జిల్లాకో పంచాయితీ! | Internal differences within Telangana Congress | Sakshi
Sakshi News home page

జిల్లాకో పంచాయితీ!

Nov 4 2026 5:33 AM | Updated on Nov 4 2026 5:33 AM

Internal differences within Telangana Congress

అధికార కాంగ్రెస్‌ పార్టీలో అంతర్యుద్ధం

మంత్రులు వర్సెస్‌ ఎమ్మెల్యేలు, కొన్నిచోట్ల మంత్రుల మధ్య కొరవడిన సఖ్యత  

పరస్పరం, ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెడుతున్న వైనం 

పెద్దపల్లిలో ఎంపీ వంశీకృష్ణ వర్సెస్‌ ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు 

ఢిల్లీ హోటల్‌ లాబీలో సంగారెడ్డి రగడ..నల్లగొండలో తగ్గని రాజగోపాల్‌రెడ్డి 

పనులు జరగడం లేదంటూ అనిరుధ్‌రెడ్డి ఆగ్రహం 

ఖమ్మంలో ముగ్గురు మంత్రులు.. మూడు దారులు 

వరంగల్‌లో ఎమ్మెల్యేలతో పంచాయితీతోనే మంత్రి పదవి కోల్పోయిన కొండా సురేఖ

సాక్షి, హైదరాబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఆయా నేతలు బాహాటంగానే గళం విప్పుతుండటం అంతర్యుద్ధాన్ని స్పష్టం చేస్తోంది. పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు పడటం లేదు. ఒకటి రెండు జిల్లాల్లో మంత్రుల మధ్య సఖ్యత లేదు. వివిధ కారణాలతో అసంతృప్తితో ఉన్నవారు ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెడుతున్నారు. కొందరు తమ నియోజకవర్గాలకు నిధులు రావడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్లమెంట్‌ నియోజకవర్గంలో మంత్రులకు, ఎంపీకి మధ్య ఏమాత్రం సయోధ్యలేదని పలు సంఘటనలు బహిర్గతం చేసు్తన్నాయి. తాజాగా హస్తినలో ఇలాంటి పంచాయితీ ఒకటి చోటు చేసుకోవడం చర్చనీయాంశమయ్యింది. 

రాజనర్సింహ వర్సెస్‌ తోట లక్ష్మీకాంతరావు 
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య ఢిల్లీలోని ఓ హోటల్‌ లాబీలో వివాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తాను ప్రతిపాదించిన వ్యక్తికి కాకుండా మరొకరికి ఎమ్మెల్యే మద్దతిచ్చారని ఎమ్మెల్యేపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మంత్రి తనను తీవ్ర పదజాలంతో దూషించి, భౌతికంగా దాడి చేస్తానని బెదిరించారని ఆరోపిస్తున్న లక్ష్మీకాంతరావు, ఈ విషయాన్ని ఆయన ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన స్వయంగా మీడియాకు తెలిపారు. అయితే దీనిపై మంత్రి దామోదర రాజనర్సింహ.. జరిగింది ఒకటైతే జరిగే ప్రచారం మరోలా ఉందంటూ స్పందించడం గమనార్హం.  

మంచిర్యాలలో 2 సెగ్మెంట్లకే పరిమితమైన వివేక్‌  
పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయిందని అంటున్నారు. మంత్రి వివేక్‌ కుటుంబానిది ఒక వర్గమైతే, మంత్రి శ్రీధర్‌బాబుది మరో వర్గమన్నట్టుగా ఉందని చెబుతున్నారు. ఈ లోక్‌సభా స్థానానికి మంత్రి వివేక్‌ కుమారుడు గడ్డం వంశీకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో చెన్నూరు నుంచి మంత్రి వివేక్, బెల్లంపల్లి నుంచి ఆయన సోదరుడు వినోద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని మరో ఇద్దరు మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్‌సింగ్, ప్రేంసాగర్‌రావులు ఎంపీతో సంబంధం లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

చివరికి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి అసెంబ్లీ సెగ్మెంట్లలో అభివృద్ధి పనులకు కూడా ఎమ్మెల్యేలు ముందుకు రావడం లేదంటే విభేదాలు ఏస్థాయికి చేరాయో తెలుస్తోంది. ఇక మంత్రి వివేక్‌ ప్రభావం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకే పరిమితమైందన్న చర్చ సాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి పర్యటనలో చెన్నూరులో ప్రేమ్‌సాగర్‌ రావు ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టడంపై ఆగ్రహించిన వివేక్‌.. ఎంపీ వంశీకృష్ణతో కలిసి రామగుండం సభా వేదిక నుంచి వెళ్లిపోయారు. మంచిర్యాలలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి శంకుస్థాపనకు ఎంపీ, వివేక్, వినోద్‌లను ఆహా్వనించకపోవడం ప్రోటోకాల్‌ వివాదానికి దారితీసింది.

తాజాగా దండేపల్లి మండలం గూడెంలో స్కూల్‌ బ్యాగుల పంపిణీ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలను ప్రేమ్‌సాగర్‌ రావు అనుచరులు చించివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా ఢిల్లీ సభకు మంత్రి శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కన్‌ సింగ్‌ గైర్హాజరు కావడంతో ఈ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవద్దని, సస్పెండ్‌ చేయవద్దంటూ ఎంపీ వంశీకృష్ణ వ్యంగ్యంగా మంత్రి శ్రీధర్‌బాబుకు లేఖ రాయడం గమనార్హం. కాగా మంత్రికి లేఖ రాయడం వెనుక ముఖ్యనేత అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

వేడి రాజేస్తున్న రాజగోపాల్‌ రెడ్డి 
ఉమ్మడి నల్లగొండ నుంచి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మంత్రులుగా కొనసాగుతుండగా, వెంకట్‌ రెడ్డి సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి కోసం ప్రభుత్వంపై ఒకరకంగా యుద్ధమే ప్రకటించారు. పార్టీలో చేరినప్పుడు, పార్లమెంట్‌ ఎన్నికల ముందు రెండుసార్లు మంత్రి పదవి హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదన్నది ఆయన ఆరోపణ. తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు, 11 మంది ఎమ్మెల్యేలున్న నల్లగొండకు ఎందుకు మరో మంత్రి పదవి ఇవ్వరని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై బాహాటంగా విమర్శలు చేశారు. ఆయన హుజూర్‌నగర్‌కే మంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ జిల్లా కలెక్టర్‌ సమక్షంలోనే చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా చౌటుప్పల్‌లో కార్యకర్తలతో మాట్లాడుతూ, పంచాయతీ కార్యదర్శి నుంచి చీఫ్‌ సెక్రటరీ వరకు పని జరగాలంటే లంచం ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించినట్లుగా అందుతున్న సమాచారం కలకలం సృష్టిస్తోంది. 

అనిరుధ్‌ ఆమరణ దీక్ష హెచ్చరిక  
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి కూడా సొంత ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పాత పాలమూరు జిల్లాకు చెందిన ఆయన..సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో రూ.40 కోట్ల అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ బిల్లులు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే బిల్లులు క్లియర్‌ చేస్తే, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటని ఆయన నిలదీయడం పార్టీలో చర్చనీయాంశమయ్యింది. అన్ని నియోజకవర్గాల్లో సమానంగా అభివృద్ధి జరిగితేనే ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఖమ్మంలో ఎవరికి వారే..  
రాష్ట్ర మంత్రివర్గంలో అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. ముగ్గురు మంత్రులు.. మూడు క్యాంపులుగా జిల్లా కాంగ్రెస్‌ చీలిపోయిందని అంటున్నారు. పదవుల పందేరంలో భట్టి, పొంగులేటి మాటే చెల్లుబాటు అవుతుండగా, పదవులన్నీ ఆ రెండు వర్గాలే దక్కించుకుంటున్నాయని తుమ్మల అనుచరులు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు వేర్వేరుగా జిల్లా పర్యటనలు, సమీక్షలు చేస్తుండటంతో అధికారులు ఏర్పాట్లతో సతమతమవుతుండగా, జిల్లా పార్టీలో సమన్వయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

మరికొన్ని జిల్లాల్లో.. 
వరంగల్‌ జిల్లాలో మంత్రిగా కొనసాగిన కొండా సురేఖకు..ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలతో నెలకొన్న విభేదాలు అధిష్టానం వరకు చేరాయి. దానికి తోడు సురేఖ కూతురు చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో చివరకు ఆమె సెపె్టంబర్‌లో ఏకంగా మంత్రివర్గం నుంచే వైదొలగాల్సి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జిల్లా నేతల నుంచి సహకారం కరువైంది. హుస్నాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను సిద్దిపేట జిల్లా నేతగానే పరిగణిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌కు ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో, మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు పోటీ పడుతూ వర్గాలుగా విడిపోయారు.

గత విస్తరణలోనూ బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డికి నిరాశే ఎదురవగా, ఆయనను బుజ్జగించేందుకు ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఖాళీ అయిన సురేఖ స్థానంతో పాటు మరో రెండు మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, నానుస్తుండడం కూడా ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పోస్టులు కూడా భర్తీ కాకపోవడం, ఎప్పటికప్పుడు నేడు, రేపు అన్నట్టుగా ఊరిస్తుండటం, మరో ఏడాది గడిస్తే ఎన్నికల సంవత్సరం వస్తుండడంతో శాసనసభ్యుల్లో అసంతృప్తి, అసహనం కొట్టొచి్చనట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలే పేర్కొంటుండటం గమనార్హం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement