‘లైట్‌’ తీస్కోవద్దు..ఎల్‌ఈడీ.. కీడు! | LED Lightning May Affect Human Health Says A Report | Sakshi
Sakshi News home page

‘లైట్‌’ తీస్కోవద్దు..ఎల్‌ఈడీ.. కీడు!

Sep 30 2019 3:43 AM | Updated on Sep 30 2019 10:27 AM

LED Lightning May Affect Human Health Says A Report - Sakshi

‘లైట్‌’గా తీసుకోకండి! ఈ వెలుగులు శృతిమించితే మిగిలేవి చీకట్లే! ధగధగల వెనుక దడదడ ఉంది.. ఈ కాంతి కాలుష్యం కాటేసే ప్రమాదం పొంచి ఉంది.

సాక్షి, హైదరాబాద్‌ : మీ ఇంట్లో ఎల్‌ఈడీ లైట్లు వినియోగిస్తున్నారా.. అయితే, జరభద్రం! వీటిని ఏమాత్రం ‘లైట్‌’గా తీసుకోకండి! ఈ వెలుగులు శృతిమించితే మిగిలేవి చీకట్లే! ధగధగల వెనుక దడదడ ఉంది.. ఈ కాంతి కాలుష్యం కాటేసే ప్రమాదం పొంచి ఉంది. అవును.. మీరు విన్నది నిజమే! ఎల్‌ఈడీ దీపాల దు్రష్పభావాలపై భువనేశ్వర్‌కు చెందిన సెంచూరియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ సిబా ప్రసాద్‌ మిశ్రా బృందం అధ్యయనం నిర్వహించింది.

ఇందులో పలు విస్మయపర్చే విషయాలు వెలుగు చూశాయి. గ్రేటర్‌సిటీలో కాంతికాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని తేలింది. దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ తీవ్రత అత్యధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ అధ్యయన వివరాలు ఇటీవల ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌’అనే పరిశోధన జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి.  

దుష్ప్రభావాలు ఏమిటి..? 
ఎల్‌ఈడీ కాంతి కాలుష్యం శృతిమించడం వల్ల సిటీజన్లు నిద్రలేమి, స్థూలకాయం, డిప్రెషన్, చక్కెర వ్యాధి తదితర జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నారు. మానవాళితోపాటు ఇతర జీవరాశుల్లోనూ విపరిణామాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఛత్వారం వస్తుంది. కంటిచూపు దెబ్బతింటుంది. పాదచారులు, వాహనచోదకులు ఒక చోటు నుంచి మరోచోటుకు ప్రయాణించే సమయంలో కంటిచూపులో స్పష్టత కోల్పోయి తరచూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అత్యధిక కాలం ఎల్‌ఈడీ కాంతులను చూసేవాళ్లు సమీప భవిష్యత్‌లో రంగులను గుర్తించే విజన్‌ సామర్థ్యాన్ని సైతం కోల్పోయే ప్రమాదముందని కంటి వైద్య నిపుణుడు శ్రీకాంత్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

ఏ నగరంలో కాంతితీవ్రత ఎంత? 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ విద్యుత్‌ ధగధగలు వెదజల్లుతున్న కాంతి తీవ్రత 7,790 యూనిట్లుగా ఉంది. ఈ తీవ్రతను ప్రతి చదరపు మీటర్‌స్థలంలో విరజిమ్మే కాంతి తీవ్రత ఆధారంగా లెక్కిస్తారు. ఈ విషయంలో మన గ్రేటర్‌ సిటీ తరవాత కోల్‌కతా రెండోస్థానంలో నిలిచింది. ఈ సిటీలో 7,480 యూనిట్ల కాంతితీవ్రత ఉంది. మూడోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలో 7,270 యూనిట్ల కాంతి తీవ్రత నమోదైంది. భువనేశ్వర్‌లో అత్యల్పంగా 2,910 యూనిట్లుగా కాంతి తీవ్రత నమోదవడం గమనార్హం. ఈ తీవ్రతను 2014–ఆగస్టు 2019 మధ్యకాలంలో లెక్కించినట్లు తెలిపారు. హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌లో కాంతి తీవ్రత ఈ మధ్యకాలంలో 102.23 శాతం మేర పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది. 

పశు,పక్ష్యాదులకూ గడ్డుకాలమే.. 
ఎల్‌ఈడీ కృత్రిమకాంతులు మానవాళికే కాదు పెంపుడు జంతువులు, పక్షుల జీవనశైలిని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా పక్షులు తమ మనుగడ కోసం ఒక చోటు నుంచి మరోచోటుకు వలసపోయే సమయంలో అత్యధిక కాంతుల బారిన పడినప్పుడు దారితప్పుతున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. కప్పలు సైతం వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. గబ్బిలాలు ఈ కాంతి బారినపడినప్పుడు భౌతిక ఒత్తిడికి గురవుతున్నాయి.

ఈ అత్యధిక కాంతుల బారిన పడిన జంతువులు అధిక దూరం ప్రయాణించేందుకు బెంబేలెత్తే పరిస్థితి తలెత్తుతోంది. అత్యధిక విద్యుత్‌ కాంతులు, కృత్రిమ కాంతులు, భారీ విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేసే సమయంలో ప్రభుత్వం తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement