భారత్‌ ‘సిక్సర్‌’ | Indian mens hockey team wins Asian Champions Trophy title for the sixth time | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘సిక్సర్‌’

Nov 6 2026 1:14 AM | Updated on Nov 6 2026 1:14 AM

Indian mens hockey team wins Asian Champions Trophy title for the sixth time

ఆరోసారి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టైటిల్‌ సొంతం  

మొహాలీ: సొంతగడ్డపై పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను ఆరోసారి సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు 4–1 గోల్స్‌ తేడాతో జపాన్‌ జట్టును ఓడించింది. 2011, 2016, 2018, 2023, 2024లలో కూడా భారత జట్టు విజేతగా నిలిచింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత జట్టుకు తుది పోరు ఆరంభంలో షాక్‌ తగిలింది. 

ఆట మూడో నిమిషంలోనే జపాన్‌ ప్లేయర్‌ కజుమాసా మత్సుమోతో గోల్‌ చేయడంతో టీమిండియా 0–1తో వెనుకబడింది. ఎట్టకేలకు 42వ నిమిషంలో శిలానంద్‌ లాక్రా గోల్‌తో భారత్‌ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత 48వ నిమిషంలో దిల్‌ప్రీత్‌ సింగ్, 53వ నిమిషంలో జుగ్‌రాజ్‌ సింగ్, 54వ నిమిషంలో వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ ఒక్కో గోల్‌ చేయడంతో భారత్‌ 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. 

జపాన్‌ జట్టు తమకు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకోగా... భారత జట్టు మూడు పెనాల్టీ కార్నర్‌లలో రెండింటిని గోల్స్‌గా మలిచింది. ఈ టోర్నీలో ఫైనల్‌ చేరిన మూడుసార్లూ జపాన్‌ ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకోవడం గమనార్హం. అంతకుముందు జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో మలేసియా 5–2 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాను ఓడించి మూడో స్థానం సంపాదించింది.  

107 మొత్తం ఆరు జట్ల మధ్య జరిగిన ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో 20 మ్యాచ్‌ల్లో కలిపి 107 గోల్స్‌ నమోదయ్యాయి. ఇందులో ఫీల్డ్‌ గోల్స్‌ 59 కాగా... పెనాల్టీ కార్నర్‌లతో 42 గోల్స్‌... పెనాల్టీ స్ట్రోక్‌లతో 6 గోల్స్‌ వచ్చాయి. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 10 గోల్స్‌తో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement