వాటిని చూసి యువతుల ఎంపిక.. అండాల దందాలోనూ ‘వివక్ష’
వారి ఎత్తు, చదువు, ప్రాంతం ఆధారంగా చెల్లింపులు
దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల నుంచి యువతుల సమీకరణ
రాజధానిలోని 23 ఐవీఎఫ్ కేంద్రాలతో ముఠాకు సంబంధాలు
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ పంకజ్ సోనీ కూడా నిందితుడే
సాక్షి, హైదరాబాద్: పెళ్లి సంబంధాలకు యువతుల ఫొటోలు, కులం, మతం, రంగు, చదువు, ఎత్తు వంటి వివరాలు చూసి ఎంపిక చేసుకోవడం పరిపాటి. కానీ మల్కాజ్‌గిరి పోలీసులకు చిక్కిన అక్రమ అండాల ముఠా అండదాతల ఎంపికలోనూ ఇవే ప్రాధాన్యంగా మారాయి. సంతానం కోసం అండాలు అవసరమైన దంపతులు తమకు కావాల్సిన దాతల అర్హతల వివరాలను ముందుగానే ఈ ముఠాకు చెప్పేవారు. వారి ఆసక్తి, అభిరుచులకు తగ్గ యువతులను దేశవ్యాప్తంగా ఉన్న ఏజెంట్ల నెట్‌వర్క్ ద్వారా ఈ గ్యాంగ్ గుర్తించేది. వారికి ఎర వేసి సేకరించే అండాలనే సరఫరా చేసేది. ఈ వ్యవహారంలో కొందరు యువతులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లిస్తుండగా ప్రత్యేక అర్హతలు, డిమాండ్‌ను బట్టి మరికొందరికి రూ.50 వేల వరకు ఇస్తున్నట్లు మల్కాజిగిరి పోలీసులు గుర్తించారు.
సోషల్‌మీడియా ద్వారా సమాచార మార్పిడి...
నగరంలో వెలుగుచూసిన అక్రమ అండదాన రాకెట్ కేసుల దర్యాప్తులో అనేక ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. వీళ్లు ఏడు రాష్ట్రాల నుంచి యువతుల వివరాలను ఏజెంట్ల ద్వారా సమీకరించే వాళ్లు. ఆ వివరాలను వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్‌మీడియా మార్గాల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్యాంగ్ సభ్యులు పరస్పరం పంచుకునేవాళ్లు. అండదాతలు కావాలని దంపతుల నుంచి సమాచారం అందగానే వారి అవసరాలను నెట్‌వర్క్‌లోని ఏజెంట్లకు చేరవేసేవారు.
కులం, మతం, రంగు, ఎత్తు, ప్రాంతం తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ యువతులను గుర్తించే ఈ ముఠా వారినే ఆయా ఐవీఎఫ్ కేంద్రాలకు తీసుకెళ్లేవారు. ముఖ్యంగా యువతుల చర్మ ఛాయ, ప్రాంతీయ నేపథ్యానికే ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దంపతులు ఎంత నిర్దిష్టమైన అర్హతలు కోరితే అంత ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా ఒక్కో కస్టమర్ నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
23 ఐవీఎఫ్ కేంద్రాలకు పాత్ర...
ఈ రాకెట్ సూత్రధారి అమిత్ శర్మతో పాటు అతని అనుచరులు పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, అస్సాం, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత మహిళల హాస్టళ్ల నిర్వహణ పేరుతో ఈ వ్యవహారాన్ని నడిపారు. వాస్తవానికి ఆయా వసతి గృహాలను కేవలం అండదానం చేయించాల్సిన యువతులను ఉంచేందుకు వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. డబ్బు అవసరమైన మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు ఈ కార్యకలాపాలు సాగించారు.
ఒకసారి అండదానం చేసిన వారి ద్వారా కూడా కొత్త దాతలను గుర్తించడం కూడా ఈ నెట్‌వర్క్‌లో కీలకంగా మారింది. రాజధానిలోని 23 ఐవీఎఫ్ కేంద్రాలతో ఈ నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది వెలుగులోకి వచి్చన అక్రమ సరోగసీ కేంద్రం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ పంకజ్ సోనీ ఈ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. ఐవీఎఫ్ కేంద్రాలు అండదాతల గుర్తింపు, అర్హతలను ఏ మేరకు పరిశీలించాయనే అంశంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి పోలీసులు వివరణ కోరారు. ఏజెంట్ల ద్వారా మహిళలను తీసుకొస్తున్న విషయం కేంద్రాల నిర్వాహకులకు ముందే తెలుసా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు ప్రాంతాల్లో యువతుల గుర్తింపు...
ఈ నెట్‌వర్క్‌ను ఛేదించిన మల్కాజ్‌గిరి పోలీసులు ప్రకాశ్‌నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లోని వసతి గృహాల నుంచి యువతులను రెస్క్యూ చేశారు. వీరిలో పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారని అధికారులు చెప్తున్నారు. వీరి వద్ద నుంచి హ్యూమోగ్ హెచ్‌పీ ఇంజెక్షన్ల వయల్స్, ప్రిమోలట్, మెప్రేట్ మాత్రలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కొందరు మహిళలు, యువతులు పలుమార్లు అండదానం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా వివరాలు సేకరిస్తున్నారు.
నిందితుల బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో అమిత్ శర్మ, నిఖత్ పర్విన్, రేష్మా ఖాతూన్, మేఘావత్ శ్రీనివాస్, జె.ప్రదీప్, ఎస్‌కే పర్విన్, విజయ్ భగ్వాహ్ రావు సాలుంకే, పంకజ్ సోనీలను మల్కాజిగిరి కమిషనరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ అండాల దందా వ్యవహారంపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. ఇతరుల ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం, మనుషుల అక్రమ రవాణా, ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే నిర్లక్ష్య చర్యలు, మోసం, నేరపూరిత కుట్ర, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన ఆరోపణలు చేర్చారు. రెస్క్యూ చేసిన మహిళల ఆరోగ్య పరిస్థితి, వారు గతంలో అండదానం చేసిన సందర్భాలు, ఐవీఎఫ్ కేంద్రాల పాత్ర, నిందితుల ఆర్థిక లావాదేవీలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


