యాదాద్రికి ఎల్‌ఈడీ వెలుగులు  

Led Lights To Yadadri  - Sakshi

సుమారు రూ.50లక్షల వ్యయం

ఇటలీలో ప్రత్యేకంగా తయారీ

ఆలయానికి మరో ఆకర్షణగా విద్యుత్‌ వెలుగులు

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం రెండో ఘాట్‌లో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ ఎల్‌ఈడీ లైట్లు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఆకర్షణగా మారాయి. వీటిని ఏర్పాటుకు రూ.50లక్షలను వెచ్చించినట్లు అధికారులు తెలిపా రు. వీటిని యాదాద్రి దేవస్థానంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇటలీకి చెందిన నీరీ అనే సంస్థకు అప్పగించారు.

సుమారు ఆరు నెలలు కష్టపడి ఈ లైట్లను తయారు చేశారు. రూపుదిద్దుకున్న లైట్లను ఇటలీ నుంచి యాదాద్రికి తీసుకు రావడానికే సుమారు మూడు నెలల సమయం పట్టిందని అధికారులు పేర్కొన్నారు. 

ప్రముఖ ప్రదేశాల్లోనే..

ఇలాంటి ఎల్‌ఈడీ లైట్లను గతంలో తంజావూర్, ఛత్రపతి శివాజీ, బాల్‌ థాక్రే స్మారక స్థూపం, సుప్రింకోర్టు, ఇండియా గేట్, ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ల వద్ద ఏర్పాటు చేసి ప్రశ«ంసలు అందుకున్నామని నీరీ సంస్థ అధికారులు తెలిపారు. వీరికి ఈ లైట్ల తయారీలో 75ఏళ్ల అనుభవం ఉందని అధికారులు చెప్పారు. వీటిని ఏర్పాటు చేసే ప్రదేశాలకు అనుగుణంగా లైట్లను అమర్చడం వారి ప్రత్యేకత. ఉదాహరణకు తిరుపతిలో స్వామివారి తిరునామాల చిత్రాలతో, సుప్రీంకోర్టు వద్ద ధర్మ చక్రం చిత్రంతో,  అదేవిధంగా యాదాద్రిలో లక్ష్మీనారసింహ స్వామి  వారి చిత్రాలతో నిర్మాణం చేయడం ఈ సంస్థ ప్రత్యేకత.

లైట్ల ప్రత్యేకతలు..

క్యాస్‌ ఐరన్‌ అనే లోహంతో లోపల ఒక పైపు, పైన ఒక పైపుతో తయారు చేశారు. రెండో ఘాట్‌ రోడ్డు పక్కన 50 లైట్లను ఏర్పాటు చేశారు. వీటితో భక్తులకు చీకటిలో సైతం పగలుమాదిరిలా వెలుతురు పుష్కలంగా ఉం టుం దని భక్తులు పేర్కొన్నారు. అతి తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుగులు వచ్చే వి ధంగా ఈ లైట్లు ఉపయోగపడుతున్నాయని ఎస్‌సీ లింగారెడ్డి, ఈఈ రామారావు అంటున్నారు.    

ప్రమాదాల నివారణ.. 

రాత్రి వేళ ఎక్కువ వెలుగులు రావడంతో ప్రమాదాల నివారణకు కూడా దోహదం చేస్తున్నాయని అధికారులు అంటున్నారు. ఆలయానికి కాలినడకన వచ్చే భక్తులు భయంలేకుండా స్వామి వారి సన్నిధికి చేరుకోవచ్చని సిబ్బంది పేర్కొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top