మీ బాడీలో ఏమున్నాయో తెలుసా? మన బరువులో.. ఏ మూలకం ఎంత? | Human Body Elements Know How Many Elements Are There The Full Details | Sakshi
Sakshi News home page

మీ బాడీలో ఏమున్నాయో తెలుసా? మన బరువులో.. ఏ మూలకం ఎంత?

Apr 17 2022 10:03 AM | Updated on Apr 17 2022 1:21 PM

Human Body Elements Know How Many Elements Are There The Full Details - Sakshi

ప్రతిదీ ఈ 118 మూలకాలతోనే తయారై ఉంటుంది. వేర్వేరు వస్తువుల్లో వేర్వేరు మూలకాలు ఉంటాయి. అదే చెట్లు, జంతువులు, ఇతర జీవజాలంలో మాత్రం ప్రధానంగా ఉండేవి నాలుగు మూలకాలే. మరికొన్ని..

హైడ్రోజన్, ఆక్సిజన్‌ కలిస్తే నీళ్లు.. సోడియం, క్లోరిన్‌ కలిస్తే ఉప్పు.. ఐరన్, కార్బన్‌ కలిస్తే ఉక్కు.. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతిదీ వివిధ మూలకాల కలయికే. రాళ్లు, రప్పలు, వస్తువులే కాదు.. జీవులన్నీ కూడా రసాయన పదార్థాల సమ్మేళనమే. మరి మనం.. అంటే మనుషులం ఏ మూలకాలతో తయారయ్యాం? ఏమేం ఉంటాయి? ఎంతమేర ఉంటాయో తెలుసుకుందామా..                 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

118 మూలకాలున్నా.. 
ఇప్పటివరకు భూమ్మీద 118 మూలకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో కొన్ని విస్తారంగా ఉంటే.. మరికొన్ని మూలకాలు చాలా అరుదుగా లభిస్తాయి. భూమిపై మట్టి, నీళ్లు, గాలి, చెట్లు, జంతువులు, ఇళ్లు, వాహనాలు, వస్తువులు, మన ఫోన్లు.. ఇలా మనతోపాటు చుట్టూ ఉన్న ప్రతిదీ ఈ 118 మూలకాలతోనే తయారై ఉంటుంది. వేర్వేరు వస్తువుల్లో వేర్వేరు మూలకాలు ఉంటాయి. అదే చెట్లు, జంతువులు, ఇతర జీవజాలంలో మాత్రం ప్రధానంగా ఉండేవి నాలుగు మూలకాలే. మరికొన్ని మూలకాలు నామమాత్రస్థాయిలో ఉంటాయి. 
(చదవండి: పిల్లులూ పేర్లు గుర్తిస్తాయ్‌)

లెక్కిస్తే.. హైడ్రోజన్‌ టాప్‌ 
మన శరీరంలో బరువుపరంగా ఆక్సిజన్‌ టాప్‌ అయినా.. పరమాణువుల సంఖ్య లెక్కన చూస్తే హైడ్రోజన్‌ శాతం చాలా ఎక్కువ. మన శరీర బరువులో నీటి శాతమే ఎక్కువ. రెండు హైడ్రోజన్, ఒక ఆక్సిజన్‌ పరమాణువులు కలిస్తే ఒక నీటి అణువు ఏర్పడుతుంది. అంటే ఆక్సిజన్‌ కంటే హైడ్రోజన్‌ రెండు రెట్లు ఎక్కువ. 

► కానీ హైడ్రోజన్‌ పరమాణువు బరువు చాలా తక్కువ. 16 హైడ్రోజన్‌ పరమాణువులు కలిస్తే.. ఒక్క ఆక్సిజన్‌ పరమాణువు అంత అవుతాయి.  

నాలుగింటితోనే .. 
ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్‌.. మన శరీరంలో 97 శాతం బరువు ఈ నాలుగు మూలకాలదే. అందులోనూ సగానికిపైగా బరువు ఒక్క ఆక్సిజన్‌దే కావడం విశేషం. 
► నిజానికి మన శరీరంలో 60 శాతం నీళ్లే. ఆక్సిజన్, హైడ్రోజన్‌ మూలకాలు కలిసి ఏర్పడేవే నీళ్లు. దీనికితోడు శరీరంలోని అన్ని కణాలు, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాల్లో ఆక్సిజన్‌ ఉంటుంది. ఇలా అన్నింటిలో కలిపితే శరీర బరువులో 65 శాతం ఆక్సిజనే. 

ఏ మూలకం.. ఎందుకోసం? 
మన శరీరం ప్రధానంగా నాలుగు మూలకాలతోనే నిర్మితమైనా.. మరికొన్ని మూలకాలు కూడా అత్యంత కీలకం. ఉదాహరణకు మన శరీరబరువులో సోడియం ఉండేది 0.2 శాతమే. కానీ అది తగ్గితే శరీరం పనితీరు దెబ్బతిని ఆరోగ్య సమస్యలు వస్తాయి.  

ఆక్సిజన్‌: శరీరంలో ఉండే నీటితోపాటు అన్ని జీవ పదార్థాల్లో (ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌) ఉంటుంది. శ్వాసక్రియ, శక్తి ఉత్పాదనకు కీలకం. 
కార్బన్‌: జీవ పదార్థం, డీఎన్‌ఏలో కీలక మూలకం ఇది. కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, న్యూక్లిక్‌ ఆమ్లాలు, ప్రొటీన్లు.. ఇలా చాలా వాటిలో ఉంటుంది. అసలు కార్బన్‌ ఆధారిత పదార్థాల (ఆహారం) నుంచి శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. 
హైడ్రోజన్‌: జీవ పదార్థం, డీఎన్‌ఏలో కీలక మూలకమిది. నీటితోపాటు శరీరంలోని దాదాపు అన్ని ఆర్గానిక్‌ అణువుల్లో హైడ్రోజన్‌ ఉంటుంది. 
నైట్రోజన్‌: జీవానికి మూలమైన జన్యు పదార్థం (డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ), ఇతర ఆర్గానిక్‌ కాంపౌండ్స్, ప్రొటీన్లలో నైట్రోజన్‌ ఉంటుంది. 
కాల్షియం: శరీరంలో ఎముకలు, దంతాలు, కణాల మధ్య గోడలు (త్వచాలు) దీనితోనే నిర్మితమవుతాయి. ప్రోటీన్ల ఉత్పత్తికీ ఇది కీలకం. 
ఫాస్పరస్‌: ఎముకలు, దంతాలు, డీఎన్‌ఏ, ఏటీపీ ప్రొటీన్‌లో ఫాస్పరస్‌ ఉంటుంది. జీవం మనుగడకు కీలకమైన మూలకమిది. 

కొంచెమే అయినా అత్యవసరం.. 
నాడీ వ్యవస్థ పొటాషియం, సోడియం కీలకం. కణాలు, అవయవాల నుంచి నాడుల ద్వారా మెదడుకు వీటి అయాన్ల రూపంలోనే సమాచార ప్రసారం జరుగుతుంది. ఇక శరీరంలో ద్రవాల సమతుల్యతకు సోడియం, కండరాలు సరిగా పనిచేసేందుకు పొటాషియం అత్యవసరం. 
► అత్యంత కీలకమైన అమైనో ఆమ్లాల్లో సల్ఫర్‌ ఉంటుంది. వెంట్రుకలు, గోర్లు, చర్మంలోని కెరాటిన్‌లో సల్ఫర్‌ కీలకం.  
► రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఐరన్‌.. ప్రొటీన్ల తయారీ, రోగనిరోధకశక్తికి మెగ్నీషియం, జింక్‌ కీలకం.  

బంగారమూ ఉంటుంది 
మన శరీరంలో అతి సూక్ష్మ మొత్తంలో బంగారం కూడా ఉంటుంది. 70 కిలోల బరువున్న మనిషిలో సుమారు 0.2 మిల్లీగ్రాముల పుత్తడి ఉంటుందని.. శరీరంలో ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌ వేగంగా ప్రయాణించడానికి తోడ్పడుతుందని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  

మొత్తం అణువులెన్నో తెలుసా?
సాధారణంగా 70 కిలోల బరువున్న మనిషి శరీరంలో ఏడు ఆక్టేలియన్ల అణువులు ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. (ఒక ఆక్టిలియన్‌ అంటే పది లక్షల కోట్ల కోట్ల కోట్లు.. సులువుగా చెప్పాలంటే పది పక్కన 27 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య)
(చదవండి: సమ్మర్‌ డేస్‌: చలువ పందిరి జ్ఞాపకం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement