కుప్పంకు కృష్ణాజలాలు రేవంత్‌ గురుదక్షిణే.. | Harish Rao Fires On CM Revanth Over Water Crisis In Telangana | Sakshi
Sakshi News home page

కుప్పంకు కృష్ణాజలాలు రేవంత్‌ గురుదక్షిణే..

Nov 3 2026 5:54 AM | Updated on Nov 3 2026 5:54 AM

Harish Rao Fires On CM Revanth Over Water Crisis In Telangana

అల్వాలలో ఓ రైతు ఎండిపోయిన తన పంట గురించి మాజీ మంత్రి హరీశ్‌రావుకు వివరిస్తున్న దృశ్యం

సకాలంలో మోటార్లు ప్రారంభించకపోవడంతోనే.. వరద దిగువకు వెళ్లింది

మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

వనపర్తి: ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ ఇచ్చేందు­కు 700 కి.మీ. దూరంలోని కుప్పంకు కృష్ణాజలాలను తరలించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ధ్వజ­మెత్తారు. పాలమూరును ఎండబెట్టి దిగువకు వర­దను వదిలిపెట్టిన ఘనత అసమర్థ పాలకుడు రేవంత్‌కే చెల్లుతుందన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో ఎండిన పంటలను ఆయన మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌ మాట్లాడారు. 

నీళ్లకు, కరెంటుకు, పంటలకు సెలవు ఇవ్వాలంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన బాధ్యతల నుంచి సెలవు ఇచ్చే రోజులు దగ్గర పడ్డాయన్నారు. శ్రీశైలానికి 221 టీఎంసీలు, జూరాలకు 252 టీఎంసీల నీళ్లు వచ్చినా.. సకాలంలో వరద జలాలను సద్వినియోగం చేసుకుని చెరువులు, రిజర్వాయర్లను నింపుకునే ప్రయత్నం చేయకపోవడంతో పాలమూరు జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, వచ్చేది కేసీఆర్‌ సర్కారేనని, మళ్లీ పాలమూరులో పసిడి పంటలు పండేలా సాగునీటి వనరులను సమకూరుస్తామని చెప్పారు. 

50 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా...
కేఎల్‌ఐ లిఫ్ట్‌లోని మోటార్లు పూర్తిస్థాయిలో నడిస్తే.. నెలకు పది టీఎంసీల చొప్పున ఇప్పటి వరకు 50 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా.. ఇప్పటి వరకు లిఫ్ట్‌ చేసింది కేవలం 18 టీఎంసీలేనని, మిగతా నీటిని గురువు చంద్రబాబుకు వదిలిపెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డిలో వారం రోజుల్లో తీసే మట్టి తవ్వకం కూడా చేపట్టలేని చేతగాని ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ­న్నారు. ఒక్క అల్వాల గ్రామంలోనే 250 ఎకరాలు, రాష్ట్రవ్యా­ప్తంగా 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినా.. రైతులు, రైతుకూలీలకు ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ, సాయం ఏమి చేస్తారో చెప్పకపోవడం శోచనీయమన్నారు. ఆంధ్రాకు వరదలొస్తే పరిగెత్తుకొచ్చిన కేంద్ర బృందాలు తెలంగాణలో కరువు వస్తే ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలనే ధ్యాస రాష్ట్రాన్ని పాలిస్తున్న రేవంత్‌రెడ్డికి, కేంద్ర మంత్రులకు, బీజేపీకి లేకపోవడం బాధాకరమన్నారు. రైతులకు పరిహారం ఇచ్చే వరకు రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement