వాన కాదు.. రైళ్లకు గాలే శత్రువు | Indian Railways cancels trains as Cyclone Murasu approaches | Sakshi
Sakshi News home page

వాన కాదు.. రైళ్లకు గాలే శత్రువు

Nov 4 2026 6:05 AM | Updated on Nov 4 2026 6:05 AM

Indian Railways cancels trains as Cyclone Murasu approaches

తుపానుల వేళ పెనుగాలుల భయంతోనే రైళ్ల రద్దు 

90 కి.మీ.కిపైగా వేగంతో గాలులొస్తే ఎక్కడి రైళ్లు అక్కడే.. 

లేకుంటే విద్యుత్‌ టవర్లు వంగిపోయి రైళ్లకు కరెంటు సరఫరా నిలిచే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: తుపానులు, అతిభారీ వర్షాలప్పుడు ముందుజాగ్రత్త చర్యగా రైల్వేశాఖ వందలాది రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేస్తుంటుంది. అయితే భారీ వర్షాల కారణంగానే రైళ్లను నిలిపేశారని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవానికి భారీ వర్షాలకు బదులు గంటకు సుమారు 100 కి.మీ. నుంచి 130 కి.మీ. వేగంతో వీచే పెనుగాలులను దృష్టిలో ఉంచుకొనే రైళ్ల రాకపోకలను నిలిపేస్తారు. ఏపీలో ఇటీవలి అర్నబ్, తాజాగా మురసు తుపాన్ల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే.. రైళ్లకు వాన కాదు, గాలే శత్రువు.  

ట్రాక్షన్‌ టవర్లను వంచేసే గాలులు.. 
దేశంలో 96 శాతం విద్యుత్‌ రైళ్లే పరుగుపెడుతున్నాయి. 99 శాతం ట్రాక్‌ విద్యుదీకరణ పూర్తయింది. పట్టాల చుట్టూ ట్రాక్షన్‌ టవర్లు ఏర్పాటు చేసి 25 కిలోవోల్ట్స్‌ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. రైలు ఇంజన్‌పై యాంటెనా తరహాలో ఉండే పాంటోగ్రాఫ్‌ పరికరం నిరంతరం ఈ విద్యుత్‌ వైరును తాకుతూ ఉండటం వల్ల దాని ద్వారా ఇంజన్‌కు విద్యుత్‌ సరఫరా అవుతుంది. అయితే పెనుగాలులు వీచినప్పుడు విద్యుత్‌ టవర్లు ఒకవైపు వంగి విద్యుత్‌ తీగలు పక్కకు జరుగుతాయి. అప్పుడు ఫాంటోగ్రాఫ్‌కు ఆ తీగలు తగలక ఇంజన్‌కు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది.

అదే సమయంలో మంటలు ఎగిసిపడి పాంటోగ్రాఫ్‌ కరిగిపోతుంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా ఆ సెక్షన్‌లో రైళ్లను భద్రమైన స్టేషన్‌లలోనే నిలిపేస్తారు. ఈ సమస్య కేవలం చిన్న స్తంభాలతోనే ముగిసిపోదు. రైలు మార్గాల పక్కన వందలాది కిలోవాట్ల విద్యుత్‌ను మోసుకెళ్లే భారీ ట్రాక్షన్‌ టవర్లు, సబ్‌స్టేషన్లు ఉంటాయి. సుడిగాలుల తీవ్రతకు ఈ భారీ టవర్లు వంగిపోయి రైళ్లపై లేదా ట్రాక్‌లపై కూలిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించొచ్చు. అలాగే గాలి వేగానికి పట్టాల పక్కన ఉండే చెట్లు, ప్రయాణికుల షెడ్ల రేకులు, ప్రకటనల హోర్డింగులు ఎగిరివచ్చి ఓహెచ్‌ఈ వైర్లపై పడి గ్రిడ్‌ మొత్తం ట్రిప్‌ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.  

గాలుల వేగం ఆధారంగా రైళ్ల రాకపోకలపై నిర్ణయం  
గంటకు 50 నుంచి 71 కి.మీ. వేగంతో గాలులు వీస్తే రైల్వే యంత్రాంగం మొదటి హెచ్చరికను జారీ చేస్తుంది. దీంతో లోకో పైలట్లు గాలి తీవ్రత ఆధారంగా రైళ్ల వేగాన్ని తగ్గించి నడుపుతారు. ఒకవేళ గాలి వేగం గంటకు 72 కి.మీ.కన్నా ఎక్కువైతే ఆ మార్గంలో రైళ్ల రాకపోకలతోపాటు ఓహెచ్‌ఈ లైన్లకు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తారు. ఇక తుపాన్లు తీరం దాటే సమయంలో గాలి వేగం 100–150 కి.మీ. మేర ఉండొచ్చని వాతావరణ శాఖ ప్రకటిస్తే రైల్వే శాఖ 24 గంటల నుంచి 48 గంటల ముందే ఆయా మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తుంది. తమిళనాడులోని పంబన్‌ సముద్ర వంతెనపై మాత్రం ప్రమాద తీవ్రత ఎక్కువ కాబట్టి అక్కడ గాలి వేగం గంటకు 58 కి.మీ. దాటగానే రైళ్లను ఆపేస్తారు. 

వర్షం ఎప్పుడు ప్రమాదకరం? 
మెరుపు వరదలు వచ్చినప్పుడే వర్షం వల్ల పట్టాలకు ముప్పు ఏర్పడుతుంది. గతేడాది భారీ వర్షాలకు కేసముద్రం సమీపంలో చెరువు కట్టకు గండి పడి రైల్వే ట్రాక్‌ కింద మట్టి కట్ట కొట్టుకుపోయింది. దీంతో రైళ్లను ఆపేశారు. కానీ మెరుపు వరద లేకుండా భారీ వర్షం కురిసినా రైళ్ల పరుగుకు ఎలాంటి అంతరాయం ఉండదు. అవి కొంత వేగం తగ్గించి పరుగు కొనసాగిస్తాయి. తాజా మురసు తుపాను వల్ల 29 రైళ్లు రద్దయ్యాయి. కారవడి ప్రాంతంలో ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఆ సెక్షన్‌లో పూర్తిగా రైళ్లను నిలిపేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement