‘ఆత్మనిర్భర స్వతంత్ర భారతం’
వెస్ట్‌బెంగాల్ మేధ వికసించిన రాష్ట్రం.. భారత రాజ్యాలనేకం యుద్ధపథంతో చరిత్ర సృష్టించాయి. వంగ రాజ్యం అక్షరాలా ‘పదం’తో చరిత్ర సృష్టించింది. జాతీయోద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. బంకించంద్ర చటర్జీ వందేమాతరం అన్న నేల. రవీంద్రనాథ్ టాగూర్ జనగణమన రాసిన నేల. సుభాష్ చంద్రబోస్ జైహింద్ అని నినదించిన నేల.
ఇప్పుడు... దేశ విజ్ఞాన పటాన్ని ఆవిష్కరిస్తోంది. నౌకల నిర్మాణంలో తలమానికం జీఆర్‌ఎస్‌ఈ. అంతరిక్ష ఖగోళ పరిజ్ఞానానికి దర్పణం సైన్స్‌సిటీ. నిత్య పరిశోధనల కేంద్రం సీఎస్‌ఐఆర్–సీజీసీఆర్‌ఐ. ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక నాటి హౌరా వంతెన. నేటి తరం సాంకేతికతకు చిహ్నం నీటి అడుగున రైలుమార్గం. అక్షరానికి నిలువెత్తు నమస్కారం జాతీయ గ్రంథాలయం. భారతమ్మ భాషలు పలికే నిలయం శబ్ద సంగ్రహాలయం. దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలిపిన విజయదుర్గ్.
సౌర వెలుగులతో కాంతులు విరజిమ్ముతున్న సుందర్‌బన్ దీవులు. మన జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్‌కు నచ్చిన ప్రదేశం. చరిత్రను సగర్వంగా రాసుకున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. భరతమాత కీర్తికిరీటంలో పొదగడానికి కొత్త ఆణిముత్యాలను అన్వేషిస్తోంది. పీఐబీ నిర్వహించిన తెలంగాణ పాత్రికేయ ప్రతినిధుల వెస్ట్‌బెంగాల్ పర్యటనలో వెలుగు చూసిన వివరాలతో కూడిన పది కథనాల పరంపర ఇది. ‘ఆత్మనిర్భర స్వతంత్ర భారతం’ శీర్షికన కథనం.
విదేశాలకు మన నౌకలు.. వికసించిన స్వదేశీ పరిజ్ఞానం
కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) భారతదేశంలోని ప్రముఖ రక్షణ రంగ సంస్థలలో ఒకటి. ఇది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. హుగ్లీ నది తీరంలో ఉన్న ఈ సంస్థ నౌకా నిర్మాణ రంగంలో అద్భుతమైన చరిత్ర సృష్టించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చన తర్వాత భారత నావికాదళం కోసం స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధనౌకలను నిర్మించిన మొదటి షిప్‌యార్డ్ ఇది. కేవలం యుద్ధనౌకలు, పెట్రోలింగ్ నౌకలే కాకుండా, వాణిజ్య నౌకలు, శాస్త్రీయ పరిశోధన నౌకలను కూడా తయారు చేస్తోంది.
భారత్ రక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా, విదేశాలకు కూడా నౌకలను ఎగుమతి చేస్తూ ’ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యసాధనలో తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది. జీఆర్‌ఎస్‌ఈ సంస్థ నౌకల నిర్మాణంతోపాటు డెక్క్ మెషినరీ, డీజిల్ ఇంజిన్లు, విపత్తు నిర్వహణ కోసం ఉక్కు వంతెనలను తయారు చేస్తోంది.
ముందస్తుగా తయారు చేసి సిద్ధంగా ఉంచిన ఉక్కు వంతెనలను ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు తక్షణమే చేర్చి రోడ్డు రవాణాను గంటల్లో పునరుద్ధరించడానికి దోహదం చేస్తోంది. అధునాతన సాంకేతికత, నాణ్యతా ప్రమాణాలతో జీఆర్‌ఎస్‌ఈ ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకుంటోంది. ఈ షిప్‌యార్డ్‌కి కోల్‌కతా షిప్‌యార్డ్ అనే పేరు రాకుండా గార్డెన్ రీచ్ అనే పేరు హుగ్లీనదికి ఆవల వైపు ఉన్న దట్టమైన తోటలకు చేరే మార్గం అనే అర్థంలో వచ్చింది.
సైన్స్ సిటీ సినిమా కాదు... విశ్వయానం
కోల్‌కతాలోని సైన్స్ సిటీ దేశంలోనే పెద్దది. దాదాపుగా 50 ఎకరాల్లో విస్తరించింది. విజ్ఞానాన్ని వినోదమాధ్యమంగా నేర్పించే సంస్థ. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. వచ్చే ఏడాదికి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకోనున్న సైన్స్ సిటీని 77 లక్షల మంది సందర్శించారు. పిల్లలను, పెద్దవాళ్లను అలరించేది సిములేటర్‌లో వర్చువల్‌సాగే టైమ్‌మెషీన్ జర్నీ. హైడ్రాలిక్ మోషన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా నడిచే క్యాప్సూల్‌లో కూర్చుని అంతరిక్షయానాన్ని ఆస్వాదించవచ్చు. త్రీ డీ విజన్ థియేటర్, అంతరిక్ష జ్ఞానాన్ని ప్రదర్శించే స్పేస్ థియేటర్ ఉన్నాయి.
ఇందులో 360 మంది వీక్షించగలిగిన థియేటర్ ఇది. ఫుల్‌డోమ్ త్రీడీ డిజటల్ థియేటర్‌లో ‘వన్ స్టెప్ బియాండ్: ఏ జర్నీ టు మార్స్’ త్రీడీ చిత్రం ప్రేక్షకులను భూమి నుంచి అగాకర గ్రహం వైపు తీసుకువెళ్లే అద్భుతమైన ప్రయాణం. ఇక ఎర్త్ ఎక్స్‌ప్లోరేషన్ హాల్‌లో ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం గురించిన వివరాలను సాంకేతికల ఆధారంగా ప్రదర్శన జరుగుతుంది. హోలోగ్రామ ఫ్యాన్‌లు, ఇమర్సివ్ రైడ్‌లు, వర్చువల్ రియాలీటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, మల్టీటచ్ ఇటర్‌ఫేస్‌లు, ప్రొజెక్షన్ మ్యాపింగ్, డిజిటల్ వాల్స్ సాంకేతికలతో హీట్‌వేవ్స్, సముద్ర మట్టాల పెరుగుదల, హిమనదుల కరుగుదల, తుఫానులు వంటి అంశాలను శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు, వాటిని అనుభవాత్మకంగా వివరిస్తున్నారు.
2026, జూలైలో ప్రత్యేక సైన్స్ లెక్చర్‌కు 300 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. విశ్వం, కాస్మాలజీ, చంద్రయాన్ వంటి అంశాలపై చర్చలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మనదేశంలో సైన్స్ సెంటర్ల స్థాపన కోసం కృషి చేసి ‘ఫాదర్ ఆఫ్ ద సైన్స్ సెంటర్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా’గా గుర్తింపు పొందిన డాక్టర్ సరోజ్ ఘోష్ ఈ సైన్స్ సిటీ స్థాపనకు ఆద్యులు. రాకెట్ ప్రయోగాలు, అంతరిక్షంలో జీవనం, భవిష్యత్తు అంతరిక్ష అన్వేషణ, అంగారకుడిపై జీవం కోసం అన్వేషణ వంటి అంశాలను ఆధునిక సాంకేతికతతో చూడవచ్చు. అంతరిక్షాన్ని చదవడం కాదు కళ్ల ముందు చూడడం, ఇది విశ్వ వీక్షణం, విశ్వాంతరాళలోకి ప్రయాణం.

సిరామిక్‌తో ఇంటి నిర్మాణం– ఒంటి నిర్మాణం!
సిరామిక్ అనగానే మనకు గుర్తొచ్చేది టీ కప్పు–సాసర్, ఇంటి నిర్మాణంలో బాత్‌రూమ్‌లో అమర్చే వాష్‌బేసిన్ వంటివి మాత్రమే. సిరామిక్ ఇంటి నిర్మాణంతోపాటు ఒంటి నిర్మాణంలో కూడా కీలకమే. ఇది జీవ అనుకూల సిరామిక్. గాజు– సిరామిక్‌లను జీవం ఉన్న దేహంతో అనుసంధానించడానికి సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్–సీజీసీఆర్‌ఐ) పరిశోధనలు చేస్తున్నాయి. దంతాలకు అమర్చిన ఇంప్లాంట్ల మీద బయో యాక్టివ్ సిరామిక్ పూత, అల్యూమినా, జిర్కోనియా, టఫెన్డ్ అల్యూమినా వంటి శక్తిమంతమైన సిరామిక్ పదార్థాలను పరిశీలించి మన శాస్త్రవేత్తలు తుంటికీలును తక్కువ ఖర్చుతో రూపొందించారు.
కంటి ప్రమాదాలు, కంటి గుంట లో హైడ్రాక్సీఆపటైట్ ఆధారిత ఆర్బిటల్ ఇంప్లాంట్ అమరిక ద్వారా కదిలే కన్నుకు రూపమిచ్చారు. పుర్రె నిర్మాణం, దవడ ఎముక నిర్మాణం, ముఖం– దంతాలు, ఎముకలు, కీళ్ల పునర్నిర్మాణం చేయడానికి బయోసిరామిక్ ఇంప్లాంట్ల అభివృద్ధి వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు స్వదేశీ సాంకేతిక వైద్యపరికరాలను అభివృద్ధి చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న హిప్ జాయింట్‌కి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చవుతుంది,
దేశీయంగా తయారుచేసిన జాయింట్ యాభై నుంచి అరవై వేలలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎనభై వేల రూపాయలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న స్పైనల్ రీకన్‌స్ట్రక్షన్ మెటీరియల్ పాతిక వేలకు అందుబాటులోకి రానుంది. యుద్ధంలో గాయపడిన సైనికులకు తక్షణ చికిత్స కోసం 32 సెకన్లలోనే రక్తస్రావాన్ని ఆపగలిగిన రాపిడ్ క్లాట్ యాంటీబ్యాక్టీరియల్ స్పాంజ్ ప్రయోగదశలను దాటి త్వరలో అధీకృత అనుమతులను పొందనుంది.
ఎముక లోపాల భర్తీకి సిరామిక్
సింథటిక్ బోన్‌గ్రాఫ్టింగ్, బయో యాక్టివ్ సిరామిక్‌లను సీఎస్‌ఐఆర్–సీజీసీఆర్‌ఐ అభివృద్ధి చేసింది. దేహంలో అమర్చిన తర్వాత ఎముక కణజాలం పెరగడానికి అనువుగా రంధ్రాలతో కూడిన సిరామిక్ స్కాఫోల్డ్‌ల పరిశోధనలు, కొత్త ఎముక కణజాలం ఏర్పడడానికి ఈ ఇంప్లాంట్ ఆధారమవుతుంది. బయోయాక్టివ్ గ్లాస్ తో రక్తస్రావ నియంత్రణకు, గాయాల సంరక్షణకు దోహదం చేసే పదార్థాల మీద పరిశోధనలు, ఎముక ఇన్‌ఫెక్షన్‌కు అవసరమైన మందును నేరుగా ప్రభావిత ప్రాంతంలోకి చేరవేసే సిరామిక్ ఆధారిత ఔషథాల మీద పరిశోధనలు చేస్తోంది. ఈ సంస్థ నీటిలో తేలే ఇటుకల తయారీ కోసం కూడా పరిశోధనలు నిర్వహిస్తోంది. మన తెలంగాణలో రామప్ప గుడి నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకల గురించి చదువుకున్నా. నాటి సాంకేతికతకు అబ్బురపడ్డాం. మన శాస్త్రవేత్తల ప్రయోగాలు విజయవంతమైతే ఇకపై వాటిని ఉపయోగించే అవకాశం కూడా వస్తుంది.
ఆత్మనిర్భర్ భారత్ సాధనలో జిగ్యాస
కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌లో ఉన్న సిరామిక్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్– సీజీసీఆర్‌ఐ) 1950లో ప్రారంభమైంది. అడ్వాన్స్‌డ్ సిరామిక్స్, కాంపోజిట్స్, బయో మెటీరియల్స్, మెడికల్ డిజైజ్‌లు, ఫైబర్ ఆప్టిక్స్, ఫొటోనిక్స్, ఫంక్షనల్ మెటీరియల్స్– డిజైజెస్, మెంబ్రేన్, రిఫ్రాక్టరీ అండ్ ట్రెడిషనల్ సిరామిక్స్, రక్షణ రంగంలో ఉపయోగించే స్ట్రాటజిక్ మెటీరియల్స్ రూపకల్పన కోసం పరిశోధనలు చేస్తోంది. విద్యార్థులను శాస్త్రవేత్తలతో అనుసంధానం చేసే ‘సీఎస్‌ఐఆర్– జిగ్యాస’ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో తనవంతు సేవలనందిస్తోంది.
సీఎస్‌ఐఆర్– సీజీసీఆర్‌ఐలు సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, చాపర్‌లు, షిప్పుల కోసం గాజు బరువును తగ్గించడంతోపాటు పటిష్టతను పెంచడమే ఉద్దేశంగా పని చేసి అత్యుత్తమ గ్లాస్‌ను రూపొందించాయి. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా జరిగిన ఈ పరిశోధనలో నానో క్రిస్టల్స్‌కు అధునాతన పదార్థాలను జోడించి తయారు చేసిన ఈ గ్లాస్ (నానో క్రిస్టలైజేషన్) ద్వారా పది మీటర్ల దూరంలో ఏకే 47 నుంచి దూసుకు వచ్చిన బుల్లెట్‌ను తట్టుకోగలిగిన గాజు కంటే ఇది మెరుగైనది. బుల్లెట్ వచ్చి వాహనానికి అమర్చిన అద్దానికి తగిలేటప్పుడే వేగం తగ్గుతుంది, అద్దాన్ని చీల్చుకుని లోపలికి వెళ్లలేక కింద పడిపోతుంది. ఈ ప్రయత్నంలో వాహనం అద్దానికి చిల్లు పడడం వరకే ప్రమాదం పరిమితమవుతుంది.
నిత్య జీవితంలో సిరామిక్
నీటిని శుద్ధి చేయడంలో సిరామిక్ మెంబ్రేన్ ప్రభావవంతంటా పని చేస్తుందని సీఎస్‌ఐఆర్– సీజీసీఆర్‌ఐలో నీటి స్వచ్ఛత– ఆరోగ్యం మీద పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త స్వచ్ మజుందార్ చెప్పారు. రివర్స్ ఆస్మోసిస్ (ఆర్‌వో) సిస్టమ్ ద్వారా నీటిలో ఉండాల్సిన ఖనిజాలు కోల్పోతున్నామని, దేహానికి అవసరమైన పోషకాలను నష్టపోతున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘టోటల్ డిజాల్వ్‌డ్ సాలిడ్స్ (టీడీఎస్) అంటే తాగునీటిలో కరిగిన ఘనపదార్థాల స్థాయి. ఈ స్థాయులు 150 – 250 పీపీఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) మధ్య ఉంటుంది. ఈ నీటికి ఒకింత రుచితోపాటు దేహానికి అవసరమైన ఖనిజాల మిశ్రమం సమతులంగా ఉంటుంది.
ఆర్‌వో ద్వారా వడపోసిన నీటి పీపీఎమ్ 0–50, అందులో కాల్షియం, మెగ్నీషియం వంటి దేహానికి అవసరమైన ఖనిజాలు లోపిస్తాయి. ఈ నీటిని రోజూ తాగడం మంచిది కాదు. 300 పీపీఎమ్ ఉన్న నీటిని శుభ్రమైన, ఆరోగ్యకరమైన నీరుగా పరిగణించాలి. రోజువారీ తాగడానికి సురక్షితం. ఇక 300–500 పీపీఎమ్ వరకు ఆమోదయోగ్యం అన్నారు. 500 పీపీఎమ్‌కంటే ఎక్కువ టీడీఎస్ ఉన్న నీటిని మాత్రమే ఆర్‌వో ద్వారా వడపోయాలన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆమోదించిన పరిమితి కూడా ఇదే. ఇంట్లో తాగునీటి కోసం ఆర్‌వో సిస్టమ్‌లు ఏర్పాటు చేసుకునే ముందు నీటి పీపీఎమ్ పరీక్ష చేసుకోవాలి. నిపుణుల సూచన మేరకు అవసరాన్ని బట్టి మాత్రమే ఆర్‌వో అమర్చుకోవాలని సైంటిస్ట్ స్వచ్‌మజుందార్ అన్నారు.
-వాకా మంజులారెడ్డి, సీనియర్ చీఫ్ రిపోర్టర్


