source: X
భారత్, శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్ 13న జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వేదిక మారింది. తొలుత ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా విశాఖపట్నానికి మార్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఢిల్లీ క్రికెట్ సంఘం (DDCA) చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో పాటు.. స్టేడియంలో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు కొనసాగుతుండటమే వేదిక మార్పునకు కారణమని తెలిపింది.
దీంతో డిసెంబర్ 13న జరగనున్న తొలి వన్డేకు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్‌లో రెండో వన్డే బెంగళూరులో, చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనున్నాయి.
కోహ్లీకి ఢిల్లీలో వీడ్కోలు మ్యాచ్ లేనట్లేనా..?
ఈ వేదిక మార్పుతో విరాట్ కోహ్లీ అభిమానుల్లో మరో చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. శ్రీలంకతో ఢిల్లీలో జరిగే మ్యాచ్ అతడికి సొంతగడ్డపై చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని భావించారు.
ఇప్పుడు మ్యాచ్ విశాఖకు మారడంతో ఢిల్లీలో కోహ్లీకి చివరి మ్యాచ్ ఆడే అవకాశం కనిపించడం లేదు. 2027లో ఢిల్లీకి మరో వన్డే మ్యాచ్ కేటాయిస్తుందా లేదా అన్నది బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
టీ20 సిరీస్ షెడ్యూల్
వన్డే సిరీస్ అనంతరం భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. డిసెంబర్ 22, 24, 27 తేదీల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. రాజ్‌కోట్, కటక్, పుణే నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
ఇదీ చదవండి: పాక్‌పై భారత్ విజయం.. చివర్లో ఉత్కంఠ


