూ.10,000 రెండుసార్లు, ఆ తర్వాత రూ.19,999, రూ.55,000, చివరగా రూ.4,495 చొప్పున నేరగాళ్లు కాజేశారు. తన పెళ్లి కోసం, ఇంటి అవసరాల కోసం ఆకాంక్ష ఆ డబ్బును దాచుకుంది. అకౌంట్‌లో డబ్బులు లేకపోవడంతో ఆమె తండ్రికి విషయమంతా చెప్పింది. ఇద్దరూ బ్యాంకుకు వెళ్లారు కాని అప్పటికే బ్యాంకు టైం అయిపోవడంతో మూసేశారు. చేసేదేం లేక బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసి, నగదు తిరిగి ఇప్పించాలని కోరింది. ఫిర్యాదుపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.


