సృజన
హైదరాబాద్ చరిత్ర గురించి అంతా తెలిసినట్లుగానే ఉంటుంది. ఏమీ తెలియనట్లుగా కూడా ఉంటుంది! హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన జీనత్‌ఖాన్ ‘ది సైరన్స్ ఆఫ్ సెప్టెంబర్’ నవల రాయడానికి చరిత్రను అధ్యయనం చేస్తున్న క్రమంలో, తనకు హైదరాబాద్ చరిత్ర గురించి తెలిసింది తక్కువనే విషయం అర్థమైంది.
ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ఇండియా ప్రచురించిన ఆమె నవల ‘ది సైరన్స్ ఆఫ్ సెప్టెంబర్’ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఎనిమిది సంవత్సరాల ఆమె పరిశోధనకు, కష్టానికి ఫలితం దక్కింది. తాజాగా... ముంబై లిట్‌ఫెస్ట్‌లో బెస్ట్‌ఫస్ట్ బుక్: ఫిక్షన్ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయింది...
‘ది సైరన్స్ ఆఫ్ సెప్టెంబర్’ అనేది చారిత్రక కల్పనా నవల. 1948–ఆపరేషన్ పోలో నేపథ్యంలో సాగే నవల. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు, భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13న చేపట్టిన సైనిక చర్య... ఆపరేషన్ పోలో. ‘ఆరోజు ఏంజరిగిందంటే...’ అనేదానికే జీనత్‌ఖాన్ పరిమితం కాలేదు. పలు కథనాల ద్వారా వివిధ రకాల సంఘటనలను ప్రభావితం చేసిన పరిస్థితులను విశ్లేషించారు.
టైమ్‌మిషన్‌లో...
‘ది సైరన్స్ ఆఫ్ హైదరాబాద్’లోకి అడుగు పెట్టడం అంటే టైమ్‌మిషన్‌లో కూర్చొని అలనాటి హైదరాబాద్‌కి వెళ్లడమే. ఈ పుస్తకం రాయడానికి ముందు హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి...మొదలైన వాటిని లోతుగా అధ్యయనం చేశారు జీనత్‌ఖాన్. ‘ది సైరన్స్ ఆఫ్ సెప్టెంబర్ ’ రాయడానికి ప్రేరణ ఏమిటి? అనే విషయానికి వస్తే...ఒకరోజు ఖాన్ కూతురు ఒక పుస్తకాన్ని ఇంటికి తీసుకువచ్చింది. దక్కన్ చరిత్రపై రాసిన పుస్తకం అది. ‘నేను హైదరాబాద్ నగరంలోనే పెరిగాను. అయినప్పటికీ ఆనాటి విషయాలు పెద్దగా తెలియవని ఈ పుస్తకం చదివిన తరువాత అర్థమైంది’ అన్నారు ఖాన్. అప్పుడే పుస్తకం రాయాలనే ఆలోచన ఆమెకు వచ్చింది.
లోతైన అధ్యయనం
తన పరిశోధనలో భాగంగా ఏజీ నూరానీ రాసిన ది డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్, మీర్ అలీ రాసిన ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్, జనరల్ ఎల్ ఎడ్రూస్ ఆత్మకథ, అనురాధరెడ్డి రాసిన ఏవియేషన్ ఇన్ ది హైదరాబాద్– డొమినియన్స్... మొదలైన పుస్తకాలను అధ్యయనం చేశారు జీనత్‌ఖాన్. లార్డ్ మౌంట్‌బాటెన్, సర్ వాల్టర్ మాంక్టన్‌ల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను లండన్‌లోని బ్రిటీష్ మ్యూజియంలో చదివారు. బీబీíసీ ఆర్కైవ్‌లలోకి వెళ్లారు. న్యూస్‌ఫిల్మ్ సెగ్మెంట్స్‌లాంటివి ఆ కాలంలో వెళ్లడానికి ఖాన్‌కు సహాయపడ్డాయి.
అలా రాయడం... ఎంతో సవాలు!
→ దేశవిభజనతో పాటు దక్షిణ భారతదేశంలో జరిగిన సంఘటనలకు ప్రజాదరణ ΄÷ందిన సాహిత్యం, సినిమాలలో తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని పుస్తకాలు, సినిమాలు దేశవిభజనను చిత్రీకరించినప్పటికీ, దక్షిణ భారతదేశంలో జరిగిన నాయకీయ పరిణామాలు కేవలం విద్యాసంబంధమైన పత్రాలకే పరిమితమయ్యాయి.
నా రచన ద్వారా ఒకానొక కాలానికి, ప్రదేశాలకు చెందిన తీపిజ్ఞాపకాలను అందించాను. ఆ కాలం, ప్రదేశాలు ఇక ఎప్పటికీ తిరిగిరావు.
→ నవల కథాక్రమాన్ని నిర్ణయించక ముందే ‘ఫరిష్తే’ పాత్రను ఊహించుకున్నాను. నా కథానాయిక ఉన్నత వర్గానికి చెందిన మహిళ. ఆమె ఆదర్శవాది, తెలివైనది, ధైర్యవంతురాలు. నవలలోని పెద్దల వ్యక్తిత్వాలు డార్క్ ట్రయాడ్ (ప్రమాదకరమైన వ్యక్తిత్వ లక్షణాల సమ్మేళనం) కోవకు చెందినవి ఉంటాయి. వీరికి భిన్నంగా ‘ఫరిష్తే’ వ్యక్తిత్వం ఉంటుంది. ఆ కాలంలో ఒక టీనేజీ అమ్మాయికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పరిమితంగానే ఉండేది. 1948 కాలం నాటి యువతి దృక్కోణం నుండి కథ రాయడం అనేది ఎంతో సవాలుతో కూడినది.
→ ఆనాడు అధికారంలో ఉన్న మధ్యవయస్కుల దృక్కోణం నుంచి కథ చెప్పి ఉంటే ఖచ్చితంగా నిరుత్సాహపరిచి ఉండేది. అంగీకరించినా, అంగీకరించకపోయినా వారు మునిగిపోబోతున్న పడవను నడిపారు. ఆనాటి ఫ్యాషన్ ట్రెండ్స్, రవాణావ్యవస్థ... మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి 1940ల జీవితాన్ని చిత్రించిన పుస్తకాలు చదివాను, సినిమాలు చూశాను. అవి అమూల్యమైనవి.
– జీనత్‌ఖాన్


