బియ్యం అక్రమార్కులపై కొరడా | Ration Rice Illegally Stockpiled | Sakshi
Sakshi News home page

బియ్యం అక్రమార్కులపై కొరడా

Nov 3 2026 5:31 AM | Updated on Nov 3 2026 5:31 AM

Ration Rice Illegally Stockpiled

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 18 వ్యాపార సంస్థలపై దాడులు.. 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలు, దారి మళ్లింపుపైనా కేసులు 

25 కిలోల బస్తాపై 26 కిలోల లేబుల్‌.. ఎంఆర్‌పీపై అధిక ధరల స్టిక్కర్లు

దుకాణాలు మూసి, అక్రమాలను సరిచేసుకునే పనిలో వ్యాపారులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కృత్రిమ కొరత సృష్టిస్తూ వినియోగదారులను దోపిడీ చేస్తున్న వ్యాపారులపై పౌరసరఫరాల శాఖ దాడుల్లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మూడు రోజులపాటు అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోగా, 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఈటీఎఫ్‌), తూనికలు, కొలతల శాఖ (లీగల్‌ మెట్రాలజీ) అధికారులు సంయుక్తంగా గత నెల 29 నుంచి 31 వరకు రిటైల్, హోల్‌సేల్‌ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. బియ్యం విక్రయాల్లో వ్యాపారులు అనుసరిస్తున్న అక్రమ పద్ధతులు తనిఖీల్లో బయటపడ్డాయి.

ముఖ్యంగా 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోలుగా పేర్కొంటూ లేబుళ్లు అతికించి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బస్తాపై ముద్రించిన అసలు ధరను తొలగించకుండా, దానిపై ఎక్కువ ధరలతో కొత్త స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కంపెనీలు నిర్ణయించిన ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయించేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు కొన్ని వ్యాపార సంస్థలు అవసరమైన అనుమతులు, లైసెన్సులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ట్రేడ్‌ లైసెన్స్, జీఎస్టీ రిజిస్ట్రేషన్, కార్మిక శాఖ అనుమతులు, ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలు, దారి మళ్లింపు వ్యవహారాలపైనా అధికారులు దృష్టి సారించారు.

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు చేరాల్సిన బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, వాటిని రీసైక్లింగ్‌ చేసి 26 కిలోల బ్రాండెడ్‌ బ్యాగుల్లో నింపి విక్రయించినట్లు తేలింది. బియ్యం సరఫరా, నిల్వలు, విక్రయాల తీరును పరిశీలిస్తూ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న సంస్థలపై ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా, సరూర్‌నగర్, జీడిమెట్ల, అల్వాల్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి చట్టప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొంది.

పౌరసరఫరాల శాఖ దాడుల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని రైస్‌ మిల్లర్లు, ట్రేడర్స్, హోల్‌సేల్‌ డిపోలు, రిటైలర్లు అప్రమత్తమయ్యారు. గత రెండు రోజులుగా షాపుల షట్టర్స్‌ మూసివేసి 26 కిలోల బ్యాగుల్లో తక్కువగా ఉన్న బియ్యాన్ని సరిచేయడం, లేదంటే వేరే గోడౌన్‌లకు తరలించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. చౌకధరల దుకాణాల ద్వారా సేకరించిన బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి బ్రాండెడ్‌ లేబుళ్లు ఉన్న బస్తాల్లో నింపి విక్రయిస్తున్న మిల్లర్లు, రైస్‌ డిపోల హోల్‌సేల్‌ వ్యాపారులు కూడా అప్రమత్తమయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement