కరీంనగర్ సిటీ/కొత్తపల్లి(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న చంద్రకళ (30) మృతికి ప్రేమ వేధింపులే కారణమని పోలీసులు తేల్చారు. ఇందుకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దక్కలి చిన్నయ్య, లక్ష్మమ్మ దంపతుల మూడో కుమార్తె చంద్రకళ (30) కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఉద్యోగం కోసం హెదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన గజ్జల హరికృష్ణతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. చంద్రకళను వివాహం చేసుకుంటానని రెండేళ్లుగా నమ్మిస్తూ వస్తున్నాడు. కొంతకాలం తర్వాత పెళ్లికి నిరాకరించడమే కాకుండా, శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇద్దరి మధ్య ఫోన్లో గొడవ జరిగింది. ‘నువ్వు చస్తే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా’ అని హరికృష్ణ వేధించడంతో చంద్రకళ తాను ఉంటున్న వసతిగృహంలోని గదిలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహనికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.
విద్యార్థి, దళిత సంఘాల నిరసన
చంద్రకళ కుటుంబానికి న్యాయం చేయాలని పలు విద్యార్థి, పౌరహక్కులు, దళిత సంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకుని ధర్నాకు దిగారు. యూనివర్సిటీలో తరగతులు బహిష్కరించారు. విద్యార్థిని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషి యా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌యూ వీసీ ఉమేశ్‌కుమార్, రిజి్రస్టార్ సతీశ్ కుమార్ ఆస్పత్రికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి, దళిత సంఘాల నాయకులతో మాట్లాడారు.
మృతురాలి కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తక్షణసాయంగా రూ.1.50 లక్షలు అందించారు. ఆందోళన చేసినవారిలో దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్వాడి సుదర్శన్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి, పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, విరసం ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాజయ్య, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కరికె మహేశ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అరవింద్, ఏఐఎస్‌ఎఫ్ శాతవాహన యూనివర్సిటీ కన్వీనర్ వరుణ్ శివాజీ పాల్గొన్నారు.
కనిపించని వార్డెన్లు, ఇన్‌చార్జిలు
వసతిగృహంలో ఆత్మహత్య చేసుకున్న చంద్రకళ మృతదేహాన్ని చూసేందుకు హెచ్‌వోడీలు, వార్డెన్లు, కేర్‌టేకర్లు రాకపోవడం బాధకరమని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఎస్‌యూ మహిళా వసతిగృహంలో సుమారు 400 మందికి పైగా విద్యార్థినులు ఉంటారు. వీరి పర్యవేక్షణకు ఇద్దరు వార్డెన్లు, ఒక కేర్‌టేకర్ ఉన్నారు. నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన వార్డెన్లు కంటికి కూడా కనిపించరని విద్యార్థులు చెబుతున్నారు.
నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే వచ్చి వెళ్తారని ఆరోపిస్తున్నారు. చంద్రకళ ఆత్మహత్య విషయంలో వార్డెన్లు, కేర్ టేకర్ల పర్యవేక్షణ లోపం కూడా ఉందని పేర్కొంటున్నారు. హాస్టల్‌లో విద్యార్థినుల ప్రవర్తనపై తప్పనిసరిగా దృష్టి సారించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: భాగ్యశ్రీని బండరాయితో మోది.. కిరాతకంగా హత్య!


