breaking news
Human Health
-
మీ బాడీలో ఏమున్నాయో తెలుసా? మన బరువులో.. ఏ మూలకం ఎంత?
హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే నీళ్లు.. సోడియం, క్లోరిన్ కలిస్తే ఉప్పు.. ఐరన్, కార్బన్ కలిస్తే ఉక్కు.. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతిదీ వివిధ మూలకాల కలయికే. రాళ్లు, రప్పలు, వస్తువులే కాదు.. జీవులన్నీ కూడా రసాయన పదార్థాల సమ్మేళనమే. మరి మనం.. అంటే మనుషులం ఏ మూలకాలతో తయారయ్యాం? ఏమేం ఉంటాయి? ఎంతమేర ఉంటాయో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ 118 మూలకాలున్నా.. ఇప్పటివరకు భూమ్మీద 118 మూలకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో కొన్ని విస్తారంగా ఉంటే.. మరికొన్ని మూలకాలు చాలా అరుదుగా లభిస్తాయి. భూమిపై మట్టి, నీళ్లు, గాలి, చెట్లు, జంతువులు, ఇళ్లు, వాహనాలు, వస్తువులు, మన ఫోన్లు.. ఇలా మనతోపాటు చుట్టూ ఉన్న ప్రతిదీ ఈ 118 మూలకాలతోనే తయారై ఉంటుంది. వేర్వేరు వస్తువుల్లో వేర్వేరు మూలకాలు ఉంటాయి. అదే చెట్లు, జంతువులు, ఇతర జీవజాలంలో మాత్రం ప్రధానంగా ఉండేవి నాలుగు మూలకాలే. మరికొన్ని మూలకాలు నామమాత్రస్థాయిలో ఉంటాయి. (చదవండి: పిల్లులూ పేర్లు గుర్తిస్తాయ్) లెక్కిస్తే.. హైడ్రోజన్ టాప్ మన శరీరంలో బరువుపరంగా ఆక్సిజన్ టాప్ అయినా.. పరమాణువుల సంఖ్య లెక్కన చూస్తే హైడ్రోజన్ శాతం చాలా ఎక్కువ. మన శరీర బరువులో నీటి శాతమే ఎక్కువ. రెండు హైడ్రోజన్, ఒక ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే ఒక నీటి అణువు ఏర్పడుతుంది. అంటే ఆక్సిజన్ కంటే హైడ్రోజన్ రెండు రెట్లు ఎక్కువ. ► కానీ హైడ్రోజన్ పరమాణువు బరువు చాలా తక్కువ. 16 హైడ్రోజన్ పరమాణువులు కలిస్తే.. ఒక్క ఆక్సిజన్ పరమాణువు అంత అవుతాయి. నాలుగింటితోనే .. ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్.. మన శరీరంలో 97 శాతం బరువు ఈ నాలుగు మూలకాలదే. అందులోనూ సగానికిపైగా బరువు ఒక్క ఆక్సిజన్‌దే కావడం విశేషం. ► నిజానికి మన శరీరంలో 60 శాతం నీళ్లే. ఆక్సిజన్, హైడ్రోజన్ మూలకాలు కలిసి ఏర్పడేవే నీళ్లు. దీనికితోడు శరీరంలోని అన్ని కణాలు, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాల్లో ఆక్సిజన్ ఉంటుంది. ఇలా అన్నింటిలో కలిపితే శరీర బరువులో 65 శాతం ఆక్సిజనే. ఏ మూలకం.. ఎందుకోసం? మన శరీరం ప్రధానంగా నాలుగు మూలకాలతోనే నిర్మితమైనా.. మరికొన్ని మూలకాలు కూడా అత్యంత కీలకం. ఉదాహరణకు మన శరీరబరువులో సోడియం ఉండేది 