మెట్రో రైలు.. హుగ్లీ నది.. కోల్‌కతా జనజీవనం | Atmanirbhar Bharat: West Bengal Vinthalu Visheshalu | Sakshi
Sakshi News home page

మెట్రో రైలు.. హుగ్లీ నది.. కోల్‌కతా జనజీవనం

Oct 30 2026 9:00 PM | Updated on Oct 30 2026 9:06 PM

Atmanirbhar Bharat: West Bengal Vinthalu Visheshalu

‘ఆత్మనిర్భర స్వతంత్ర భారతం’ 

హుగ్లీ తీరాన ఓ సాయంత్రం కనువిందు చేస్తున్న చిరు అలలను చూస్తూ సేదదీరే మనసుకు తెలియదు. నది గర్భంలో ఒక రైలు వేలాది మందిని గమ్యాన్ని చేరుస్తోందని. నది మీద పడవలో అలలను లెక్కిస్తూ లాహిరి లాహిరిలో అని పాడుకునే అమ్మాయికి తెలియదు అదే నీటి కింద నేలను చీల్చుకుని ఓ రైలు పట్టాల మీద కూత పెడుతోందని. నది మీద నిర్మించిన వంతెన తీగలు లెక్కపెట్టుకుంటూ కారులో వెళ్లే పిల్లలకు తెలియదు. అదే నీటి కింద మెట్రో రైల్లో కూడా పిల్లలు నీటి మధ్య ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్నారని. కోల్‌కతా వాసుల నిత్యజీవనంలో హుగ్లీ నది, మెట్రో రైలు మమేకమై నిత్యం ప్రయాణిస్తున్నాయి.

మనిషి జీవిక కోసం ప్రకృతి ప్రసాదితమైన హుగ్లీ నది ఒకవైపు, దానికి తోడుగా పతాక స్థాయికి చేరిన మానవ మేధకు ప్రత్యక్ష నిదర్శనమైన అండర్‌వాటర్‌ మెట్రో రైల్‌ మార్గం మరో వైపు. ఈ రెండింటి కలయికతో కోల్‌కతా వాసుల రోజువారీ ప్రయాణ సమయం తగ్గిపోయింది. సమయం ఆదా అవుతోంది.

మనదేశంలో మెట్రో రైలు పుట్టింది కోల్‌కతా నగరంలోనే. 1984, అక్టోబర్‌ 24న ఎస్‌ప్లనేడ్‌ స్టేసన్‌ నుంచి భవానీపూర్‌ వరకు దేశంలో తొలి మెట్రో రైలు పట్టాల మీద పరుగులు తీసింది. ఇది జరిగిన నలభై ఏళ్లకు అంటే 2024లో దేశంలో తొలి నదీగర్భంలో రైలుమార్గంలో ప్రయాణాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లింది.

కోల్‌కతాలో ట్రామ్‌ రైలు చరిత్రగా మారింది. వర్తమానంలో విస్తరించి భవిష్యత్తును నిర్దేశిస్తున్న మెట్రో రైలు నగరంలో దాదాపు 74 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తోంది. ఇందులో 16.4 కిలోమీటర్లు భూగర్భమార్గం. 520 మీటర్లు నీటి అడుగున మార్గం. రోజుకు 8 లక్షల మంది ప్రయాణిస్తారు. మెట్రో రైలు కనీస చార్జ్‌ రెండు కిలోమీటర్ల దూరానికి 5 రూపాయలు.

నీటి అడుగున రైలు ప్రయాణం
కొండ ఇవతలి నుంచి అవతలికి చేరాలంటే సొరంగమార్గం వేయాలి. నదిని దాటాలంటే పడవలో ప్రయాణించాలి లేదా రోడ్డు– రైలు వంతెనల మీద ప్రయాణించాలి. నీటి అడుగున ఒక సొరంగమార్గాన్ని తొలిచి మరీ రైలు పట్టాలు వేసింది మన ఇంజనీరింగ్‌ వ్యవస్థ. హౌరా మైదాన్‌– ఎస్‌పనేడ్‌ స్టేషన్‌ ల మధ్య దూరం 4.8 కిమీలు. ఈ మార్గంలో హుగ్లీ నది గర్భంలో నీటికి 13 మీటర్ల కింద 520 మీటర్ల పొడవున సొరంగాన్ని తొలిచి మెట్రో రైలుమార్గం నిర్మించారు. ఈ దూరాన్ని 45 సెకన్ల సమయంలో దాటుతాం. ఈ సొరంగ నిర్మాణాన్ని 66 రోజుల్లో పూర్తి చేశారు. 2024 మార్చి, 6వ తేదీన ప్రారంభమైంది. 15వ తేదీ ప్రయాణికులతో పరుగులు తీసింది. ఈ హౌరా మెట్రో స్టేషన్‌ భూమి ఉపరితలం నుంచి 33 మీటర్ల లోతులో ఉంది.

అక్షరానుభూతి వేదిక శబ్ద సంగ్రహాలయ
‘మ్యూజియం ఆఫ్‌ వర్డ్‌ (శబ్ద సంగ్రహాలయ)’ భారతీయ భాషలు, లిపులు, భావవ్యక్తీకరణ మాధ్యమాల నిలయం. ఇది కోల్‌కతాలోని నేషనల్‌ లైబ్రరీ ఆవరణలో ఉంది. బ్రిటిష్‌కాలంలో వైశ్రాయ్‌లు నివసించిన బెల్వెడెర్‌ ఎస్టేట్‌లో ఈ ఏడాది జూలైలో ఆవిష్కరించిన ఈ మ్యూజియంలో క్రీ.పూ. 3300 నుండి 1300 వరకు వర్ధిల్లిన సింధు సారస్వత నాగరికత కాలానికి చెందిన సుమారు 400 చిహ్నాలతో అభివృద్ధి చేసిన లిపిని చూడవచ్చు. ఇది భారతఉపఖండంలో అత్యంత పురాతనమైన లిపి. అలాగే తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో 2006లో గుర్తించిన గోండి గుంజాలి లిపిని కూడా చేర్చారు. భారతదేశంపు లిపి జాబితాలో కొత్త చేర్పు.

లిపి స్తంభం!
మ్యూజియం ఆఫ్‌ వర్డ్‌ ప్రవేశ ద్వారం వద్ద వివిధ భారతీయ భాషల లిపులలోని పదాలతో ఓ∙కాంతి వలయపు స్తంభం ప్రత్యేక ఆకర్షణ. ఎవరికి వాళ్లు అక్కడ ఆగిపోయి తమ భాషను వెతుక్కుంటారు. తరతరాలుగా విద్యార్థులు, పండితులు గంటల తరబడి నిశ్శబ్దంగా జ్ఞానాన్ని, సమాచారాన్ని అన్వేషించిన జాతీయ గ్రంథాలయ రీడింగ్‌ రూమ్‌లోలో ఇప్పుడు సాంకేతికత మాధ్యమంగా పదాలు, ఆలోచనలకు ప్రతిరూపంగా ఒక విభిన్నమైన భాండాగారం కొలువుదీరింది. ఇది కేవలం ప్రదర్శనశాల మాత్రమే కాదు,  పదాల ఆవిర్భావం, భాష పరిణామక్రమం, భారతదేశపు అద్భుతమైన భాషా వైవిధ్యాన్ని ఆస్వాదించడానికి చక్కటి వేదిక.

ఆదిమకాలం నుంచి ఆధునిక కాలం వరకు
ఈ మ్యూజియంలో తొమ్మిది ఇమ్మర్సివ్‌ గ్యాలరీలు ఉన్నాయి. ప్రాచీన లిపులు, శబ్దాల పుట్టుక, కాలక్రమేణా భాష అభివృద్ధి చెందిన పరిణామక్రమాన్ని ఆధునిక సాంకేతికత ద్వారా వివరిస్తారు. సందర్శకులు కేవలం చూసి సంతృప్తి చెందడమే కాకుండా, డిజిటల్‌ స్క్రీ¯Œ లపై ఆటలు ఆడవచ్చు, వివిధ భాషల పదాలను అన్వేషించడం వంటి ఇంటరాక్టివ్‌ అనుభవాలను పొందవచ్చు. 

తెలుగుతోపాటు అనేక భారతీయ భాషల ఔన్నత్యాన్ని, సంస్కృతిని నేటి తరానికి చేరవేయడంలో ఈ మ్యూజియం కీలక పాత్ర పోషిస్తుంది. చరిత్ర, సాంకేతికత కలగలిపిన ఈ వినూత్న ప్రదర్శన విద్యార్థులకు, పర్యాటకులకు చక్కటి అనుభూతినిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అ – అమ్మ అనే పదం నుంచి అంతరిక్షం, ఖగోళ జ్ఞానం వరకు భారతీయ సంప్రదాయ విజ్ఞానాన్ని ఒక చోట రాశిపోసిన ఆలయం. ’మ్యూజియం ఆఫ్‌ వర్డ్‌’ గురించి నిర్వహకుల మాటల్లో చెప్పాలంటే ‘ఏకకాలంలో ‘కళాఖండాలు, ఇ¯Œ స్టాలేష¯Œ లు, ఆడియో–విజువల్‌ ప్రెజెంటేష¯Œ లు, మల్టీమీడియా అప్లికేష¯Œ లతో కూడిన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఒక సాంస్కృతిక మ్యూజియం, ఒక ప్రదర్శన వేదిక, ఒక ఇంటరాక్టివ్‌ లెర్నింగ్‌ సెంటర్‌’.

6. 40 లక్షల ప్రచురణల నిలయం– జాతీయ గ్రంథాలయం
కోల్‌కతాలోని జాతీయ గ్రంథాలయాన్ని 1948లో స్థాపించారు. 30 బెల్వెడెరే ఎస్టేట్‌లో ఉన్న ఈ లైబ్రరీ స్వాతంత్య్రానికి 111 ముందు 1836లో ‘కలకత్తా పబ్లిక్‌ లైబ్రరీ’గా ఏర్పాటైంది. ఆ తర్వాత ‘ఇంపీరియల్‌ లైబ్రరీ’గా రూపాంతరం చెందింది. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దీనిని జాతీయ గ్రంథాలయంగా మార్చారు. ఇది మనదేశంలో ఉన్న నాలుగు జాతీయ గ్రంథాలయాలలోకెల్లా అత్యంత పురాతనమైనది, అత్యంత విశాలమైనది, విస్తృతమైనది కూడా. పుస్తకాలు, పత్రికలు, వార్తాపత్రికలు, పటాలతో ప్రతి భారతీయ ప్రచురణకు చెందిన ఒక ప్రతిని స్వీకరించి భద్రపరుస్తారు. 

ఈ గ్రంథాలయంలో కోట్లాది పుస్తకాలు, అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు, పాత పత్రికలు, వివిధ భారతీయ, విదేశీ భాషల సాహిత్య సంపద లభిస్తుంది. పరిశోధకులు, విద్యార్థులకు ఇదొక గొప్ప వరం. భారతదేశ సాంస్కృతిక, విజ్ఞాన వైభవానికి ప్రతీక. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ తన తండ్రి అశుతోష్‌ ముఖర్జీ సేకరించిన అత్యంత అరుదైన, పరిశోధన విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలతోపాటు 87 వేల పుస్తకాలను సమకూర్చడానికి అవసరమైన డబ్బు విరాళంగా ఇచ్చారు. ఆయన గౌరవార్థం భాషాభవన్‌కు  డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ భాషాభవన్‌గా పేరు మార్చారు.

జిటలైజేషన్‌ ప్రక్రియ
‘భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ జాతీయ గ్రంథాలయంలో 180 సంవత్సరాల నాటి పుస్తకాలున్నాయి. వాటిని భద్రపరచడం ఒక ఎత్తయితే కాగితం కాలం ముగిసే లోపు వాటిని డిజిటలైజ్‌ చేసి భవిష్యత్తు తరాలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇప్పటికి 27 వేల పుస్తకాలను డిజిటలైజ్‌ చేశాం. మొత్తం గ్రంథాలను డిజిటలైజ్‌ చేయడానికి 15 సంవత్సరాల సమయం పడుతుంది. కృత్రిమ మేధ గ్రంథాల డిజిటలైజేషన్‌కి ఉపయోగపడదు, ఇది మనిషి మాత్రమే చేయగలిగిన పని. ప్రతి పేజీని మ్యాన్యువల్‌గా డిజిటలైజ్‌ చేయాల్సిందే. తెలుగు వార్తాపత్రికల్లో సాక్షి దిన పత్రిక మాత్రమే క్రమం తప్పకుండా మా లైబ్రరీకి వస్తుంది.
-ఉస్మాన్‌ ఘనీ, లైబ్రరీ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌

తెలుగు రాష్ట్రాల్లో భారీగా కల్తీ : భారత టీ బోర్డు
వేడి నీరు మరిగించి టీ పొడి వేస్తాం. పాలు, చక్కెర కలిపి మరిగించి... చక్కటి రంగు, రుచి, వాసనలతో కూడిన చిక్కటి టీ తాగుతాం. టీ కప్పులో నోరూరించే టీ వెనుక దాగిన అనేక వాస్తవాలను ‘టీ బోర్డు ఆఫ్‌ ఇండియా’ వివరించింది.

అసలు– నకిలీ
‘ఒక గాజు గ్లాసులో నీటిని పోసి చిటికెడు టీ పొడి వేయాలి. టీ పొడి గ్లాసు అడుగుకు చేరేలోపు నీటి రంగు మారుతుంటే అది నకలీ టీ పొడి. అసలైన టీ పొడి 95 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిన తర్వాత మాత్రమే నీటికి రంగు వస్తుంది. అలాగే మరో చిట్కా ఏమిటంటే ఒక టిష్యూ పేపర్‌ మీద టీ పొడిని చల్లి రెండు చుక్కల నీటిని చిలకరించి టిష్యూ పేపర్‌ను రుద్దాలి. అప్పుడు పేపర్‌కు రంగు అంటితే అది నకిలీ టీ పొడి. దేశంలో నకిలీ టీ పొడుల బెడద తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ’ అని టీ బోర్డు అధికారి వివరించారు.

టీ ఉత్పత్తిలో ఏడాదికి మూడు మిలియన్‌ మెట్రిక్‌ టన్నులతో చైనా తొలి స్థానంలో ఉండగా, మనదేశం 1.38 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులతో రెండవ స్థానంలో ఉంది. అలాగే టీ తాగడంలో కూడా మనం రెండవస్థానంలో ఉన్నాం. మన దగ్గర ఉత్పత్తి అయిన టీ పొడిలో 80 శాతం దేశంలోనే ఖర్చవుతోంది. భారతీయులు పాలు, చక్కెర కలిపిన టీ తాగే సంప్రదాయ అలవాటు నుంచి క్రమంగా బయటపడుతున్నారు. పాలు, చక్కెర లేని ఆరోగ్యకరమైన టీకి అలవాటు పడుతున్నారని, టీ తాగాల్సిన విధానం ఇదేనని టీ బోర్డు అధికారులు తెలిపారు.

అతి పెద్ద పరిశ్రమ
తేయాకు తోటల్లో పని చేసేది ఎక్కువగా మహిళలే. మనదేశంలో తేయాకు పరిశ్రమ దాదాపు 12 లక్షలమందికి నేరుగా ఉపాధినిస్తుండగా, అందులో మహిళల భాగస్వామ్యం 58 శాతంగా ఉంది. ఇక తేయాకు ప్రాసెసింగ్, ప్యాకింగ్, సప్లయ్, రీటైల్‌ విక్రేతల వరక్లు పరోక్షంగా ఈ సప్లయ్‌ చైన్‌లో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కోటి వరకు ఉంటుంది. ఇందులో రెండు లక్షల మందికి పైగా చిన్న చిన్న తేయాకు రైతుల పాత్ర గణనీయమైనదని టీ బోర్డు అధికారి జగన్నాథ రావు వివరించారు. 1954లో ఏర్పాటైన టీ బోర్డు గురించి వివరిస్తూ  ‘తేయాకు స్వచ్ఛతను పరిశీలించి ధృవీకరణ సర్టిఫికేట్‌ ఇవ్వడంతోపాటు తేయాకు స్వచ్ఛత చిహ్నం ‘వీపుకు తేయాకు బుట్ట కట్టుకుని, ముక్కుకి పుడక ధరించిన యువతి’ చిత్రాన్ని వివరించారు. మన ధృవీకరించిన మన తేయాకు ప్రపంచ గోల్డ్‌ స్టాండర్డ్‌ తేయాకు అని’ వివరించారు.

బంగ్లాదేశ్‌ ఆవిర్భావ వేదిక ‘విజయదుర్గ్‌’
విలియం ఫోర్ట్, ఈస్టర్న్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం, విజయదుర్గ్‌ అన్నీ ఒకటే. కోల్‌కాతా నగరంలో హుగ్లీ నది తూర్పు ఒడ్డున ఉంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలన కాలంలో నిర్మించిన కోట. 70 ఎకరాల్లో విస్తరించిన ఈ కోటకు బ్రిటిష్‌ రాజు మూడవ విలియం పేరు పెట్టారు. తర్వాత ఇక్కడ మనదేశంలో ప్రధాన భారత్‌– పాక్‌ 1971 యుద్ధంలో పాకిస్థాన్‌ మీద భారత్‌ విజయానికి ప్రతీక అయిన పై ఫొటోతోపాటు యుద్ధం తాలూకా అనేక వివరాలను చూడవచ్చు. యుద్ధంలో ఓడిపోయిన పాకిస్థాన్‌ దేశ పతాకాన్ని ఓటమిని అంగీకరించిన చిహ్నంగా తిరగవేసి ప్రదర్శించిన చిత్రాలను చూడవచ్చు. ఆ యుద్ధం జరిగింది ఈ సైనిక కేంద్రం నుంచే. దేశ సైనిక చరిత్రకు గుర్తింపుగా ఈస్టర్న్‌ కమాండ్‌ ఇండియా అనే పేరును విజయదుర్గ్‌గా మార్చారు. కోట చుట్టూ ఉన్న మైదానం దేశంలోనే అతిపెద్ద అర్బన్‌ పార్క్‌గా ప్రసిద్ధి చెందింది.

తలకిందులుగా పాక్‌ పతాకం 
భారత రక్షణ వ్యవస్థలో మూడు స్తంభాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు గుర్తుగా ఉదయించే సూర్యుడి గుర్తుతో మూడు పిల్లర్ల ప్రతీకాత్మక నిర్మాణం ఉంది. యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికుల పేర్లు గోడల మీద చెక్కారు. వారికి నివాళిగా కాగడా నిరంతరం జ్వలిస్తుంటుంది. దేశం కోసం సైనికులు చేసిన యుద్ధాలు, విజయాలను తెలుసుకుంటూ, చిత్రాలను చూస్తున్నప్పుడు సైనికుల పట్ల కృతజ్ఞతభావంతో దేహం రోమాంచితమవుతుంది. ఈ యుద్ధంలో పాకిస్థాన్‌ మీద విజయం సాధించి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దోహదం చేసిన సైనిక కేంద్రం విజయ్‌దుర్గ్‌.

సుందర్బన్‌ దీవుల్లో సౌర విప్లవం
మత్స్యకారుల రక్షణ, జీవనోపాధి కోసం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుందర్‌బన్‌ దీవులకు సౌరవిద్యుత్‌ను పరిచయం చేసింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో ప్రభుత్వం సుందర్బన్‌ మడ అడవుల్లో నివసించే వారి కోసం సౌరశక్తి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఇది మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు వన్యప్రాణుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం.

ప్రధాన కార్యక్రమాలు
సౌర పడవలు, ఈ–ఫెర్రీలను ప్రవేశపెట్టి డీజిల్‌ ఖర్చులు, కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి వీటికి ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. సౌర శక్తి ద్వారా మొబైల్‌ ఫోన్, జీపీఎస్, సెర్చ్‌లైట్లు ఛార్జ్‌ చేసుకొని తుఫాను హెచ్చరికలను తెలుసుకుంటున్నట్లు, జీవనోపాధితోపాటు భద్రత కూడా లభిస్తోంది.

నదీతీర ప్రాంతాల్లో సోలార్‌ వీధి దీపాలు ఏర్పాటు చేసింది. వేట నుంచి రాత్రివేళల్లో తిరిగి వచ్చే జాలర్లకు చుక్కానిలా పని చేస్తోందని స్థానిక జాలర్లు చెప్పారు. 

పులుల భయం నుండి రక్షణకు కూడా సోలార దీపాలు ఉపయోగపడుతున్నాయి. నదీతీరాల వెంబడి దీపాలు వెలగడం వల్ల రాయల్‌ బెంగాల్‌ టైగర్‌లు, ఇతర అడవి జంతువులు జన నివాసాల్లోకి రాకుండా నివారించి మరణాల నియంత్రణకు దోహదం చేస్తోంది.

రూఫ్‌టాప్‌ కిట్‌ ప్రక్రియ కూడా మంచి ఫలితాలనిస్తోంది. గ్రిడ్‌ కనెక్షన్‌ లేని నిరుపేద జాలర్ల కుటుంబాలకు వ్యక్తిగత సౌర ఫలకాలను పంపిణీ చేస్తున్నారు. వీటి వాడకాన్ని త్వరగానే నేర్చుకున్నట్లు స్థానిక మహిళలు సంతోషంగా చెప్పారు. స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో సౌర వ్యవస్థలు విజయవంతంగా నడుస్తున్నాయి.

పులి ఎక్కడ ఉందో అడవికి తెలుసు!
సుందర్‌బన్‌లో పులి కోసం నిరీక్షణ తర్వాత మాకు తెలిసిన విషయం ఇది. ‘కుక్క ఉంది’ అనే బోర్డు కనిపిస్తే జాగ్రత్తగా వెళ్లిపోతాం తప్ప మన కళ్లు కుక్క కోసం వెతకవు. ‘పులి సంచరించే ప్రదేశం’ అనే బోర్డు కనిపిస్తే అప్రమత్తం అవుతాం, పులి కనిపిస్తే బావుణ్నని ఆశగా చూస్తాం. పులి కనిపించడం ఒక అదృష్టం. పులి ఎక్కడ ఉందో అడవికి తెలుస్తుంది. అడవిలో పులి ఎక్కడ ఉందో పసిగట్టడం ప్రకృతి శాస్త్రవేత్తలకు తెలుస్తుంది. ‘మీరు పులిని చూసేలోపే, అది మిమ్మల్ని పదిసార్లు చూసి ఉంటుంది’ అని ఒక నానుడి. ‘పులి తాను కావాలనుకుంటేనే మనకు కనిపిస్తుంది. కాబట్టి అడవికి కేవలం పులిని చూడడం కోసమే వెళ్లవద్దు. అడవి అనుభూతిని పొందడానికి వెళ్లాలి. అదృష్టం బాగుంటే పులి మన కంట పడుతుంది’ అంటారు వన్యప్రాణి ప్రేమికులు.

పులికి సిగ్గెక్కువ!
నమ్మినా నమ్మక పోయినా ఇది నిజం. పులులు చాలా సిగ్గరులు. వాహనాల చప్పుడుకే దాక్కుంటాయి. పులి జాడను వన్యప్రాణులు చెప్పకనే చెబుతాయి. రెండు జింకలు ప్రశాంతంగా కనిపించాయంటే ఆ దరిదాపులో పులి లేదని. నీటి మడుగు తీరాన తడిమట్టిలో పులిజాడ తాజాగా కనిపిస్తే అక్కడ పులి సంచరిస్తున్నట్లు. నెమళ్లు ఇతర పక్షుల స్వరంలో హెచ్చరిక ధ్వనిస్తే పులి వస్తోంది దాక్కోండి అని చెప్తున్నట్లు.

ఈతకొట్టే పులి!
సుందర్‌బన్‌ అటవీ ప్రదేశం రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఆవాసం. మామూలు పులి, బెంగాల్‌ టైగర్‌ రెండూ పాంథెరా టైగ్రిస్‌ జాతికి చెందినవే. కానీ రెండింటి స్వభావంలో తేడా ఉంటుంది. మామూలు పులి నదులు, నీటి మడుగుల దగ్గరకు అవసరమైతే తప్ప వెళ్లదు, వెళ్లినా ఒడ్డున నిలబడి నీరు తాగి దాహం తీరిన తర్వాత వెనక్కి వచ్చేస్తుంది తప్ప నీటిలో దిగదు. బెంగాల్‌ టైగర్‌కు ఈత సరదా. నది ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు అవలీలగా ఈదుతుంది. సుందర్‌బన్‌ దీవుల్లో పులులు ఒక దీవి నుంచి మరో దీవికి రోజూ అలవాటుగా ప్రయాణిస్తాయి. ఒక పట్టులో ఆరు నుంచి పదకొండు కిలోమీటర్ల దూరం ఈదిన సంఘటనలున్నాయి.

ప్రాజెక్టు టైగర్‌!
మన జాతీయ మృగం రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ సంరక్షణ కోసం ప్రాజెక్ట్‌ టైగర్‌ పేరుతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ సంరక్షణ అంటే కేవలం ఒక జంతువును కాపాడటం మాత్రమే కాదు, మన అడవులను, జీవవైవిధ్యాన్ని, భవిష్యత్తు పర్యావరణ పరిరక్షణ కూడా. ప్రాజెక్ట్‌ టైగర్‌ యొక్క అంతిమ లక్ష్యం కూడా అదే. సుందర్‌బ¯Œ  ప్రత్యేకమైన మడ అడవుల పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యం, ముఖ్యంగా రాయల్‌ బెంగాల్‌ పులుల సంరక్షణకు, అంతరించి పోనున్న తాబేలు జాతి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి సుందర్‌బ¯Œ  టైగర్‌ రిజర్వ్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శిలాదిత్య ఆచార్య వివరించారు.

పులి సంరక్షణ– మనుషుల భద్రత మా బాధ్యత 
సుందర్‌ బన్‌లో 102 దీవులున్నాయి. అందులో 54 జనావాసాలు, 48 దీవులు వన్య ప్రాణుల ఆవాసాలు. ఈ దీవుల సమూహాలు బిద్యాధరి నదికి రెండు వైపులా ఉన్నాయి. పులులు జనావాసాల మీద దాడి చేయడాన్ని నివారించడానికి 108 కిలోమీటర్ల నెట్‌ ఫెన్సింగ్‌ వేశాం. ఈ రెండు దీవుల సమూహాలను వేరు చేయడం ద్వారా మనుషుల మీద పులుల దాడులను నివారించాం. అలాగే పులుల తాగునీటి అవసరాల కోసం నదికి రావాల్సిన అవసరం లేకుండా అవి ఉన్న దీవులలో మంచి నీటి గుంతలను ఏర్పాటు చేశాం. సముద్రపు ఆటు పోట్ల కారణంగా నదిలోకి సముద్రపు నీరు కలుస్తుంటుంది. ఆ నీటిని తాగిన పులుల ప్రవర్తన అగ్రెసివ్‌ గా ఉండేది. ఇప్పుడు మంచినీరు తాగడం వల్ల అవి శాంతంగా ఉంటున్నాయి. పులుల దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉండేదంటే పులిబారిన పడి మగవాళ్లు ప్రాణాలు కోల్పోయిన ఒక గ్రామానికి విధవపల్లి అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. పదిహేను సంవత్సరాల కిందట ఉన్న పరిస్థితులను సమూలంగా మార్చగలిగాం.  

పులులు, వాటి ఆవాసాల పరిరక్షణ కోసం అటవీ శాఖ వివిధ రకాల చర్యలను చేపట్టింది. నిరంతర గస్తీ, పులుల పర్యవేక్షణ, కెమెరా ట్రాపింగ్, సాంకేతిక ఆధారిత నిఘా చర్యలతో అక్రమవేటగాళ్ల నుంచి పులుల సంరక్షణ, మనుషుల భద్రత సాధ్యమైంది. సుందర్‌బ¯Œ  పర్యావరణ పరిరక్షణ కోసం ఎకో–టూరిజం నిబంధనలను అనుసరిస్తున్నాం.
-టైగర్‌ రిజర్వ్‌ రేంజ్‌ ఆఫీసర్‌

జల సరిహద్దు
సుందర్‌బన్‌ అటవీ ప్రదేశం గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదుల మధ్య విస్తరించిన డెల్టా. ఇది మడ అడవులకు ప్రసిద్ధి. ఇక్కడ పెద్ద నదులతోపాటు అనేక చిన్న చిన్న నీటిపాయలను కూడా నదిగానే పిలుస్తారు. బిద్యాధరి, మాల్టా, గోసాబా వంటివన్నీ ఇలాంటి నీటిప్రవాహాలే. నది పాయల మధ్య దీవులుంటాయి. సుందర్‌బన్‌ అటవీప్రదేశంలో కొంతమేర హుగ్లీ నది ప్రవాహం సాగుతుంది. హుగ్లీ నంది గంగానది నుంచి చీలిన పాయ. ఫరక్కా బ్యారేజ్‌ దగ్గర ప్రవాహం దారి మార్చుకుంది. కోల్‌కతా నగరాన్ని సస్యశ్యామలం చేస్తోంది. 

స్థానికులు హుగ్లీని గంగ అని కూడా పిలుస్తారు. నది ప్రవాహం వెంబడి ఇండియా నుంచి బంగ్లాదేశ్‌ వరకు విస్తరించిన అటవీప్రదేశం ఇది. మన భూభాగాన్ని సుందర్‌బన్‌ ఇండియాగా వ్యవహరిస్తారు. నదిలో ప్రయాణించేటప్పుడు నీటిలో సరిహద్దు గుర్తుల దగ్గర నుంచి వెనక్కి రావాలి. ఇంటర్నేషనల్‌ మ్యారిటైమ్‌ బౌండరీలైన్‌ దాటేటప్పుడు నిబంధనల ప్రకారం పడవల మీద తమ జాతీయపతాకంతోపాటు ఆ దేశపు పతాకాన్ని కూడా ఆవిష్కరించాలి. అలా సుందర్‌బన్‌ దగ్గర భారత్‌– బంగ్లా సరిహద్దు సమీపంలో రెండు దేశాల జాతీయపతాకాలతో పడవలు కనిపిస్తాయి.
-వాకా మంజులారెడ్డి, సీనియర్‌ చీఫ్‌ రిపోర్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement