రంజీ ట్రోఫీలో వరుసగా నాలుగో విజయం
రైల్వేస్‌పై 106 పరుగుల తేడాతో గెలుపు
దివ్యాన్ష్ సక్సేనా సెంచరీ
రాణించిన తనుశ్, ముషీర్, షమ్స్ ములానీ
ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక ‘ఫస్ట్‌క్లాస్’ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ముంబై జట్టు జోరు కొనసాగుతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగుతున్న ముంబై జట్టు... తాజా సీజన్‌లో వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా గురువారం ముగిసిన పోరులో 42 సార్లు చాంపియన్ ముంబై జట్టు 106 పరుగుల తేడాతో రైల్వేస్‌ను మట్టికరిపించింది. ప్రస్తుతం ముంబై 27 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 174/4తో గురువారం చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు 42.5 ఓవర్లలో 234/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఓపెనర్ దివ్యాన్ష్ సక్సేనా (136 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో సత్తా చాటాడు. సర్ఫరాజ్ ఖాన్ (29 నాటౌట్; 3 ఫోర్లు) అతడికి అండగా నిలిచాడు. అనంతరం 372 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రైల్వేస్ జట్టు చివరకు 77.2 ఓవర్లలో 265 పరుగులు చేసింది. ఇషాన్ గోయల్ (201 బంతుల్లో 103; 11 ఫోర్లు, 1 సిక్స్), జుబైర్ అలీ (117 బంతుల్లో 115; 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరు తప్ప మిగిలిన వాళ్లంతా విఫలం కావడంతో రైల్వేస్‌కు పరాజయం తప్పలేదు.
ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట ఆరో వికెట్‌కు 167 పరుగులు జోడించి కలవరపెట్టింది. అయితే మైదానంలో పాదరసంలా కదిలిన సర్ఫరాజ్ ఖాన్ ఈ జోడీని విడదీయడంలో కీలక పాత్ర పోషించాడు. సోదరుడు ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో ఇషాన్ గోయల్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా... ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ లెగ్ స్లిప్ వైపు డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రైల్వేస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆట చివరి గంటలో ముంబై మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకోవడంతోనే ఈ మ్యాచ్‌లో విజయం సాధ్యమైంది.
ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 4 వికెట్లు పడగొట్టగా... ముషీర్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తనుశ్ కొటియాన్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేయగా... రైల్వేస్ 259 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో తొలి దశ పోటీలు ముగియగా... తిరిగి వచ్చే ఏడాది జనవరి 17 నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. తదుపరి మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌తో ముంబై తలపడనుంది.
అజిత్ రామ్‌కు 7 వికెట్లు...
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో తమిళనాడు జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. చండీగఢ్ వేదికగా జరిగిన పోరులో తమిళనాడు ఇన్నింగ్స్ 259 పరుగుల తేడాతో చండీగఢ్‌ను ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 189/7తో ఆఖరి రోజు గురువారం రెండో ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన చండీగఢ్ చివరకు 64.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో అజిత్ రామ్ 7 వికెట్లు పడగొట్టాడు.
తొలి ఇన్నింగ్స్‌లో చక్కటి బ్యాటింగ్‌తో అజేయ శతకం బాదిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ బంతితోనూ సత్తా చాటాడు. అంతకుముందు తమిళనాడు 571/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగులకే ఆలౌటైంది. డబుల్ సెంచరీ సాధించిన తమిళనాడు బ్యాటర్ ప్రదోశ్ రంజన్ పాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇదే గ్రూప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన హిమాచల్ ప్రదేశ్‌కు 3 పాయింట్లు, రాజస్తాన్‌కు ఒక పాయింట్ దక్కాయి.
త్రిపుర సంచలనం
పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన త్రిపుర జట్టు రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో సంచలన విజయం నమోదు చేసుకుంది. అగర్తలా వేదికగా జరిగిన పోరులో త్రిపుర 133 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ సౌరాష్ట్రపై గెలుపొందింది. 342 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 131/7తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర 77.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది.
సీనియర్ బ్యాటర్ అర్పిత్ వసవాడా (189 బంతుల్లో 89; 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. త్రిపుర బౌలర్లలో సందీప్ సర్కార్ 4, అభిజిత్ సర్కార్ మూడు వికెట్లు పడగొట్టారు. గత మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న త్రిపురకు ఈ సీజన్‌లో ఇదే తొలి విజయం కాగా... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు చేసిన స్రీదమ్ పాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.
పృథ్వీ షా కెపె్టన్ ఇన్నింగ్స్...
కోల్‌కతా వేదికగా ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన పోరులో మహారాష్ట్ర జట్టు విజయం సాధించింది. బౌలర్ల జోరు సాగిన ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 10 వికెట్ల తేడాతో బెంగాల్‌ను ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 76/4తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ జట్టు చివరకు 54.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. అభిõÙక్ పొరెల్ (65; 5 ఫోర్లు, 1 సిక్స్), సుమంత గుప్తా (59; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్ దఢే, హితేశ్ వాలుంజ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 112 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర 19.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. కెపె్టన్ పృథ్వీ షా (50 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), సచిన్ దాస్ (68 బంతుల్లో 61 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ హాఫ్‌సెంచరీలతో జట్టును గెలిపించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మహారాష్ట్ర ప్లేయర్ తనయ్ సాంఘ్వీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో బోనస్ పాయింట్ ఖాతాలో వేసుకున్న మహారాష్ట్ర జట్టు 19 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరింది. బెంగాల్ (18 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది.
గుజరాత్ ఘనవిజయం
అహ్మదాబాద్ వేదికగా ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘనవిజయం సాధించింది. గురువారం ముగిసిన పోరులో గుజరాత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో కేరళను ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 41/1తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ... చివరకు 88 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. సచిన్ బేబీ (52; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో అర్జాన్ నాగ్‌వస్వల్లా 4 వికెట్లు పడగొట్టాడు. తాజా సీజన్‌లో గుజరాత్‌కు ఇది రెండో విజయం కాగా... కేరళకు వరుసగా రెండో ఓటమి. ఇదే గ్రూప్‌లో భాగంగా సర్వీసెస్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’ అయింది.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఢిల్లీకి 3 పాయింట్లు, సర్వీసెస్‌కు ఒక పాయింట్ దక్కాయి. భువనేశ్వర్ వేదికగా జార్ఖండ్, ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జార్ఖండ్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా 3 పాయింట్లు లభించాయి. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా కాన్‌పూర్‌లో బరోడా, ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’ కాగా... పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగిసింది. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా షిల్లాంగ్‌లో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టు 122 పరుగుల తేడాతో మేఘాలయపై గెలుపొందింది. సిక్కీం 201 పరుగుల తేడాతో మణిపూర్‌పై నెగ్గగా... మిజోరాం ఇన్నింగ్స్ 29 పరుగుల తేడాతో అరుణాచల్ ప్రదేశ్‌ను ఓడించింది.