0.2 శాతమే. కానీ అది తగ్గితే శరీరం పనితీరు దెబ్బతిని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆక్సిజన్: శరీరంలో ఉండే నీటితోపాటు అన్ని జీవ పదార్థాల్లో (ఆర్గానిక్ కాంపౌండ్స్) ఉంటుంది. శ్వాసక్రియ, శక్తి ఉత్పాదనకు కీలకం. కార్బన్: జీవ పదార్థం, డీఎన్ఏలో కీలక మూలకం ఇది. కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, న్యూక్లిక్ ఆమ్లాలు, ప్రొటీన్లు.. ఇలా చాలా వాటిలో ఉంటుంది. అసలు కార్బన్ ఆధారిత పదార్థాల (ఆహారం) నుంచి శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్: జీవ పదార్థం, డీఎన్ఏలో కీలక మూలకమిది. నీటితోపాటు శరీరంలోని దాదాపు అన్ని ఆర్గానిక్ అణువుల్లో హైడ్రోజన్ ఉంటుంది. నైట్రోజన్: జీవానికి మూలమైన జన్యు పదార్థం (డీఎన్ఏ, ఆర్ఎన్ఏ), ఇతర ఆర్గానిక్ కాంపౌండ్స్, ప్రొటీన్లలో నైట్రోజన్ ఉంటుంది. కాల్షియం: శరీరంలో ఎముకలు, దంతాలు, కణాల మధ్య గోడలు (త్వచాలు) దీనితోనే నిర్మితమవుతాయి. ప్రోటీన్ల ఉత్పత్తికీ ఇది కీలకం. ఫాస్పరస్: ఎముకలు, దంతాలు, డీఎన్ఏ, ఏటీపీ ప్రొటీన్‌లో ఫాస్పరస్ ఉంటుంది. జీవం మనుగడకు కీలకమైన మూలకమిది. కొంచెమే అయినా అత్యవసరం.. నాడీ వ్యవస్థ పొటాషియం, సోడియం కీలకం. కణాలు, అవయవాల నుంచి నాడుల ద్వారా మెదడుకు వీటి అయాన్ల రూపంలోనే సమాచార ప్రసారం జరుగుతుంది. ఇక శరీరంలో ద్రవాల సమతుల్యతకు సోడియం, కండరాలు సరిగా పనిచేసేందుకు పొటాషియం అత్యవసరం. ► అత్యంత కీలకమైన అమైనో ఆమ్లాల్లో సల్ఫర్ ఉంటుంది. వెంట్రుకలు, గోర్లు, చర్మంలోని కెరాటిన్‌లో సల్ఫర్ కీలకం. ► రక్తంలోని హిమోగ్లోబిన్లో ఐరన్.. ప్రొటీన్ల తయారీ, రోగనిరోధకశక్తికి మెగ్నీషియం, జింక్ కీలకం. బంగారమూ ఉంటుంది మన శరీరంలో అతి సూక్ష్మ మొత్తంలో బంగారం కూడా ఉంటుంది. 70 కిలోల బరువున్న మనిషిలో సుమారు 0.2 మిల్లీగ్రాముల పుత్తడి ఉంటుందని.. శరీరంలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వేగంగా ప్రయాణించడానికి తోడ్పడుతుందని ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం అణువులెన్నో తెలుసా? సాధారణంగా 70 కిలోల బరువున్న మనిషి శరీరంలో ఏడు ఆక్టేలియన్ల అణువులు ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. (ఒక ఆక్టిలియన్ అంటే పది లక్షల కోట్ల కోట్ల కోట్లు.. సులువుగా చెప్పాలంటే పది పక్కన 27 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య) (చదవండి: సమ్మర్ డేస్: చలువ పందిరి జ్ఞాపకం) -
‘లైట్’ తీస్కోవద్దు..ఎల్ఈడీ.. కీడు!
సాక్షి, హైదరాబాద్ : మీ ఇంట్లో ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తున్నారా.. అయితే, జరభద్రం! వీటిని ఏమాత్రం ‘లైట్’గా తీసుకోకండి! ఈ వెలుగులు శృతిమించితే మిగిలేవి చీకట్లే! ధగధగల వెనుక దడదడ ఉంది.. ఈ కాంతి కాలుష్యం కాటేసే ప్రమాదం పొంచి ఉంది. అవును.. మీరు విన్నది నిజమే! ఎల్ఈడీ దీపాల దు్రష్పభావాలపై భువనేశ్వర్‌కు చెందిన సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్కు చెందిన ప్రొఫెసర్ సిబా ప్రసాద్ మిశ్రా బృందం అధ్యయనం నిర్వహించింది. ఇందులో పలు విస్మయపర్చే విషయాలు వెలుగు చూశాయి. గ్రేటర్‌సిటీలో కాంతికాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని తేలింది. దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ తీవ్రత అత్యధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ అధ్యయన వివరాలు ఇటీవల ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్’అనే పరిశోధన జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. దుష్ప్రభావాలు ఏమిటి..? ఎల్ఈడీ కాంతి కాలుష్యం శృతిమించడం వల్ల సిటీజన్లు నిద్రలేమి, స్థూలకాయం, డిప్రెషన్, చక్కెర వ్యాధి తదితర జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నారు. మానవాళితోపాటు ఇతర జీవరాశుల్లోనూ విపరిణామాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఛత్వారం వస్తుంది. కంటిచూపు దెబ్బతింటుంది. పాదచారులు, వాహనచోదకులు ఒక చోటు నుంచి మరోచోటుకు ప్రయాణించే సమయంలో కంటిచూపులో స్పష్టత కోల్పోయి తరచూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అత్యధిక కాలం ఎల్ఈడీ కాంతులను చూసేవాళ్లు సమీప భవిష్యత్‌లో రంగులను గుర్తించే విజన్ సామర్థ్యాన్ని సైతం కోల్పోయే ప్రమాదముందని కంటి వైద్య నిపుణుడు శ్రీకాంత్ ‘సాక్షి’కి తెలిపారు. ఏ నగరంలో కాంతితీవ్రత ఎంత? గ్రేటర్ హైదరాబాద్‌లో ఎల్ఈడీ విద్యుత్ ధగధగలు వెదజల్లుతున్న కాంతి తీవ్రత 7,790 యూనిట్లుగా ఉంది. ఈ తీవ్రతను ప్రతి చదరపు మీటర్‌స్థలంలో విరజిమ్మే కాంతి తీవ్రత ఆధారంగా లెక్కిస్తారు. ఈ విషయంలో మన గ్రేటర్ సిటీ తరవాత కోల్‌కతా రెండోస్థానంలో నిలిచింది. ఈ సిటీలో 7,480 యూనిట్ల కాంతితీవ్రత ఉంది. మూడోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలో 7,270 యూనిట్ల కాంతి తీవ్రత నమోదైంది. భువనేశ్వర్‌లో అత్యల్పంగా 2,910 యూనిట్లుగా కాంతి తీవ్రత నమోదవడం గమనార్హం. ఈ తీవ్రతను 2014–ఆగస్టు 2019 మధ్యకాలంలో లెక్కించినట్లు తెలిపారు. హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌లో కాంతి తీవ్రత ఈ మధ్యకాలంలో 102.23 శాతం మేర పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది. పశు,పక్ష్యాదులకూ గడ్డుకాలమే.. ఎల్ఈడీ కృత్రిమకాంతులు మానవాళికే కాదు పెంపుడు జంతువులు, పక్షుల జీవనశైలిని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా పక్షులు తమ మనుగడ కోసం ఒక చోటు నుంచి మరోచోటుకు వలసపోయే సమయంలో అత్యధిక కాంతుల బారిన పడినప్పుడు దారితప్పుతున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. కప్పలు సైతం వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. గబ్బిలాలు ఈ కాంతి బారినపడినప్పుడు భౌతిక ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ అత్యధిక కాంతుల బారిన పడిన జంతువులు అధిక దూరం ప్రయాణించేందుకు బెంబేలెత్తే పరిస్థితి తలెత్తుతోంది. అత్యధిక విద్యుత్ కాంతులు, కృత్రిమ కాంతులు, భారీ విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేసే సమయంలో ప్రభుత్వం తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మహబూబ్‌నగర్: ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మయూరీ నర్సరీ (హరితవనం)లో ఆదివారం యోగా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే యోగా అభ్యాసకులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. యోగాతో దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతున్నాయని, ప్రతిఒక్కరూ గంటసేపు యోగా చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ శివారులో ఆహ్లాదకరమైన వాతావరణంలో మయూరీ నర్సరీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నర్సరీలో యోగా అభ్యాసకుల కోసం ప్రత్యేకంగా యోగా సెంటర్‌ను నిర్మించామన్నారు. నర్సరీని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఒక మాడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో పలువురు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు.