మన దేశ కళలకు విదేశాల్లో మార్కెట్‌.. ఈ టీనేజర్‌ ఐడియా అదుర్స్‌! | Young Indian-Origin Teenager Creates A Global Platform To Help Traditional Indian Artisans Take Their Handicrafts To US Markets | Sakshi
Sakshi News home page

మన దేశ కళలకు విదేశాల్లో మార్కెట్‌.. ఈ టీనేజర్‌ ఐడియా అదుర్స్‌!

Oct 30 2026 10:11 AM | Updated on Oct 30 2026 10:24 AM

Young Teen Helps Indian Artisans Reach Us Market

యువర్స్‌

అమెరికాలో హస్తకళలు

చేతిలో అందమైన వెదురు ఆభరణం.. ఇంటిని అలంకరించే ఆకర్షణీయమైన హస్తకళా వస్తువు! వీటిని తయారు చేసేవారికి నైపుణ్యం ఉంది. తరతరాలుగా వస్తున్న కళా సంపద ఉంది. కానీ తయారు చేసిన వస్తువులకు తగిన మార్కెట్, గుర్తింపు లభించడం మాత్రం సవాలే.

ఈ సమస్యను గుర్తించిన ఓ టీనేజర్‌.. భారతీయ కళాకారుల ఉత్పత్తులను అమెరికా వినియోగదారులకు పరిచయం చేసే ప్రయత్నం ప్రారంభించాడు. అతడే దేవ్‌ రాయ్‌. అమెరికాలోని వర్జీనియాలో చదువుకుంటున్న భారతీయ మూలాలున్న విద్యార్థి.

భారత పర్యటనల సందర్భంగా నాగ్‌పూర్, ఇండోర్‌ ప్రాంతాల్లోని కళాకారులు తయారు చేస్తున్న వస్తువులను చూసి, వాటికి అమెరికాలోనూ ఆదరణ లభించవచ్చని భావించాడు. ఆ ఆలోచనకు కార్యరూపమే ‘సర్వీంగ్‌ సొసైటీ గ్లోబల్‌ ఫౌండేషన్‌ ’.

2024లో, తన 15 ఏళ్ల వయసులో ఈ సంస్థను ప్రారంభించాడు. వెదురు ఆభరణాలు, చెవిపోగులు, రాఖీలు, బ్యాగులు, కోస్టర్లు, కొవ్వొత్తుల స్టాండ్లు వంటి హస్తకళా ఉత్పత్తులను అమెరికాలోని దుకాణాలు, దేవాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వినియోగదారులకు పరిచయం చేస్తున్నాడు. ఇందుకోసం పలు సంస్థలతోనూ భాగస్వామ్యాలు ఏర్పరచుకున్నాడు.

ఈ రెండేళ్లలో ఫౌండేషన్‌  దేవ్‌ ద్వారా 400 మందికి పైగా కళాకారులకు తోడ్పాటు అందించాడు. 900కు పైగా చేతివృత్తి ఉత్పత్తులను విక్రయించాడు. 300 మందికి పైగా యువ వాలంటీర్లను ఈ ప్రయత్నంలో భాగస్వాములను చేశాడు. 15 వేల డాలర్లకు పైగా నిధులను సమకూర్చాడు.

అమ్మకాలతో ఆగిపోకుండా కళాకారులు తమ ఉత్పత్తులను స్వయంగా ప్రపంచ వినియోగదారులకు చేరవేసుకునేలా డిజిటల్‌ వేదికలను అభివృద్ధి చేయడం కూడా తన లక్ష్యమని చెబుతున్నాడు. ఒక యువకుడి ఆలోచన.. భారతీయ కళలకు కొత్త మార్కెట్‌ తెరిచే ప్రయత్నంగా మారింది. ప్రతిభకు సరిహద్దులు ఉండవు. దాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఆలోచన ఉంటే చాలని దేవ్‌ ప్రయాణం చెప్పకనే చెబుతోంది.

ఇదీ చదవండి: రక్తంలో మైక్రోప్లాస్టిక్స్‌ తొలగించవచ్చా? విద్యార్థి సరికొత్త ప్రయోగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement