సాక్షి, హైదరాబాద్: నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే మద్యం మత్తులో కసాయిగా మారాడు. అభం శుభం తెలియని ఐదేళ్ల కుమారుడిని హత్యచేశాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని బోరబండ పరిధి, శిల్పినగర్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిల్పినగర్‌కు చెందిన విద్యాసాగర్ మద్యం మత్తులో నవంబర్ 1వ తేదీ, ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తన ఐదేళ్ల కుమారుడు విజయ్‌ను గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై అక్కడినుంచి పరారయ్యాడు.
అయితే, ఘటన జరిగిన సమయంలో బాలుడి తల్లి దుర్గ క్యాటరింగ్ పనికి వెళ్లింది. దీంతో ఇంట్లో తండ్రి, కుమారులు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున పని ముగించుకుని ఇంటికి వచ్చిన దుర్గకు కుమారుడు విగతాజీవిగా కనిపించాడు. ఉలుకు పలుకులేని కూమారుడిని చూసి ఆ తల్లి ఒక్కసారిగా షాక్‌కి గురైంది. కన్న తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయి, విగతాజీవిగా పడున్న ఆ కొడుకుని ఒళ్లోకి తీసుకుని తల్లి బోరున విలపించింది. ఆ కన్నతల్లి పడుతున్న వేదనను చూసిన చుట్టుపక్కల వారు గుండెభారంతో కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ విషయం స్థానికుల ద్వారా వెలుగులోకి రావడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. మరోవైపు పోలీసులకు సమాచారం అందేలోపే నిందితుడు విద్యాసాగర్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. దీంతో కన్నతండ్రే హత్యచేసినట్లుగా అనుమానం వ్యక్తం అయ్యింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు గల పూర్తి విషయాలు, ఇతర కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: తిన్న ప్లేట్లను కడిగేందుకు వెళ్లి... విషాదం!


