ఇంటి నుంచే లెర్నర్స్‌ లైసెన్స్‌! | Learner license from home: Telangana | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచే లెర్నర్స్‌ లైసెన్స్‌!

Nov 3 2026 6:14 AM | Updated on Nov 3 2026 6:14 AM

Learner license from home: Telangana

వెబ్‌కామ్‌ ద్వారా ఏఐ ఆధారిత పర్యవేక్షణలో ఆన్‌లైన్‌ పరీక్ష

దరఖాస్తు వేళ ఇచ్చిన ఫొటోతో మొహం సరిపోలితేనే.. 

ఐదుసార్లు నవ్వడం, కంటిరెప్ప ఆడించడం తప్పనిసరి 

రెండో వ్యక్తి స్క్రీన్‌లో కనిపిస్తే పరీక్ష రద్దు 

ఉత్తీర్ణులైతే మొబైల్‌ ఫోన్‌కే లైసెన్స్‌ పీడీఎఫ్‌ 

కేంద్ర ప్రభుత్వ సారథి పోర్టల్‌ ద్వారా కొత్త విధానం 

మరో వారం రోజుల్లో అమలు చేయనున్న రవాణాశాఖ

సాక్షి, హైదరాబాద్‌: రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌పై ఫేస్‌ రికగ్నిషన్‌తో ఆన్‌లైన్‌ పరీక్ష రాసి లెర్నర్స్‌ లైసెన్స్‌ పొందే వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సారథి పోర్టల్‌లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘సారథి’లో చేరడంతో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రారంభించనుంది. 

చాలా జాగ్రత్తలతో...: ఇంటి నుంచి రాసే పరీక్షే కదా.. పక్కన పుస్తకాలు పెట్టుకోవచ్చు లేదా వేరే వాళ్లను కూర్చోబెట్టవచ్చని అనుకుంటే దొరికిపోయేలా దీన్ని రూపొందించారు. ఇందుకోసం ‘సారథి’సిస్టమ్‌లో అత్యంత పటిష్టమైన ఏఐ సెక్యూరిటీ ఫీచర్లను నిక్షిప్తం చేశారు. ఇప్పటివరకు ఉన్న పద్ధతి ప్రకారం రవాణాశాఖ పోర్టల్‌లో ఫీజు చెల్లించి నిర్ణీత తేదీకి స్లాట్‌ బుక్‌ చేసుకొని ఆర్టీఏ ఆఫీసుకు వెళ్తే అక్కడి కంప్యూటర్‌లో పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే లైసెన్సు జారీ అవుతుంది. ఇప్పుడు నిర్ధారిత స్లాట్‌ ఆధారంగా ఫీజు చెల్లించి ఆ రోజు ఇంటి నుంచే పరీక్షకు హాజరు కావచ్చు.

 పరీక్ష కోసం లాగిన్‌ కాగానే వెబ్‌క్యామ్‌ ద్వారా ఏఐ సాంకేతికత అభ్యర్థి ముఖాన్ని స్కాన్‌ చేస్తుంది. దరఖాస్తులో ఇచ్చిన ఫొటోతో ఇది వంద శాతం మ్యాచ్‌ అయితేనే ముందుకు వెళ్తుంది. అలాగే అభ్యర్థి బతికున్నాడా లేక కెమెరా ముందు ఏదైనా ఫొటో పెట్టారా అని తనిఖీ చేసేందుకు పరీక్షా సమయం ముందు ఐదుసార్లు నవ్వాలని.. ఐదుసార్లు కంటి రెప్పలు ఆడించాలని కోరుతుంది. ఇవి సరిగ్గా చేస్తేనే స్క్రీన్‌ ఓపెన్‌ అవుతుంది. మొబైల్‌లో పాత వీడియోలు ప్లే చేసినా ఏఐ టెక్నాలజీ కనిపెట్టి పరీక్షను రద్దు చేస్తుంది. ఒకవేళ పరీక్ష రాస్తున్నప్పుడు కెమెరా ఫ్రేమ్‌లోకి మరో వ్యక్తి వచ్చినా లేదా అభ్యర్థి పక్కకు తప్పుకున్నా సిస్టమ్‌ వెంటనే పరీక్షను ఆటోమేటిక్‌గా నిలిపివేసి నిబంధనల ఉల్లంఘన కింద పరిగణిస్తుంది. పరీక్ష రాస్తున్నంత సేపు కంప్యూటర్‌లో గూగుల్‌ సెర్చ్‌ లేదా ఇతర అప్లికేషన్లు, విండోస్‌ ఓపెన్‌ చేయడం కుదరదు. 

ఫేస్‌ రికగ్నిషన్‌ ఫెయిల్‌ అయితే? 
సాంకేతిక లోపాలు, ముఖ కదలికలు మ్యాచ్‌ కాకపోవడం వల్ల ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ విఫలమైతే దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాన్‌–ఈకేవైసీ అప్లికేషన్లకు ఓటీపీ ద్వారా, ఈకేవైసీ అప్లికేషన్లకు బయోమెట్రిక్‌ (వేలిముద్ర) ద్వారా నేరుగా ఆర్టీఓ ఆఫీసులోనే పరీక్ష రాసే బ్యాకప్‌ వెసులుబాటు కూడా కల్పించారు. ఆర్టీఓ అధికారి ఇచ్చే పిన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి అక్కడ పరీక్ష పూర్తి చేయవచ్చు. పరీక్ష పూర్తి కాగానే అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి, పాస్‌ అయ్యారా లేదా అనేది స్క్రీన్‌పై కనిపిస్తుంది. క్వాలిఫయింగ్‌ మార్కులు సాధిస్తే సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా లైసెన్స్‌ను ఆమోదిస్తుంది. అలాగే అభ్యర్థులు డిజిటల్‌ సంతకం, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఒరిజినల్‌ ఎల్‌ఎల్‌ఆర్‌ íపీడీఎఫ్‌ను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement