న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ యువతి అంకితా భండారీ హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద రాత్రంతా కొనసాగిన నిరసన పోలీసుల ప్రవేశంతో గురువారం తెల్లవారుజామున ముగిసింది. ఉదయం 4 గంటల సమయంలో అంకితా తల్లిదండ్రులు, కాంగ్రెస్ నేతలు, ఇతర నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరినీ విడుదల చేశారు. నిరసనకారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ ఆరోపించింది. సిక్కిం గవర్నర్‌గా బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ నియామకాన్ని నిలిపివేయాలని, 2022లో జరిగిన అంకితా హత్య కేసులో న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
అంకితా హత్య కేసులో గుర్తుతెలియని ఓ ప్రముఖ వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని నిలిపివేయాలని నిరసనకారులు కోరారు. ఈ కేసులో గౌతమ్‌కు సంబంధం ఉందని అంకితా తల్లిదండ్రులు ఆరోపించారు. బుధవారం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఇండియా గేట్ వద్ద అంకితా తల్లిదండ్రులను కలిసి వారి డిమాండ్‌కు మద్దతు తెలిపారు.
19 ఏళ్ల అంకితా భండారీ రిషికేశ్‌లోని వనంతర రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న సమయంలో 2022 సెప్టెంబర్ 18న హత్యకు గురైంది. నాలుగు రోజుల తర్వాత చిల్లా కాలువలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, ఇద్దరు సిబ్బంది సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను పోలీసులు అరెస్టు చేశారు. పుల్కిత్ ఆర్య బహిష్కృత బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు. 2025 మే 30న కోట్ద్వార్లోని అదనపు జిల్లా న్యాయమూర్తి రీనా నేగి ఈ ముగ్గురికి హత్య, సాక్ష్యాల మాయం తదితర నేరాల కింద జీవిత ఖైదు విధించారు.
నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ నేతలు సుప్రియా శ్రీనటే, పవన్ ఖేరా, ఖాజీ నిజాముద్దీన్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల చర్యను పవన్ ఖేరా ఖండిస్తూ.. తెల్లవారుజామున ఇండియా గేట్ వద్ద ప్రజాస్వామ్యం అంతమవుతోందని వ్యాఖ్యానించారు. అంకితా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గవర్నర్ పదవిని చేపట్టే పరిస్థితి ఉండగా, న్యాయం కోరుతున్న ఆమె తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
అంకితా తండ్రి వీరేంద్ర సింగ్ భండారీ బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఒక విజ్ఞప్తి చేస్తూ, సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు దుష్యంత్ కుమార్ గౌతమ్ నియామకాన్ని చేపట్టవద్దని కోరారు. ఈ కేసులో వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంకితా హత్యలో మరో ప్రముఖ వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అంకితా కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
ఇదీ చదవండి: ఒక్క నెలలో 23 టన్నుల బంగారం కొనుగోలు.. డ్రాగన్ వ్యూహమిదే..


