మెట్రోకు రూ.275 కోట్లు
ఇందులో రెండో దశకు రూ.150 కోట్లు
మొదటి దశకు మరో రూ.125 కోట్లు
బడ్జెట్ కేటాయింపుల మేరకు విడుదల
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం రూ.275 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం రెండు జీవోలు విడుదల చేసింది. రెండో దశ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించగా అందులో మొదటి విడతగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్‌కు రూ.150 కోట్లను విడుదల చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులను జారీ చేసింది.
అలాగే ప్రస్తుతం వివిధ కారిడార్‌లలో నడుస్తున్న మెట్రో రైళ్ల నిర్వహణ, కొత్త కోచ్‌ల కొనుగోళ్లు, తదితర అవసరాల కోసం మరో రూ.125 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు వెలువరించారు.
పాతబస్తీలో విస్తరణ...
ప్రస్తుతం మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కి.మీ కారిడార్‌లో రోడ్ల విస్తరణ, ఆస్తుల సేకరణ, పరిహారం చెల్లింపు, తదితర పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 850 నిర్మాణాలను తొలగించేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ చర్యలు చేపట్టింది. మెట్రో రెండో దశపైన కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే ఈ కారిడార్‌లో నిర్మాణ పనులను చేపట్టేందుకు వీలుగా రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం రూ.150 కోట్లు విడుదల చేసినట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు తెలిపారు.
కొత్త కోచ్‌ల కొనుగోళ్లు
ప్రభుత్వం విడుదల చేసిన మరో రూ.125 కోట్లను కొత్త కోచ్‌ల కొనుగోళ్లు, తదితర అవసరాలకు వినియోగించనున్నారు. ఒక కోచ్ నిర్మాణానికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఖర్చు కావచ్చునని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. కోచ్‌ల సంఖ్య పెరిగితే మరో 2 లక్షల మంది అదనంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న మూడు కోచ్‌ల మెట్రోలకే అదనంగా మరో 3 కోచ్‌లను ఏర్పాటు చేస్తారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మగవాళ్లకి ఏముంది?


